రేవంత్‌ సర్కార్‌కు ‘సుప్రీం’ షాక్‌!

'Supreme' shock for Revanth Sarkar!హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం భూముల వ్యవహారం మళ్లీ భారత అత్యున్నత న్యాయస్థానానికే చేరింది. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న కేసును సుప్రీంకోర్టులో గెలిపించుకొచ్చామని గొప్పలకు పోయిన తెలంగాణ సర్కార్‌కు అదే ధర్మాసనం మొట్టికాయలు వేసింది. హెచ్‌సీయూ భూముల్లో పనులాపాలని కీలక ఆదేశాలు జారీచేసింది. నెలరోజుల్లో నిపుణుల కమిటీ వేసి, ఆరునెలల్లో రిపోర్టు అందజేయాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కంచ గచ్చిబౌలిని సందర్శించి ఈనెల పదహారులోపు అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. దీన్ని పాటించకపోతే వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. హెచ్‌సీయూ భూములపై దాఖలైన రిట్‌ పిటిషన్‌ను గురువారం విచారించిన ద్విసభ్య ధర్మాసనం పైవ్యాఖ్యల్ని చేసింది. అంతకన్నా ముందు భూమి మాదంటే.. మాదేనని ప్రభుత్వం, అటు వర్సిటీ వాదించు కోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో భూముల్ని కాపాడాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థి ఐక్య కార్యచరణ కమిటీ ఇచ్చిన రాష్ట్రవ్యాప్త ఆందోళన, అరెస్టు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. వేలం పాటను ఆపి భూముల్ని వర్సిటీకే అప్పగించాలని సీపీఐ(ఎం) డిమాండ్‌ చేసింది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌, అధికార కాంగ్రెస్‌ పరస్పర ఆరోపణల పర్వం, సందట్లో సడేమి యాలా సర్కార్‌ మీద బీజేపీ ఒంటికాలుపై లేవడం.. వెరసి రాష్ట్ర రాజకీయమంతా ఒక్కసారిగా ‘భూమి’ చుట్టూ తిరిగింది.
హెచ్‌సీయూ భూముల వ్యవహారంలో ఇప్పటిదేం కాదు, పాతదే. అయితే ‘తిలాపాపం.. తలా పిడికెడు’ అన్నట్టు పాలకులందరి పాపం ఇందులో దాగుంది. దీనికి సంబంధించిన కేసు ఏండ్లుగా కోర్టులో నడుస్తూ ఈ మధ్య ఓ కొలిక్కివచ్చింది.ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో వర్సిటీకి చెందిన నాలుగు వందల ఎకరాల భూమిని కార్పొరేట్‌ సంస్థ ఐఎంజీకి కేటాయించింది. తీసుకున్న భూమికి బదులుగా గోపన్‌పల్లిలో 397 ఎకరాల భూమిని వర్సిటీకి ఇచ్చింది. అయితే భూమిని తీసుకున్న ఐఎంజీ అక్కడ చేస్తామన్న క్రీడల్ని అభివృద్ధి చేయకపోవడంతో తర్వాత వైఎస్సార్‌ ప్రభుత్వం రద్దుచేసింది. అప్పుడు ఆ భూమి వర్సిటీకే చెందాలనేది విద్యావంతులు, మేధావుల వాదన. హెచ్‌సీయూ భూముల్ని ప్రయివేటు వ్యక్తులకు కేటాయించేందుకు యూజీసీ నిబంధనలు ఒప్పుకోక పోయినా వాటిని భేఖాతర్‌ చేసేలా అప్పటి ముఖ్యమంత్రి వ్యవహరించారు. అభివృద్ధి చేయకపోతే తిరిగి స్వాధీనం చేసుకుంటామన్న ఒప్పందం కూడా చేసుకున్నట్టు లేదు. దీంతో ఐఎంజీ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. తీర్పు సర్కార్‌కే అనుకూలంగా రావడంతో సుప్రీంకోర్టు మెట్లెక్కింది. ఇంతకాలానికి ఆ పిటిషన్‌ను తోసిపుచ్చడంతో భూమి సర్కార్‌కే కేటాయించినట్లయింది.
