– హాజరు కానున్న వెయ్యి మంది ప్రతినిధులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మహిళా వికలాంగుల సాధికారతపై మార్చిలో రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నామని ఎన్‌పీఆర్‌డీ సీనియర్ నాయకురాలు టి వరమ్మ, సంఘం ప్రధాన కార్యదర్శి యం. అడివయ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సమాజంలో మహిళా వికలాంగులు అన్ని రంగాల్లో వెనకబడి ఉన్నారని పేర్కొన్నారు. వారిపై లైంగిక వేధింపులు, దాడులు పెరిగి పోతున్నాయనీ, వాటిని అరికట్టెందుకు ప్రత్యేక రక్షణ చట్టం చేయాలని డిమాండ్ చేశారు. మానసిక వికలాంగులను ఆదుకునేందుకు చర్యలు తీసుకువాలని కోరారు. నిరుద్యోగ మహిళా వికలాంగులకు శిక్షణ ఇచ్చి, స్వయం ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ఒంటరి మహిళా వికలాంగుల కోసం ప్రతి జిల్లా కేంద్రంలో ప్రత్యేక హోంలను నిర్మించాలని పేర్కొన్నారు. మహిళా సాధికారత గురించి మాట్లాడుతున్న పాలకులు మహిళా వికలాంగుల సాధికారత గురించి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. పని ప్రదేశాల్లో వారిపై వేధింపులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో వారికి ప్రత్యేక వాటా కేటాయించాలని డిమాండ్ చేశారు. సంక్షేమం, సాధికారత, విద్య ఉపాధి, ఆరోగ్యంపై మార్చిలో రాష్ట్ర సదస్సు నిర్వహించి, భవిషత్ కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. రాష్ట్ర సదస్సుకు 33 జిల్లాల నుంచి వెయ్యి మంది మహిళా వికలాంగులు ప్రతినిధులుగా హాజరవుతారని తెలిపారు. మరోవైపు మహిళా విభాగం రాష్ట్ర స్థాయి సమావేశాన్ని హైదరాబాద్‌లోని రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. దీనిలో ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర కోశాధికారి ఆర్ వెంకటేష్, ఉపాధ్యక్షలు బి స్వామి, సహాయ కార్యదర్శి జె దశరథ్, మహిళా విభాగం రాష్ట్ర కో కన్వీనర్ నాగలక్ష్మి, యశోద, రాష్ట్ర కమిటీ సభ్యులు శశికల, సావిత్రి, దుర్గ, జయలక్ష్మి, సాయిగీత, పార్వతి, కవిత తదితరులు హాజరయ్యారు.