నైజీరియాలో ఆత్మాహుతి దాడులు..

నైజీరియాలో ఆత్మాహుతి దాడులు..– పెండ్లి వేడుకలు, ఆస్పత్రి, అంత్యక్రియల్లో ఘటనలు
– 18 మంది మృతి
– 48 మందికి గాయాలు
– ఆస్పత్రికి క్షతగాత్రుల తరలింపు
– మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని తెలిపిన ఆస్పత్రి వర్గాలు
అబూజ : ఈశాన్య నైజీరియాలో బోర్నో రాష్ట్రంలో ఆత్మాహుతి దాడులు చోటు చేసుకున్నాయి. మూడు చోట్ల జరిగిన ఈ దాడుల్లో 18 మంది మృతి చెందారు. మరో 48 మంది గాయపడ్డారు. ఈ ఘటనలు శనివారం మధ్యాహ్నం జరిగినట్టు అక్కడి మీడియా వెల్లడించింది. అయితే ఈ దాడులు వివాహ వేడుకల్లో, గ్వోజా పట్టణంలోని ఓ ఆస్పత్రిలో , పెండ్లిలో మరణించిన వారి అంత్యక్రియల్లో జరిగినట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స కోసం వివిధ ఆస్పత్రులకు తరలించారు. మతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. మతుల్లో మహిళలు, గర్భిణులు, చిన్నారులు ఉన్నారు. ఈ ఆత్మాహుతి దాడుల నేపథ్యంలో బోర్నో స్టేట్‌ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్‌ ఏజెన్సీ డైరెక్టర్‌ జనరల్‌ బార్కిండో ముహమ్మద్‌ సైదు గ్వోజా టౌన్‌లోని ఘటనా స్థలాన్ని సందర్శించారు. అయితే ఈ దాడులకు వెనుక ఎవరు ఉన్నారు. ఉగ్రవాదులే ఈ చర్యలకు పాల్పడ్డారా లేదా ఎవరైనా స్థానికులే ఈ పనిచేశారా అనేది తెలియాల్సి ఉంది. ఈ ఘటనల నేపథ్యంలో అప్రమత్తమైన అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love