తప్పెవరిది…శిక్షెవరికి?

తప్పెవరిది...శిక్షెవరికి?మహబూబాబాద్‌ నుంచి వరంగల్‌కు ఉదయం పూట కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌కి వెళ్లడానికి బయలుదేరి రైల్వేస్టేషన్‌కు వెళ్లాను. కోణార్క్‌లో ముందుభాగాన ఇంజన్‌ తర్వాత ఒక జనరల్‌ భోగి ఉంటుంది దాని వెనుక ఏసీ బోగీలుంటాయి, సాధారణ భోగిలో ఎక్కడానికి స్థాయికి మించి ఎక్కువ రష్‌ ఉండటంతో అతి కష్టం మీద ట్రెయిన్‌ ఎక్కడానికి ప్రయత్నం చేశాను, నాతోపాటు ఒక స్త్రీ సంకలో చిన్న పాపను ఎత్తుకొని ట్రైన్‌ ఎక్కడానికి ప్రయత్నం చేస్తూ కింద పడింది, కింద పడటంతో చంకలో ఎత్తుకున్న పాపకు తలకు దెబ్బ తగిలింది. అయినా కూడా ఆ స్త్రీ కింద పడి లేచి మళ్లీ ట్రెయిన్‌ ఎక్కడానికి ప్రయత్నం చేస్తూ ఉండగా… ఆ పాప వాంతి చేసుకుంది వృత్తిరీత్యా డాక్టర్‌ కావడంతో ఆ వాంతి చేస్తున్న క్రమాన్ని అబ్జర్వ్‌ చేసిన నేను వెంటనే ఆమెను బండి ఎక్కనీయకుండా ఆపాను. నేను కూడా వరంగల్‌కు వెళ్లే ప్రయాణాన్ని విరమించుకుని వెంటనే 108 కు ఫోన్‌ చేసి ఆమెను జిల్లా కేంద్రంలో ఉన్న హాస్పిటల్‌కి తరలించాను. నేననుకున్నది నిజమే అయింది. ఆ పాపకు తలకు దెబ్బ తగలడంతో బ్రెయిన్‌కు గాయమై నాలుగు రోజులకు అభం శుభం తెలియని ఆ పాప చనిపోయింది, పుట్టెడు దు:ఖంలో ఉన్న తల్లిని కౌన్సెలింగ్‌ చేసి నెమ్మదిగా ఇంటికి తరలించాము. పదహారు రోజుల తర్వాత నాకు ఒక ఫోన్‌ కాల్‌ వచ్చింది పాప తల్లిదగ్గర నుంచి. సారాంశమేమిటంటే రైలు ఎక్కుతున్న క్రమంలో కింద పడిన సందర్భంలో గర్భంతో కూడా ఉన్న ఆ తల్లి కడుపుకు దెబ్బ తగిలిందని, దాంతో కడుపులో ఉన్న పిండం కూడా చనిపోయిందని తెలిసింది. నాకు ఒక వారం రోజుల పాటు నిద్ర పట్టలేదు. కారణం గర్భంతో ఉన్న తల్లి చంటి పిల్లను సంకలో పెట్టుకొని ఒకే ఒక జనరల్‌ బోగీలో ఎక్కడానికి ప్రయత్నం చేస్తూ కింద పడటంతో పుట్టినపాప చనిపోయింది.కడుపులో ఉన్న పిండం కూడా చనిపోయింది. దీనికి ఎవరు బాధ్యులు? తప్పెవరిది ?! శిక్షెవరికి?! అనేది నాటి నుంచి నేటివరకు నా అంతర్మదనాన్ని తొలుస్తున్న ప్రశ్న.
ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా ఏదో చేయాలి, ఏదైనా చేయాలనే తపన నాలో సంఘర్షణకు దారితీసింది. ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన మనిషిగా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. కానీ ఆలోచించాలి. ఊరకనే ఉండకూడదని, ఒక ప్రయత్నమైతే చేద్దామని అప్పటి నుంచి ఒక ఉద్యమాన్ని ప్రారంభించాను. రైలులో పేద ప్రజలు ప్రయాణించేందుకు వీలుగా జనరల్‌ భోగిలను పెంచేందుకు ప్రధానికి దేశవ్యాప్త కోటి ఉత్తరాల కార్యక్రమం.’ఇది మా డిమాండ్‌ అనుకోండి, విజ్ఞప్తి అనుకోండి, విన్నపమనుకోండి’ ఏది ఏమైనా మా కోరిక ఏంటంటే ప్రతి రైల్లో ఐదు సాధారణ బోగీలుండాలి. ఒక సాధారణ మనిషి కూలి కావచ్చు, ఉద్యోగస్తుడు కావచ్చు, చిన్న చిన్న పనులకు ట్రెయిన్‌ ఎక్కే ప్రతి వ్యక్తి అనుభవిస్తున్న సుదీర్ఘ సమస్య. ప్రతిరోజు అనుభవిస్తున్నటువంటి ఇబ్బంది ఇది.స్టేషన్లు పెరుగుతున్నాయి, వందే భారత్‌ లాంటి అత్యున్నత ఆధునిక ట్రెయిన్స్‌ కూడా వస్తున్నాయి, ఉన్న స్టేషనులను కూలగొట్టి కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నారు.
కానీ ఒక సాధారణ ప్రయాణికునికి సౌకర్యాలు అనుకున్న స్థాయిలో పెరగలేదు. ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం పెట్టిన రెండు సాధారణ భోగిల అంచనా ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఇది చాలా అన్యాయం. ప్రపంచంలో రెండవ అతిపెద్ద ట్రాన్స్‌పోర్ట్ట్‌ సిస్టంగా ఉన్న భారతదేశ రైల్వేలు, ఈ చిన్న సమస్యను వారి దృష్టికి సరైన మార్గంలో చేరితే పరిష్కారం కచ్చితంగా దొరుకుతుందనేది నా భావన. అందుకే మిత్రులు, శ్రేయోభిలాషుల సహకారంతో వరంగల్‌ కేంద్రంగా- కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్‌ అంపశయ్య నవీన్‌ గారి చేతుల మీదుగా మొదటి ఉత్తరము ప్రధానమంత్రి గారికి రాయించి దేశవ్యాప్త కోటి ఉత్తరాల కార్యక్రమాన్ని మొదలుపెట్టాము.
ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలోని 12 జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని తీసుకొని, సూరత్‌ కూడా వెళ్లి అక్కడ కొన్ని కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము. ఈ మధ్యనే ఒక జాతీయ అవార్డు తీసుకోవడానికి బెంగళూరుకు వెళ్లగా అక్కడ కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిసింది. మా ఆశ, ఆశయం, లక్ష్యం ఒక్కటే. ఒక సాధారణ పౌరునికి అత్యంత సరసమైన ధరలతో ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్లగలిగే సౌకర్యం రైల్వేలోనే కల్పించాలనేది. 130 కోట్ల పైగా ఉన్నటువంటి దేశ జనాభాలో సుమారు 30 కోట్ల మంది, ప్రతిరోజూ రైల్లో ప్రయాణం చేస్తున్నారనేది ఒక అనధికారిక అంచనా. అందుకే దేశ ప్రజల కోరిక, విజ్ఞప్తి ఏమిటంటే? ప్రతి రైలులో ఐదు సాధారణ భోగిలు ఉండాలనేది. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ ఈ అంశాన్ని ఒక సామాజిక బాధ్యతగా నడుం బిగించి ప్రధానికి ఒక ఉత్తరం ముక్క రాయాలి. ప్రతి ఒక్కరికీ ఆండ్రాయిడ్‌ మొబైల్‌ ఉన్నందున అడ్రస్‌ దొరకడం పెద్ద పనేం కాదు. గూగుల్‌లో సెర్చ్‌ చేస్త తప్పక వస్తుంది. ప్రతి రైలులో జనరల్‌ భోగీలను ఐదు పెంచేందుకు ఒక సమూహంగా ప్రయత్నం చేస్తే తప్పకుండా అనుకున్నది సాధించగలమనే నమ్మకం ఉంది. ఈ కోటి ఉత్తరాల కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుతున్నాను.
అశోక్‌ పరికిపండ్ల
9989310141

Spread the love