Tuesday, July 14, 2026
E-PAPER
Homeజాతీయంఅట్టడుగున భారత్‌

అట్టడుగున భారత్‌

- Advertisement -

పర్యావరణ పనితీరు సూచీలో మళ్లీ నిరాశే
ప్రపంచవ్యాప్తంగా 177 దేశాల్లో 176వ ర్యాంకు
దక్షిణాసియాలోనూ చివరి స్థానమే : ఈపీఐ నివేదిక
గాలి కాలుష్యం, బొగ్గుపై ఆధారపడటం, జీవవైవిధ్య పరిరక్షణలో బలహీనతలే ప్రధాన కారణాలు : పర్యావరణ నిపుణులు

న్యూఢిల్లీ : ప్రపంచ దేశాల పర్యావరణ పనితీరును అంచనా వేసే ఎన్విరాన్‌మెంట్‌ పర్ఫామెన్స్‌ ఇండెక్స్‌ (ఈపీఐ)-2026లో భారత్‌ మరోసారి అట్టడుగు స్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 177 దేశాల్లో భారత్‌ 176వ ర్యాంకులో ఉంది. అంటే.. చివరి నుంచి రెండో స్థానం. భారత్‌కు ఈపీఐ స్కోరు 100లో 22.46 పాయింట్లు మాత్రమే లభించాయి. 74.79 పాయింట్లతో ఎస్టోనియా అగ్రస్థానంలో ఉంది. ఇక దక్షిణాసియా దేశాల్లో కూడా భారత్‌ ఎనిమిదో స్థానంలో (ఇదే అట్టడుగు ర్యాంకు) ఉండటం ఆందోళన కలిగిస్తోంది. యేల్‌, కొలంబియా విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు ప్రతి రెండేండ్లకోసారి విడుదల చేసే ఈ సూచీ.. పర్యావరణ ఆరోగ్యం, జీవావరణ వ్యవస్థల పరిరక్షణ, వాతావరణ మార్పుల నియంత్రణ వంటి అంశాలపై దేశాల పనితీరును విశ్లేషిస్తుంది. ఈ ఏడాది 47 సూచికలను, 12 ప్రధాన విభాగాలను ఆధారంగా చేసుకొని ఈ ర్యాంకింగ్‌ను రూపొందించారు.

మూడు కీలక రంగాల్లోనూ వెనుకబాటు
భారత్‌ పర్యావరణ ఆరోగ్యం విభాగంలో 174వ ర్యాంకు పొందింది. జీవావరణ వ్యవస్థల పరిరక్షణ (ఎకోసిస్టమ్‌ వైటాలిటీ)లో 171వ స్థానం, వాతావరణ మార్పుల నియంత్రణ (క్లైమేట్‌ చేంజ్‌ మిటిగేషన్‌)లో 130వ స్థానంలో నిలిచింది. నివేదిక ప్రకారం భారత్‌లో సూక్ష్మ ధూళి కణాలు, కార్బన్‌ మోనాక్సైడ్‌, సల్ఫర్‌ డయాక్సైడ్‌ వంటి కాలుష్య కారకాలతో ఆరోగ్య నష్టం గణనీయంగా కొనసాగుతోంది. సముద్ర జీవ వైవిధ్య పరిరక్షణ, సముద్ర సంరక్షిత ప్రాంతాల నిర్వహణలోనూ పనితీరు అత్యంత బలహీనంగా ఉంది.

వేగంగా పెరుగుతున్న కర్బన ఉద్గారాలు
భారత్‌లో తలసరి కర్బన ఉద్గారాలు ప్రపంచంలోని అనేక దేశాలతో పోలిస్తే తక్కువగానే ఉన్నప్పటికీ.. వేగంగా పెరుగుతున్నాయని నివేదిక పేర్కొంది. కోట్లాది మంది ప్రజలకు విద్యుత్‌, ఆధునిక ఇంధన సౌకర్యాలు అందుతున్నప్పటికీ.. దాని పర్యవసానంగా నగరాల్లో తీవ్ర వాయు కాలుష్యం, గ్రీన్‌హౌజ్‌ వాయువుల ఉద్గారాలు పెరుగుతున్నాయని ఈపీఐ తేల్చింది. అయితే బొగ్గు ఆధారిత ఉత్పత్తిపై అధికంగా ఆధారపడటం, జీవవైవిధ్య పరిరక్షణకు తగిన చర్యలు లేకపోవడం, వాయు కాలుష్య నియంత్రణలో పరిమిత ఫలితాలే భారత్‌ ర్యాంకు దిగజారడానికి ప్రధాన కారణాలుగా నిలిచాయని పర్యావరణ నిపుణులు చెప్తున్నారు.

యూరప్‌ దేశాలవే అగ్రస్థానాలు
ఈసారి కూడా యూరప్‌ దేశాలే తొలి ఐదు స్థానాలను కైవసం చేసుకున్నాయి. ఎస్టోనియా మొదటి స్థానంలో నిలవగా.. లక్సెంబర్గ్‌, యునైటెడ్‌ కింగ్‌డమ్‌, ఫిన్లాండ్‌, నెదర్లాండ్స్‌ వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక లావోస్‌ 21.78 పాయింట్లతో చివరి (177వ) స్థానంలో నిలిచింది.

గతంలో ఈపీఐని తిరస్కరించిన కేంద్రం
2022లో భారత్‌ను 180వ స్థానంలో చూపెట్టినప్పుడు కేంద్ర పర్యావరణ శాఖ ఈ సూచీని తిరస్కరించింది.
సూచీ రూపొందించిన విధానం శాస్త్రీయంగా లేదనీ, భారత్‌ చారిత్రకంగా తక్కువ తలసరి ఉద్గారాలు కలిగిన దేశమనే అంశాన్ని పరిగణనలోకి తీసుకోలేదని కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే ఈపీఐ శాస్త్రవేత్తలు తమ సూచీ దేశాల ప్రస్తుత పర్యావరణ పరిస్థితులను మాత్రమే అంచనా వేస్తుందనీ, చారిత్రక ఉద్గారాలు, ప్రభుత్వ విధాన ఉద్దేశాలను కాదు అని స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -