విద్యార్థులంటే ర్యాంకులేనా?

విద్యార్థులంటే ర్యాంకులేనా?విద్యాసంస్థలు దేశీయ, విదేశీయ అనుకరణలతో పలు అనేక విద్యావ్యవస్థలలో మార్పులు పిల్లలపై ఒత్తిళ్ల ప్రభావం చూపుతున్నది. వారిలో మానసికంగా ఒక ప్రత్యేకమైనటువంటి అదనపు బరువును వారి తలపై పెట్టడంతో సంతోషకరమైన, ఉల్లాసభరితమైన బాల్యాన్ని ఒక చరసాలలో బందీ చేసినట్టుగా కొనసాగుతున్నది. మండెడు పుస్తకాలతో బడి సంచి మోయలేని బరువుతో ప్రాథమిక విద్య అభ్యసిస్తున్న నేటి విద్యార్థుల కష్టాలు చెప్పలేనివి.నాటి విద్యా వ్యవస్థలో విద్యతోపాటు ఆటాపాటలు ఉల్లాసంగా ఆడుకునే తరుణం నేటికాలంలో కరువైపో యింది. ర్యాంకుల వేటలో పిల్లలకు నియమిత టార్గెట్‌ను నియమించడం అది ఉపాధ్యాయుల కైతేనేమి తల్లి దండ్రులకైతేనేమి సాధారణమైపోయింది. ఈ పరిణామక్రమంలో విద్యార్థుల చదవంటే ర్యాంకులకేనా? చదువుంటే ఉన్నత ఉద్యోగాలేనా? అనే ప్రశ్న పిల్లలలో వెంటాడుతుంది! తల్లిదండ్రులు పిల్లలను మందలిస్తున్న విషయంలో ‘ఫలానా అబ్బాయి ఎంత బాగా చదువుతున్నాడు? ఫలానా మన ఇంటి పక్కన అమ్మాయికి అంత పెద్ద ర్యాంకు వచ్చింది?’ అని తమ పిల్లలను ఒక సందిగ్ధ వాతావరణంలోకి తీసుకుపో తున్నారు. ఒకరకంగా వారి ఉన్నతని కోరుకుంటూ తల్లి దండ్రులు, ఉపాధ్యాయులు చేస్తున్నటువంటి కార్యక్రమం గొప్పదే. కానీ పిల్లల విద్య ప్రమాణస్థితులను గమనించడం లేదు. వారు ఏ రంగంలో నిష్ణాతులో గుర్తించడం లేదు. ఒకవైపు తల్లిదండ్రులు కావచ్చు, మరోవైపు ఉపాధ్యాయులు కావచ్చు ఎవరైనా గాని తమ పిల్లలకు సరైన మార్గదర్శకత్వం లభించక యాంత్రిక విద్య ప్రయాణంలోకి తెలిసి, కొనసాగుతున్న పరిస్థితులు నేడు కనిపిస్తున్నాయి.
ఇటీవల జూమ్‌ ఫ్లాట్‌పామ్స్‌లో పిల్లలకు సంబంధించి అభద్రత నెలకొన్న విషయం తెలిసిందే. ఈ జూమ్‌ ద్వారా పిల్లలకు విద్యాబోధన చేయడం అతిపెద్ద మొత్తంలో కరోనా సంభవించిన సందర్భంలో ఏర్పడింది. దీంతో మరో ప్రత్యామ్నాయం లేకుండా ఆన్‌లైన్‌ క్లాసులు దిక్కవడంతో నేటికీ కొన్ని ఆ విధానాన్నే కొన్ని విద్యాసంస్థలు అక్కడక్కడ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఆన్‌లైన్‌ క్లాసులు వల్ల ఇతర కొన్ని దేశాలలో ఇంతకుముందే ఉపయోగించినప్పటికీ మన దేశంలో అంతగా ప్రాధాన్యత లేదు. దీంతో ఆన్‌లైన్‌ క్లాసులకు అలవాటు పడకపోవడం, సాంకేతిక పరమైన సాధనాలు అందరికీ అందుబాటులో లేకపోవడం, అవగాహన కూడా అంతంత మాత్రమే ఉండటం వలన విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్న మాట వాస్తవం. నేరుగా విద్యార్థులకు విద్యను బోధిస్తున్న సందర్భంలోనే ఉపాధ్యాయులు, విద్యార్థులకు మధ్య సహజం ఎన్నో అవంతరాలు ఉంటాయి. అలాంటి ఆన్‌లైన్‌లో క్లాసుల వరకు ఎంతోకొంత విన్నప్పటికీ సందేహాల నివృత్తి విషయంలో ఇదో సమస్యగా పరిణమించింది. ఇది విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులను గందరగోళంలో పడేసింది. దీంతో ప్రతిభ విషయంలో వెనుకంజ వేశారని మాత్రం చెప్పొచ్చు. అదే సమయంలో కరోనా తప్పని పరిస్థితుల్లో ఈ విధానం కొనసాగిందన్న విషయం కూడా మన గమనంలో ఉండాలి.
కానీ ప్రస్తుతం కూడా కొన్ని విద్యాసంస్థలు ఆన్‌లైన్‌ క్లాసులు తప్పనిసరి చేస్తున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఆన్‌లైన్‌ క్లాస్‌లంటూ పిల్లల చేతిలో సెల్‌ఫోన్‌, ట్యాబ్‌, ల్యాప్‌టాప్‌ వారి చేతికిచ్చి తల్లిదండ్రులు పర్యవేక్షించడం లేదు. దీంతో ఇంటర్‌నెట్‌ను దుర్వినియోగం చేసుకుని పిల్లలు రకరకాల యాప్‌లు డౌన్లోడ్‌ చేసుకుంటూ, వివిధ రకాల సైట్లను ఓపెన్‌ చేస్తూ దారి తప్పుతున్నారు. వారిని ఓ కంట కనిపెట్టాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనన్న విషయం మరవకూడదు. ఆన్‌లైన్‌ క్లాసులు పిల్లలకు ఏ విధంగా ఉపయోగపడతాయనేది ఫలితాలు వచ్చేవరకు తెలియదు. కానీ ఇలా ఒకవైపు మండెడు పుస్తకాలతో పిల్లలకు టార్గెట్లు పెట్టి ప్రత్యేకమైనటువంటి బోధనలు పాఠశాల యాజమాన్యాలు చేయడం సరికాదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
విద్యాసంస్థల్లోనే కాకుండా ఇంటికెళ్లాక కూడా సెల్‌ఫోన్‌, యూట్యాబులలో ఆన్‌లైన్‌ క్లాసులంటూ విద్యార్థులను ఒత్తిడికి గురిచేయడం వల్ల పిల్లలు మానసికంగా బలహీనపడటమే కాదు, చదువుల్లోనూ రాణించలేరనేది నిపుణుల అభిప్రాయం. ముందు మన పిల్లల్లో ఉన్న సృజనాత్మకత ఏ రంగంలో ఉన్నదో వెలికితీయాలి. ఆ చొరవను ముందు తల్లిదండ్రులు తీసుకోవాలి.విద్యాసంస్థల్లో కూడా ఉపాధ్యాయులు వారిని ప్రోత్సహించాలి. అప్పుడే వారు ఏ రంగంలో స్థిరపడే అవకాశముందో తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇది వారి ఉన్నతికే కాదు, సమాజ అభివృద్ధికి బాటలు వేస్తుంది.
డా.చిటికెన కిరణ్‌ కుమార్‌
9490841284

Spread the love