– కేంద్ర బడ్జెట్‌పై ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌లో విద్యారంగానికి మొండిచేయి చూపిందని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి విమర్శించారు. రూ.47.65 లక్షల కోట్ల బడ్జెట్‌లో విద్యకు రూ.1.21 లక్షల కోట్లు (2.54 శాతం) కేటాయిం చిందని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2014కు ముందు కేంద్ర బడ్జెట్‌లో 3.5 శాతానికిపైగా విద్యకు కేటాయింపులుండేవని గుర్తు చేశారు. 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి విద్యకు నిధుల కేటాయింపు క్రమంగా తగ్గుతున్నదని పేర్కొన్నారు. ప్రభుత్వ విద్యారంగాన్ని వదిలేస్తున్నారని తెలిపారు. ఇది ప్రయివేటు విద్యారంగానికి మేలు జరగాలనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతున్నదని విమర్శిం చారు. నూతన విద్యావిధానం-2020 గొప్పలు చెప్పిన మోడీ ప్రభుత్వం బడ్జెట్‌లో మొండిచేయి చూపిందని పేర్కొన్నారు. పూర్వ ప్రాథమిక విద్య గురించి గొప్పగా చెప్పి అమలు కోసం నిధుల కేటాయింపులేవని ప్రశ్నించారు. 15 లక్షల ప్రభుత్వ పాఠశాలల్లో 25 కోట్ల మంది విద్యార్థులు చదువుతుంటే రూ.73,498 కోట్లు కేటాయించారని తెలిపారు. ఉన్నత విద్యలో పది కోట్ల మంది విద్యార్థులుంటే రూ.47,619 కోట్లు కేటాయించారని వివరించారు. నేటి సవాళ్లకు అనుగుణంగా విద్యారంగాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేయలేదని విమర్శించారు. ఆదాయపు పన్ను శ్లాబులను యథాతథంగా కొనసాగించడమంటే ఉద్యోగులు, ఉపాధ్యాయుల నిజవేత నాలను తగ్గించడమే అవుతుందని తెలిపారు. ద్రవ్యోల్బణానికి అనుగుణంగానైనా ఆదాయపు పన్ను శ్లాబులను పెంచాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్లు, సంపన్న వర్గాలకు రాయితీలు పెంచడం వల్ల ప్రభుత్వ ఆదాయం తగ్గుతున్నదని పేర్కొన్నారు. రూ.16.85 లక్షల కోట్లతో దేశాన్ని అప్పులకుప్పగా మార్చారని విమర్శించారు. సామాన్యులకు అప్పుల భారం మోపుతూ కార్పొరేట్లకు రాయితీలు కల్పిస్తున్నారని తెలిపారు.