Monday, June 22, 2026
E-PAPER
Homeఖమ్మంమొక్కు"బడి" గా వస్తున్న విద్యార్థులు 

మొక్కు”బడి” గా వస్తున్న విద్యార్థులు 

- Advertisement -

– వారం గడిచినా 60 శాతమే హాజరు
– 3,030 మందికి 1,803 మంది మాత్రమే హాజరు
నవతెలంగాణ – అశ్వారావుపేట

ఈ ఏడాది  విద్యాసంవత్సరం ప్రారంభమై వారం రోజులు పూర్తయినా ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల హాజరు ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. సోమవారం మండలంలోని జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలల హాజరు వివరాల ప్రకారం మొత్తం నమోదైన 3,030 మంది విద్యార్థుల్లో 1,803 మంది మాత్రమే పాఠశాలలకు హాజరు కాగా, 1,227 మంది గైర్హాజరయ్యారు. దీంతో హాజరు శాతం సుమారు 60 శాతానికి పరిమితమైంది.

మండలంలోని 71 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు కొనసాగుతున్నప్పటికీ హాజరు శాతం తక్కువగా ఉండటం విద్యాశాఖ అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. జెడ్పీ ఎస్ఎంఎస్ అశ్వారావుపేట కాంప్లెక్సు లో 759 మంది నమోదైన విద్యార్థుల్లో 411 మంది మాత్రమే హాజరు కాగా, 348 మంది గైర్హాజరయ్యారు. 

నారాయణపురం కాంప్లెక్సు లో 659 మందికి గాను 378 మంది, 
అచ్యుతాపురం కాంప్లెక్సు లో 515 మందికి గాను 307 మంది హాజరయ్యారు.
మామిళ్లవారిగూడెం కాంప్లెక్సు లో 520 మందిలో 341 మంది, 
అశ్వారావుపేట బాలికోన్నత పాఠశాల కాంప్లెక్సు లో 342 మందిలో 210 మంది, 
గుమ్మడివల్లి కాంప్లెక్సు లో 235 మందిలో 156 మంది మాత్రమే హాజరయ్యారు.
విద్యా సంవత్సరం ప్రారంభ దశలోనే విద్యార్థుల హాజరు పెరగాల్సి ఉండగా, ఇంకా 40 శాతం మంది విద్యార్థులు పాఠశాలలకు దూరంగా ఉండటం గమనార్హం. 

వర్షాకాలం ప్రారంభం, వ్యవసాయ పనులు, వలస కుటుంబాల పిల్లలు ఇంకా తిరిగి రాకపోవడం,కొంతమంది విద్యార్థుల అడ్మిషన్ ప్రక్రియ పూర్తి కాకపోవడం వంటి కారణాలు హాజరు తగ్గడానికి కారణంగా భావిస్తున్నారు. హాజరు శాతాన్ని పెంచేందుకు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో ప్రత్యేకంగా మాట్లాడి విద్యార్థులను పాఠశాలలకు పంపే లా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం నమోదవుతున్న హాజరు కంటే రానున్న రోజుల్లో గణనీయమైన పెరుగుదల సాధించాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -