– అక్రమ ధాబాలు, ఆక్రమణలను తొలగించాలి
– ప్రమాదాల నివారణకు సమన్వయంతో పనిచేయాలి
నవతెలంగాణ – కామారెడ్డి : జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలను పటిష్టంగా చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్ అధికారులను ఆదేశించారు. గురువారం ఐడీఓసీలో జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశాన్ని అదనపు కలెక్టర్ విక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రధాన రహదారులపై ప్రమాదాలకు కారణమయ్యే ప్రాంతాలను గుర్తించి, అవసరమైన భద్రతా చర్యలను వెంటనే చేపట్టాలని సూచించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు.
అటవీ ప్రాంతాల గుండా వాహనాలు ప్రయాణించే సమయంలో వన్యప్రాణులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అటవీ అధికారి సూచించారు. అటవీ ప్రాంతాల్లో వాహనదారులు వేగ నియంత్రణ పాటిస్తూ వన్యప్రాణుల సంరక్షణకు సహకరించాలని కోరారు.
జాతీయ రహదారుల వెంబడి అనధికారికంగా నిర్వహిస్తున్న అక్రమ ధాబాలు, రహదారి భద్రతకు అవరోధంగా ఉన్న అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలను గుర్తించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని సమావేశంలో చర్చించారు. రహదారులపై వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా సంబంధిత శాఖలు సమన్వయంతో చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. ప్రమాదకర మలుపులు, రహదారుల పరిస్థితి, సూచిక బోర్డులు, వేగ నియంత్రణ చర్యలు తదితర అంశాలపై నిరంతరం పర్యవేక్షణ చేపట్టి ప్రమాదాలను తగ్గించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రహదారి భద్రతతో పాటు పర్యావరణం, వన్యప్రాణుల సంరక్షణకు సమాన ప్రాధాన్యతనిస్తూ అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అదనపు కలెక్టర్ విక్టర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ నర్సింహారెడ్డి, అటవీ శాఖ అధికారి నీరజ్, ఆర్‌అండ్‌బీ ఈఈ అజ్మీరా రామ, ఎక్సైజ్ శాఖ అధికారి ముకుంద రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి ప్రసన్న, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ రవితేజతో పాటు సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు.



