Tuesday, May 19, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్కేబీఆర్ పార్క్ లోచెట్ల నరికివేతపై సుప్రీం స్టే

కేబీఆర్ పార్క్ లోచెట్ల నరికివేతపై సుప్రీం స్టే

- Advertisement -

రోడ్డు విస్తరణ పనులపై రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు
ఎకో సెన్సిటివ్ జోన్ కుదింపు, 
నిబంధనల ఉల్లంఘనపై వివరణ ఇవ్వాలని ఆదేశం
తదుపరి విచారణ జులై 27కు వాయిదా
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

కాసు బ్రహ్మానంద రెడ్డి (కేబీఆర్‌) నేషనల్ పార్క్ చుట్టూ ఎట్టి పరిస్థితుల్లో చెట్లను నరికివేయోద్దని సర్వోన్నత్య న్యాయస్థానం ఆదేశించింది. ప్రధానంగా ఎకో సెన్సిటివ్ జోన్ (ఈఎస్‌జెడ్‌) పరిధిలో చెట్లను నరికివేయడంపై స్టే విధించింది. పార్క్ పర్యావరణ ప్రాముఖ్యతను పరిగణనలోకి తీసుకుని పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. వాస్తవ బఫర్ జోన్ అయిన 25 నుంచి 35 మీటర్ల పరిధిలో ఎలాంటి చెట్ల నరికివేత చేపట్టరాదని తేల్చి చెప్పింది. తక్షణమే ఆ పనులను నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఎకో సెన్సిటివ్ జోన్ కుదింపు, నిబంధనల ఉల్లంఘనపై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ… విచారణ వాయిదా వేసింది. కేబీఆర్ పార్క్ ఎకో సెన్సిటివ్ జోన్ లో చెట్ల నరికివేస్తన్నారని కాజల్ మహేశ్వరి రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. ఈ పార్క్ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నియంత్రణ నిర్మాణ పనుల చేపట్టిందని పిటిషన్ లో ఆరోపించారు. దీని కారణంగా పర్యావరణానికి శాశ్వత నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

అందువల్ల ఈ పిటిషన్ పై తక్షణ జోక్యం చేసుకొని చెట్ట నరికివేతను అడ్డుకోవాలని కోరారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు … స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ ఎకో సెన్సిటివ్ జోన్‌లో ఎలాంటి పనులు చేపట్టవచ్చు? ఏయే పనులు నియంత్రించాలి? లేదా నిషేధించాలి? అనే అంశాలపై పరిశోధన చేసి వివరాలు సమర్పించాలని కోర్టు పిటిషనర్లనే ఆదేశించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. హైకోర్టు జారీ చేసిన ఈ ఉత్తర్వులపై పిటిషనర్ కాజల్ మహేశ్వరి 22 ఏప్రిల్ 2026న సుప్రీంకోర్టులో సవాల్ చేవారు. ఈ పిటిషన్ సోమవారం జస్టిస్ బీవీ నాగరత్న నేతృత్వంలోని జస్టిస్ ఉజ్జల్ భుయాన్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. పిటిషనర్ తరఫున సీనియర్ అడ్వొకేట్ కె.వివేక్ రెడ్డి, అడ్వొకేట్ లు మిథున్ శశాంక్, మనీశ్ తివారీ వాదనలు వినిపించారు.

హైదరాబాద్ కు ఊపిరిగా నిలుస్తోన్న కేబీఆర్ పార్క్ ను రక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని పిటిషనర్ తరపు న్యాయ‌వాదులు వాదనలు వినిపించారు. వన్యప్రాణుల సంరక్షణ చట్టం-1972లోని సెక్షన్ 35 కింద నోటిఫై చేసిన కేబీఆర్‌ పార్క్ పచ్చటి ఊపిరితిత్తిగా (గ్రీన్ లంగ్) వంటిదన్నారు. అంతేకాకుండా హైదరాబాద్ నగరానికి గుండెకాయ లాంటిదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సున్నితమైన, అత్యంత అరుదైన పర్యావరణ ప్రాంతమైన కేబీఆర్ పార్క్ ను… 2012–2015 మధ్య (హెఎండీఏ అభివృద్ధి చేసిన గ్రీన్ బఫర్ ఏరియాతో కలిపి) 25-35 మీటర్ల మేర ఎకో సెన్సిటివ్ జోన్‌ గా గుర్తించారన్నారు. అయినప్పటికీ రోడ్లు, ఇతర ప్రాజెక్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడితో ఈ పరిధిని క్రమంగా తగ్గిస్తూ వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. స్ట్రాటజిక్ రోడ్డు డెవలప్ మెంట్ ప్లాన్(ఎస్ఆర్‌డీఏ) నిర్మాణం కోసం, భూసేకరణ వ్యయాన్ని తప్పించుకునేందుకు… ఈ జోన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి శాస్త్రీయ, పర్యావరణ అంచనాలు లేకుండా తగ్గించిందని తెలిపారు. కేవలం 03 నుంచి 29.8 మీటర్లకు కుదిస్తు 2020 అక్టోబర్‌ 27న నిర్ణయం తీసుకుందని వివరించారు.

పర్యావరణానికి తీరని నష్టం…
పర్యావరణ పరిరక్షణ కోసం ‘షాక్ అబ్జార్బర్’గా పనిచేయాల్సిన ఎకో సెన్సిటివ్ జోన్ ను కుదింపు సరికాదని పిటిషనర్లు వాదించారు. తక్షణమే చెట్ల నరికివేతను అడ్డుకోకపోతే పర్యావరణానికి తీరనినష్టం వాటిల్లుతుందని నివేదించారు. ప్రధానంగా ఎకో సెన్సిటీవ్ జోన్ కుదింపుపై ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని హైకోర్టులో విచారణ సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వమే అంగీకరించిందని తెలిపారు. కానీ, కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ఇచ్చిన ఫైనల్ నోటిఫికేషన్‌లో మాత్రం పబ్లిక్ హియరింగ్ చేపట్టినట్లు తప్పుగా పేర్కొందన్నారు. అయితే… పర్యావరణ నిబంధనల సడలింపును వ్యతిరేకిస్తూ 19 వేల మంది స్వచ్ఛందంగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ సంతకాలు చేశారన్నారు. కానీ ఈ 19వేల అభ్యంతరాలను సైతం ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. అసలైన ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలో యథేచ్ఛగా నిర్మాణ పనులు చేస్తున్నారని, దీనికోసం చెట్లను నరికేస్తున్నారని నివేదించారు. ఈ వాదనలను పరిగణలోకి తీసుకొన్న జస్టిస్ నాగరత్న ధర్మాసనం… ఈ పిటిషన్ పై సమాధానం ఇవ్వాలని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 27కు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -