ఉక్కపోతతో..ఉక్కిరిబిక్కిరి..!

– జిల్లాలో భగభగమండుతున్న ఎండలు
– ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులకు తప్పని తిప్పలు
– బయటకు వెళ్లేందుకు జంకుతున్న కార్యకర్తలు
– పోలింగ్‌ ముంగిట పార్టీల్లో రేకెత్తిస్తున్న ఆందోళన
భగభగ మండుతున్న సూరీడు అందరినీ భయపెడుతున్నారు. ఎండవేడిమి తట్టుకోలేక అనేక మంది అస్వస్థతకు గురవుతూ ఆస్పత్రుల పాలవుతున్నారు. ఎండ దెబ్బకు ప్రజలే కాదు..ఎన్నికల ముంగిట ఈ పరిస్థితి రాజకీయ పార్టీలకు తలనొప్పిగా మారుతోంది. ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న అభ్యర్థులు ఎండవేడిమి తట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రచారంలో లోక్‌సభ పరిధి మొత్తం తిరిగి ప్రజలను కలువగలమా అనే ఆందోళన నెలకొంది. ముఖ్యంగా ఈ ఉష్ణోగ్రతలను భరించలేక అభ్యర్థుల వెంట కార్యకర్తలు కూడా వెళ్లేందుకు జంకుతున్నారు. ఎన్నికలేమో గానీ ఎండలో వెళితే ప్రాణం మీదకు వస్తుందని భయపడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం.. ఏకంగా 42డిగ్రీలపైనే నమోదు కావస్తుండటం అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఫలితంగా మరో పది రోజుల్లో పోలింగ్‌ జరగనుండగా.. అధిక ఉష్ణోగ్రతలు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులతో పాటు విజయమే లక్ష్యంగా పోరాడుతున్న రాజకీయ పార్టీలకు సైతం ఇబ్బందికర పరిస్థితి తలెత్తుతోంది.
నవతెలంగాణ- ఆదిలాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి
ఓ వైపు ఎండవేడి..మరో వైపు ఎన్నికల వేడితో రాజకీయ పార్టీలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరగడం..అందులోనూ భరించలేని ఉక్కపోత మనుషులను అస్వస్థతకు గురిచేస్తోంది. ఈ ఎండవేడికి తట్టుకోలేక మనుషులే కాకుండా పశుపక్ష్యాదులు అల్లాడుతున్నాయి. ఎండదెబ్బ బారిన పడేలా చేస్తోంది. ఈక్రమంలో పల్లెలు, పట్ణణాల్లో ప్రచారం చేయడం పోటీలో ఉన్న అభ్యర్థులతో పాటు గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న రాజకీయ పార్టీలను ఆందోళనకు గురిచేస్తోంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రోజూ 42డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఎండను తీవ్రతను తెలియజేస్తోంది. ఈ క్రమంలో ఇంటింటి ప్రచారంలో నిమగమైన అభ్యర్థులు, ఆయా పార్టీ శ్రేణులకు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. లోక్‌సభ పరిధిలో ఏడు నియోజకవర్గాలు ఉండటం.. ఎండవేడిమికి వాటి పరిధిలోని పల్లెలు, పట్టణాల్లోని వార్డులన్నింటిలో ప్రచారం నిర్వహించడం కష్టతరంగా మారుతోంది. ఈ నెల 13న పోలింగ్‌ జరుగనుండటం.. ప్రచారానికి మరో పది రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఇంత తక్కువ వ్యవధిలో పూర్తిస్థాయిలో ప్రచారం నిర్వహించగలమా అనే సందేహం వారిలో వ్యక్తమవుతోంది. గత నెలలో కేవలం మండల కేంద్రాలకే పరిమితమైన ప్రచారం కొన్ని రోజలు నుంచి పల్లెలు, వార్డులకు చేరడం.. అధిక ఉష్ణోగ్రతలు తట్టుకొని ప్రచారం నిర్వహించడం అభ్యర్థులకు సవాల్‌గా మారుతోంది.
జంకుతున్న కార్యకర్తలు..!
ఎండవేడిమి.. ఉక్కపోత తీవ్రస్థాయిలో ఉన్నా అభ్యర్థులు తప్పనిసరిగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కానీ వారి వెంట ప్రచారంలో పాల్గొనాల్సిన కార్యకర్తలు, శ్రేణులు మాత్రం వెనుకంజ వేస్తున్నారు. అభ్యర్థుల తరపున పల్లెలు, పట్టణాల్లో ప్రచారం నిర్వహిస్తున్న పార్టీల కార్యకర్తలు, సానుభూతి పరులు అధిక ఉష్ణోగ్రతలకు తట్టుకోలేకపోతున్నారు. ఎన్నికలు ఏమో గాని ప్రచారం ప్రాణాల మీదకు వస్తోందని ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా చాలా మంది ఆయా పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు ప్రచారంలో పాల్గొనేందుకు వెనుకడుగు వేస్తున్నారు. ముఖ్యంగా ఉదయం 8గంటలకే ఎండ తీవ్రత పెరగడంతో అభ్యర్థులు, వారి తరపున ప్రచారం నిర్వహిస్తున్న నాయకులు ఉదయం 7గంటలకే ఆయా పల్లెలు, పట్టణాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఉదయం 7గంటల నుంచి 11గంటల వరకు.. మళ్లీ సాయంత్రం 4గంటల నుంచి రాత్రి 10గంటల వరకు ప్రచారంలో నిమగమవుతున్నారు. పగటిపూట కనీసం మూడు నుంచి నాలుగు గంటల పాటు ఎక్కడో ఓ చోట విశ్రాంతి తీసుకుంటున్నారు. దీంతో ఎన్నికల సమయం తక్కువగా ఉండటం.. ఎండల తీవ్రత పెరడగం.. భరించలేనంత ఉక్కపోత కారణంగా అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రజలందరినీ కలవకపోతే ఓట్లు రావేమోననే భయం పట్టుకుంది. ముఖ్యంగా కొందరు కార్యకర్తలు ఎండకు భయపడి ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. పార్టీ గెలిస్తే పదవులు రావడం ఏమోగానీ..ప్రాణం మీదకు వచ్చే పరిస్థితి కనిపిస్తోందని చెబుతున్నారు.

Spread the love