రాజ్యాంగ రక్షణే నేటి తక్షణ కర్తవ్యం

రాజ్యాంగ రక్షణే నేటి తక్షణ కర్తవ్యంస్వతంత్ర భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో ప్రధాన పాత్రను నిర్వహించడమే కాక, మనదేశంలో అస్పృశ్యతా నివారణకు, కుల నిర్మూలన, ఛాందస భావాలకు, మూఢవిశ్వాసాలకు వ్యతిరేకంగా తన జీవితాంతం కృషిచేసిన మహావ్యక్తి డా|| బి.ఆర్‌. అంబేద్కర్‌ 133వ జయంతిని దేశం జరుపుకుంటోంది.
కఠోరమైన పరిశ్రమ, నిరంతరమైన పఠనా వ్యాసంగం, అచంచలమైన దీక్ష ఆయనను ప్రపంచంలో ప్రధమశ్రేణిలో నిలబెట్టినాయి. అంబేద్కర్‌ పుస్తకాలకే ఎక్కువ ఖర్చుపెట్టేవారు. ఆయన లండన్‌లో ఒక్క నిమిషము కూడా వృధాకాకుండా చదివేవారు. బ్రిటీష్‌ మ్యూజియంలోని గ్రంథాలే కాక ఇండియా ఆఫీసు గ్రంథాలయం, నగర గ్రంథాలయంలో ఎక్కువసేపు గడిపేవారు. న్యాయశాస్త్రం ఒక్కటే కాకుండా అర్థశాస్త్రంలో యమ్‌.యస్‌.సి. డాక్టరేట్‌ పట్టాకోసం విశేష కృషిని సల్పి రెండేళ్ళ వ్యవధిలో మూడు పట్టాలు సాధించారు. 1921లో లండన్‌ విశ్వవిద్యాలయానికి ‘ప్రొవిన్షియల్‌ డీసెంట్రలైజేషన్‌ ఆఫ్‌ ఇంపీరియల్‌ ఫైనాన్స్‌ ఇన్‌ బ్రిటీష్‌ ఇండియా’ అనే పరిశోధనా పత్రాన్ని సమర్పించి యమ్‌.యస్‌.సి. పట్టా పొందారు. ‘ప్రోబ్లమ్‌ ఆఫ్‌ ది రూపీ’ అనే వ్యాసం సమర్పించి బి.యస్‌.సి. పట్టా పొందారు. అంబేద్కర్‌ బారిష్టర్‌ వృత్తిలో ఉన్నప్పుడు ఒక సందర్భంలో బొంబాయి గాంచ్‌ కోర్టులో ఒక కేసు విషయమై ఏడుగంటలు ఏకధాటిగా ఇంగ్లాండ్‌, భారతదేశ న్యాయస్థానాల తీర్పులను ఉదహరిస్తూ వాదించారు. ‘నేషనల్‌ డివిడెండ్‌ ఆఫ్‌ ఇండియా – ఎ హిస్టారికల్‌ అండ్‌ అనలిటికల్‌ స్టడీ’ అనే దానిపై ఆయన రాసిన పరిశోధన వ్యాసానికి కొలంబియా విశ్వవిద్యాలయంవారు డాక్టరేట్‌ ఇచ్చారు.
డాక్టర్‌ అంబేద్కర్‌ తన చిన్నతనంలోనూ, స్కూల్‌లో చదువుకునే రోజుల్లోనూ అనేక అవమానాలు స్వయంగా అనుభవించారు. ఆ అనుభవాలు ఆయనలో వ్యవస్థ పట్ల ద్వేషాన్ని పెంచాయి. విద్యాభ్యాసం చేసి అమెరికా నుండి తిరిగి వచ్చినప్పటినుండి ఆయన అణగారిన వర్గ ప్రజలలో చైతన్యాన్ని పెంపొందించి, వారిలో బానిస ప్రవృత్తిని నిర్మూలించేందుకు, మానవ హక్కులు, సమానత్వం కోసం వారు పాటుపడేటట్లు నిర్విరామంగా కృషిచేశారు. బహిరంగ చెరువుల్లో నీరుతాగే హక్కుకోసం మహద్‌లో 1927లోనూ, 1930లో నాసిక్‌ దేవాలయ ప్రవేశం కోసం పోరాడేందుకు అస్పృశ్యులనబడే వారిని సమీకరించి పోరాటాలు నిర్వహించారు.
ప్రభుత్వం ఎలా ఉండాలి అనే అంశంపై 1930 నవంబర్‌లో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో మాట్లాడుతూ ‘నేడున్న ఆర్థిక, సాంఘీక అసమానతలను తొలగించేందుకు భయపడని ప్రభుత్వం మనకుండాలి. ఆ పాత్రను బ్రిటీష్‌ ప్రభుత్వం ఏమాత్రం పోషించజాలదు. ప్రజలచే, ప్రజలకోసం ఎన్నుకోబడే ప్రజా ప్రభుత్వమే దాన్ని నిర్వహించడం సాధ్యమవుతుంది’ అని స్పష్టం చేశారు. మొత్తం రాజకీయ పరిష్కారంలో భాగంగా దళిత వర్గాల సమస్య కూడా పరిష్కరించబడాలని, వారికి స్థానం ఉండేలా రాజకీయ యంత్రాంగం మారాలని ఆయన చెప్పారు.
1937 సెప్టెంబర్‌లో మసూర్‌లో జరిగిన దళిత మహాసభలో అధ్యక్షోపన్యాసమిస్తూ ‘సాంఘీక, ఆర్థిక సమానత్వం’ అనే లక్ష్యాల ద్వారా మాత్రమే సామాన్య మానవునికి తన అభిమతానుసారం స్వేచ్ఛగా పురోగమించడానికి అవకాశాలు ఏర్పడగలవని, ఉత్పత్తి సాధనాలు కొద్దిమంది చేతుల్లోనే ఉండి దోపిడీ చేయడానికి వీలున్నంతవరకు సామాన్య మానవుడు అభివృద్ధి చెందడానికి ఏమాత్రం అవకాశం ఉండదని డా|| అంబేద్కర్‌ అన్నారు. 1938లో కొంకణ్‌లో భూస్వామ్య వ్యవస్థ రద్దుకోసం జరిగిన రైతాంగ ప్రదర్శలో పాల్గొన్నారు.
ప్రపంచ చరిత్ర అంతా వర్గ సమాజ చరిత్రే. ఇందుకు ఇండియా మినహాయింపుకాదు. వర్గంలోనే కులం ఇమిడివుందని ఆయన మనదేశంలోని వర్గ వ్యవస్థ గురించి వివరించారు. ‘రాష్ట్రాలు – మైనారిటీలు’ అన్న అంశం మీద రాజ్యాంగం నిర్మాణ సభకు షెడ్యూల్డు కులాల ఫెడరేషన్‌ తరుపున సమర్పించిన డాక్యుమెంట్‌లో డా|| అంబేద్కర్‌ ప్రణాళికాబద్ధ ఆర్థిక విధానాన్ని కోరుకున్నారు. మౌలికమైన కీలక పరిశ్రమలు, ఇన్సూరెన్స్‌ ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని, సాగుకు అనుకూలమైన భూములకు పరిహారం చెల్లించి, ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, పేదరైతులకు, భూమిలేని పేద వ్యవసాయ కార్మికులకు పంచాలన్నారు. సమిష్టి వ్యవసాయ క్షేత్రాలను నెలకొల్పాలని, మైనారిటీలకు తగు రక్షణ కల్పించాలని కోరారు.
గొప్ప మేధావి, న్యాయశాస్త్రంలో నిష్ణాతుడైన డా|| అంబేద్కర్‌ను స్వాతంత్య్ర భారతదేశంలో కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా తీసుకున్నారు. హిందూ కోడ్‌ బిల్లు ద్వారా స్త్రీలకు ఆస్తి హక్కు కల్పించేందుకు ఆయన చేసిన కృషికి నెహ్రు ప్రభుత్వం ఆటంకాలు కల్పించడంతో రాజీనామా చేశారు. హిందూ మతంలోని వర్ణ వ్యవస్థ అసమానతలతో, వివక్షలతో కూడి ఉన్నదని, బౌద్ధమతం సమాజాన్ని మానవత్వంతో పునర్‌నిర్మించగలదని, బుద్ధుడు చెప్పిన దు:ఖం అన్నదానిని నిరుపేదరికంతోనూ, దోపిడీతో సమాన అర్థంగా భావించారు. ప్రయివేటు ఆస్తులను రద్దుచేయడం ద్వారా దీనిని నివారించవచ్చని ఆయన భావించారు. అందుకే లక్షలాది మంది తన అనుచరులతో బౌద్ధమతం స్వీకరించారు.
మనం స్వాతంత్య్రం సాధించుకుని 76 సంవత్సరాలు అయినప్పటికీ, నాడు డా|| అంబేద్కర్‌ ఏ వివక్షతకు వ్యతిరేకంగా జీవితాంతం పోరాడారో ఆ వివక్షత నేటికీ కొనసాగుతూనే వుంది. జనాభాలో 70 శాతంకి పైగా ఉన్న దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతుల వారు అనాగరికమైన కుల వివక్షతకు గురవుతూనే ఉన్నారు. అణచివేత, అత్యాచారాలు నిరంతరం సాగుతూనేవున్నాయి. వీరిలో అత్యధికులు వ్యవసాయ కార్మికులు, పేద, సన్నకారు రైతులు, చేతివృత్తుల వారుగా ఉండి ఆర్థిక దోపిడీకి కూడా గురవుతున్నారు. కులపరమైన దోపిడీ వీరి బతుకులను మరింత దుర్భరం చేస్తున్నాయి. ఈ వివక్షతకు వ్యతిరేకంగా, సమానత్వం కోసం అనేక ఉద్యమాలు సాగుతున్నాయి. వాటిలో భాగస్వాములం కావడం డా|| అంబేద్కర్‌ ఆశయసాధన కృషిలో భాగం కాగలదు. డా|| బిఆర్‌ అంబేద్కర్‌ బోధించినట్లు సామాజిక న్యాయానికి భంగం కలిగిస్తున్న, ప్రజల జీవన ప్రమాణాలను దిగజారుస్తున్న విధానాలను అధ్యయనం చేద్దాం. వీటికి వ్యతిరేకంగా ప్రజానీకాన్ని సమీకరిద్దాం. ఉద్యమాలు నిర్వహిద్దాం. అదే ఆయనకు మనమర్పించే నిజమైన నివాళి.
జి. కిషోర్‌ కుమార్‌
9440905501

Spread the love