ఇదంతా ఓవైపు నడస్తుండగానే రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలోని కంచ గచ్చిబౌలిలో ఉన్న ఈ భూమిని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ)కి అప్పగించింది. కార్పొరేట్ల వ్యాపార ప్రయోజనాలకు కట్టబెట్టేందుకు వేలానికి సిద్ధమైంది. దీనిపై రాజకీయ చర్చ పెరగడంతో ముఖ్యమంత్రి అసెంబ్లీలో స్పందించాల్సి వచ్చింది. ‘అక్కడ వన్య ప్రాణులున్నాయని ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయి. కానీ వాటికన్నా ఎక్కువ అక్కడ గుంటనక్కలే ఉన్నాయని’ బీఆర్‌ఎస్‌ను ఉద్దేశించి కౌంటర్‌ ఇచ్చారు. అక్కడున్న చిన్నపక్షికి కూడా ఇసుమంత నష్టం కూడా వాటిల్లదని చెప్పారు. ఇప్పుడు జరుగుతున్నదేమిటి? ముఖ్యమంత్రి చెబుతున్నట్టు అక్కడ గుంటనక్కలే ఉండొచ్చు కాక, మరి పశుపక్షాదులు, జింకలు, దుప్పులు ఎందుకు మృత్యువాత పడుతున్నాయి? నెమళ్లు దిక్కుతోచని స్థితిలో ఎందుకు కొట్టుమిట్టాడుతున్నాయి.బుల్డోజర్ల తాకిడికి, శబ్దానికి అక్కడున్న జంతువులు భయభ్రాంతులకు గురవుతున్నాయి, చచ్చిపోతున్నాయి. ఒక జింక మృత్యువాత పడ్డ దృశ్యం మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడం పలువురిని భావోద్వేగానికి గురిచేసింది. రేవంత్‌ దీనికేం సమాధానం చెబుతారు?
వర్సిటీ భూమిని ఇంచు కూడా ప్రభుత్వం తీసుకోవడం లేదని కొందరు మంత్రులు అంటున్నారు. కానీ సర్కార్‌ దాగుడుమూతల్ని హెచ్‌సీయూ రిజిస్ట్రార్‌ కుండబద్ధలు కొట్టారు. వర్సిటీ ప్రాంగణంలో భూములకు సంబంధించి రెవెన్యూ సర్వేనే చేపట్టలేదని, అక్కడ ఐటీ, ఇతర ప్రాజెక్టుల ప్రతిపాదనల్ని అంగీకరించలేదని చెప్పారు. ఇది అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ భూముల వేలం వల్ల పర్యావరణం దెబ్బతింటున్నదని విద్యార్థులు చేస్తున్న ఆందో ళనలో న్యాయముంది. అయినా సరే, సర్కార్‌ దొంగచాటుగా పనుల్ని చేపట్టింది. అక్కడి చెట్లను జేసీబీలతో తొలగించింది. బుల్డోజర్లతో తొక్కించింది. దీన్ని అడ్డుకున్నందుకు విద్యార్థులను జుట్టు పట్టుకుని ఈడ్చి మరీ పోలీసులతో వాహనాల్లో కుక్కింది. జరుగుతున్న ఘోరాన్ని చూస్తే ఎవరు న్యాయం కోసం పోరాడుతున్నది, ఎవరు అన్యాయానికి పాల్పడుతున్నది స్పష్టంగా కనిపిస్త్నుది. ఇప్పుడు భూమి ఎవరిదన్న సమస్య కాదు, అది వర్సిటీకే చెందాలనేది ప్రజల డిమాండ్‌. సుప్రీం ఆదేశాల్ని రేవంత్‌ సర్కార్‌ పాటించాలి. లేదంటే ప్రతిఘటన తీవ్రమవుతుంది!

Spread the love