సిట్‌కు సుప్రీంకోర్టు ఆదేశం
రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు నోటీసులు జారీ
సిట్ దర్యాప్తు పురోగతి నివేదికను సీల్డ్ కవర్‌లో
సమర్పిస్తాం : సొలిసిటర్ జనరల్
న్యూఢిల్లీ : అయోధ్య రామాలయం విరాళాల చోరీపై దర్యాప్తు పురోగతి నివేదికను సమర్పించాలని సిట్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. విరాళాల చోరీ వ్యవహారంపై తగిన వివరణ ఇవ్వాలని రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు, ఇంకా కేంద్రానికి కూడా నోటీసులు జారీ చేసింది. రామాలయం లో భక్తులు సమర్పించిన కానుకల చోరీ వ్యవహారంపై సీబీఐ విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్లపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చీ, జస్టిస్ వి.మోహనతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.
రామాలయ వ్యవహారాలను పర్యవేక్షించే రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆర్థిక లావాదేవీలపై ఆడిట్ నిర్వహించాలని ఓ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆలయ ట్రస్ట్ వ్యవహారాలు, పరిపాలనకు సంబంధించిన ఆర్థిక అవకతవకలు, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలపై సీబీఐ నేతృత్వంలో దర్యాప్తు చేయాలని కోరారు. కోట్లాది మంది భక్తులు, దాతల విశ్వాసాన్ని నిలబెట్టడానికి అవసరమైన నియంత్రణ, పర్యవేక్షణ, ఆడిట్ యంత్రాంగాలను ఏర్పాటు చేసే విధంగా కేంద్రం, యూపీ ప్రభుత్వం, ట్రస్ట్‌కు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో వివరించారు. ఎఫ్‌ఐఆర్ లేదా సాధారణ క్రిమినల్ కేసు కూడా నమోదు చేయకుండానే సిట్ ఈ వ్యవహారంపై విచారణ ప్రారంభించిందని పిటిషనర్లు ఆక్షేపించారు.
ట్రస్ట్‌కు సంబంధించి నిధుల దుర్వినియోగం, ఇతర అవకతవకలకు సంబంధించిన నివేదికలు చివరికి నిజమని తేలినా, తేలకపోయినా, అవన్నీ అయోధ్య పూర్వ వైభవాన్ని పునరుద్ధరణకు పోరాడిన తరాల్లో తీవ్ర ఆందోళనను కలిగించాయన్నారు. ఇందులో ఉన్న అంశాలు కేవలం ‘కాగ్నిజబుల్’ (పోలీసులు స్వయంగా కేసు నమోదు చేసే) నేరాలకు సంబంధించినవి మాత్రమే కాదని, అసంఖ్యాక భక్తులు, ప్రజల విశ్వాసం, మనోభావాలు, నమ్మకాలపై కూడా ప్రత్యక్ష ప్రభావం చూపుతాయని తెలిపారు.
ట్రస్ట్ విరాళాలు,
కానుకల పూర్తి వివరాలు ఇవ్వాలని పిటిషన్
రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఏర్పడిన నాటి నుంచి స్వీకరించిన అన్ని విరాళాలు, కానుకల పూర్తి వివరాలను అందించేలా సుప్రీం కోర్టు ఆదేశించాలని పిటిషన్‌లో కోరారు. ఈ వివరాల్లో నగదు విరాళాలు, బ్యాంకు బదిలీలు, డిజిటల్ చెల్లింపులు, విదేశీ విరాళాలు, వస్తు రూపంలో విరాళాలు, బంగారం, వెండి, ఇతర విలువైన వస్తువులతో పాటు, వాటి అకౌంటింగ్, సంరక్షణ, వినియోగానికి సంబంధించిన వివరాలు కూడా చేర్చాలని తెలిపారు.
సీల్డ్ కవర్‌లో సమర్పిస్తామన్న సొలిసిటర్ జనరల్
ఈ సందర్భంగా కేసు విచారణలో భాగంగా ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. దర్యాప్తునకు సంబంధించిన స్టేటస్ రిపోర్ట్‌ను సీల్డ్ కవర్‌లో సమర్పిస్తామని కోర్టుకు వివరించారు. అయితే, ఆ నివేదిక ప్రతిని తమకు కూడా ఇవ్వాలని పిటిషనర్లు కోరగా, ఆ అభ్యర్థనకు వ్యతిరేకంగా మెహతా వాదించారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, “మీకు చట్టం తెలుసు. ఎలాగైనా వారు ఆ రిపోర్ట్‌ను చూస్తారు” అని స్పష్టం చేసింది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు జారీ చేసిన నోటీసులను మెహతా స్వీకరించారు. దీంతో ఈ కేసు తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 20కు వాయిదా వేసింది.రామాలయంలో విరాళాల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో గత 13న ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే దర్యాప్తు చేపట్టగా పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. లెక్కింపు సమయంలో పర్యవేక్షణ లోపాలను సిట్ గుర్తించింది. అనంతరం పలు అరెస్టులు చోటుచేసుకోవడంతో రామ జన్మభూమి ట్రస్టు ప్రధాన కార్యదర్శి పదవికి చంపత్ రాయ్ రాజీనామా చేశారు. అయితే, తనపై వస్తోన్న ఆరోపణలు నిరాధారమని ఆయన పేర్కొన్నారు.
రామాలయం విరాళాల చోరీపై నివేదిక సమర్పించండి
- Advertisement -
- Advertisement -



