ఉన్నట్లా.? లేనట్లా.?..సబ్సిడీ గొర్రెలేవి.?

– నాలుగేళ్లుగా ఎదురు చూస్తున్న గోళ్లకుర్మలు
నవతెలంగాణ – మల్హర్ రావు
గోళ్లకుర్మల కోసం గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకంపై నీలినీడలు కమ్ముకున్నాయి. తొలి విడతలో అర్హులను ఎంపిక చేసి పూర్తిస్థాయిలో యునిట్లు పంపిణీ చేయలేదు. రెండో విడత ప్రారంభించి కొంతమందికి మాత్రమే పంపిణీ చేశారు. ఇప్పటికే డీడీలు చెల్లించిన లబ్ధిదారులు మాడబ్బులు మాకు ఇవ్వాలని కోరుతుండడంతో అయోమయపస్థితి నెలకొంది.
ఏళ్ళు గడిచినా అందని గొర్రెలు..
గొర్రెల అభివృద్ధి పథకంలో భాగంగా  గోళ్లకుర్మలకు రాయితీపై గొర్రెల పంపిణీ చేసే కార్యక్రమానికి గత ప్రభుత్వం 2017లో శ్రీకారం చుట్టింది. గ్రామాల్లో సఘాలను ఏర్పాటు చేసి లబ్ధిదారులను గుర్తించిన ప్రభుత్వం లక్కీ డ్రా ద్వారా సగం మందిని ఎంపిక చేసింది. ఎంపిక చేసినవారికి విడుతల వారిగా గొర్రెలను పంపిణీ చేసింది. లక్కీ డ్రాలో పేర్లు రాని వారికి వచ్చే ఏడాది నుంచి గొర్రెలు పంపిణీ చేస్తామని అప్పట్లో ప్రభుత్వాధికారులు వివరించారు.  తోటివారు గొర్రెలను తీసుకొని ఏళ్ళు గడిచినా తమకు ఇంతవరకు గొర్రెలు పంపిణీ చేయడం లేదని మండలంలోని గొర్రెలు అందని గొళ్లకుర్మలు వాపోతున్నారు.
మండల పరిస్థితి..మండల పరిధిలోని15 గ్రామపంచాయతీలలో 6 సంఘాలలో 1050 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇందులో మొదటి విడత 521 యూనిట్లు గొర్రెలు అందించాల్సి ఉండగా, డీడీలు చెల్లించిన 489 మంది లబ్ధిదారులకు అందజేసి, 32 మంది సకాలంలో డీడీలు తీయక వారికి గొర్రెలు అందలేదు. ఒక్కొక్క లబ్ధిదారుడు రూ.31,250 బ్యాంకుల్లో డీడీలు తీయగా వారికి 21 గొర్రెలు ప్రభుత్వం అందజేసింది. రెండో విడత పంపిణీ కోసం మరో 549 యూనిట్లు జాబితా సిద్ధం చేసి, ఇందులో పదిమంది లబ్ధిదారులు సైతం బ్యాంకుల్లో డీడీలు తీశారు. లబ్ధిదారులకు గొర్రెలు దేవుడెరుగు కానీ బ్యాంకుల్లో మాత్రం డీడీలు మూలుగుతూ లబ్ధిదారులపై ఆర్థిక భారం పడింది. గొర్రెలు వస్తాయని ఆశపడి వడ్డీలకు, కొందరు బంగారం తాకట్టు పెట్టి డీడీలు కట్టారు. వారికి అసలు వడ్డీలు తలకు మించిన భారమైయింది. మొదటి విడత గొర్రెల పంపిణీ చేసి సుమారుగా నాలుగేళ్లు గడుస్తున్నా నేటికి రెండో విడత గొర్రెల పంపిణీ లేకపోవడంతో అసలు గొర్రెల పంపిణీ ఉంటుందా లేదా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు వచ్చిన దగ్గర మాత్రమే గొర్రెలను పంపిణీ చేస్తున్నారని గొల్లకుర్మలు ఆరోపిస్తున్నారు. మాజీ సీఎం కేసీఆర్ చెప్పినట్లుగా వెంటనే రెండో విడత గొర్రెల పంపిణీ ప్రారంబించాలని గొళ్లకుర్మలు కోరుతున్నారు. అలాగే పంపిణీ చేసిన గొర్రెలకు గాలికంటి, మేత పడక, వివిధ రోగాలతో అధికారుల లెక్కల ప్రకారం 150 గొర్రెలకు పైగా మృత్యువాత పడ్డాయి. కానీ ఒక్క గొర్రెకు ఇన్సూరెన్స్ రాలేదని బాధితులు వాపోతున్నారు.
పంపిణీ చేయాలి అక్కల బాపు యాదవ్….గోళ్లకుర్మల సంఘము నాయకుడు.
లక్కీడ్రాలో పేర్లు రానివారికి రెండో విడుతలో గొర్రెలు పంపిణీ చేస్తామని అధికారులు చెప్పారు.రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని కొత్త ప్రభుత్వం త్వరగా ప్రారంభించాలి.గత ప్రభుత్వం కేవలం కొంతమందికి మాత్రమే గొర్రెలు పంపిణీ చేసి మిగతావారి అన్యాయ చేసింది.
ఆదేశాలు రాలేదు..జగపతి రావు, .మండల పశు వైద్యాధికారి..
రెండో విడత గొర్రెల పంపిణీకి సంబంధించి కొత్త  ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. ఆదేశాలు వచ్చిన వెంటనే మిగిలిన లబ్ధిదారుల నుంచి డీడీలు తీసుకుంటాం
Spread the love