ఆ కేసులకు ‘సుప్రీం’ తీర్పు వర్తించదు

The judgment of the 'Supreme' does not apply to those cases– యూఏపీఏ కింద అరెస్టులపై ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ : చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం (యూఏపీఏ) కేసుల విషయంలో ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అరెస్టు విషయంలో రాతపూర్వకంగా కారణాలు వెల్లడించాలన్న సుప్రీంకోర్టు తీర్పు ఈ కేసుల విషయంలో వర్తించదని స్పష్టం చేసింది. వివాదాస్పద చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్టం కింద తమ పోలీసు రిమాండ్‌ను సవాలు చేస్తూ న్యూస్‌క్లిక్‌ వ్యవస్థాపకుడు, ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ ప్రబీర్‌ పుర్కాయస్థ, మానవ వనరుల విభాగం అధిపతి అమిత్‌ చక్రవర్తి దాఖలు చేసిన పిటిషన్‌లపై విచారణ సందర్భంగా జస్టిస్‌ తుషార్‌ రావు గేదెల ఈ వ్యాఖ్యలు చేశారు. వారి అభ్యర్థనలో ఎటువంటి అర్హత లేదని పేర్కొంటూ కోర్టు వారి పిటిషన్లను తిరస్కరించింది. న్యూస్‌క్లిక్‌కు సంబంధించిన పలువురు జర్నలిస్టులపై ఢిల్లీ పోలీసులు దాడి చేసిన తర్వాత అక్టోబర్‌ 3న పుర్కాయస్థ, చక్రవర్తిలను అరెస్టు చేశారు. సిటీ కోర్టు వారిని మొదట ఏడు రోజుల పాటు పోలీసు కస్టడీకి, ఆ తర్వాత 10 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీకి అప్పగించింది. పంకజ్‌ బన్సాల్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా మరియు ఇతరుల కేసులో మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి అరెస్టుకు గల కారణాలను లిఖితపూర్వకంగా తెలియజేయాలని సుప్రీంకోర్టు అక్టోబర్‌ 4న తీర్పునిచ్చిన విషయం విదితమే. జర్నలిస్టుల అరెస్టు నేపథ్యంలో ఇప్పటికే మోడీ సర్కారు తీరుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. వివాదాస్పద యూఏపీఏ ను సైతం మోడీ సర్కారు దుర్వినియోగపరుస్తున్నదన్న ఆరోపణలు సైతం వినిపిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు పై విధంగా స్పందించటం గమనార్హం.

Spread the love