బతికేదెట్టా..

Survive..– ప్రభుత్వంపై ప్రజల అవిశ్వాసం..జీవనోపాధిపై ఆందోళన
– 72 శాతం మంది ఆదాయాల్లో పతనం
– ధరలు పెరిగాయని 90 శాతం మంది వెల్లడి
– సీఎస్‌డీఎస్‌-లోక్‌నీతి ప్రీపోల్‌ సర్వే
పేదలు ఆదాయాలు రోజురోజుకూ పడిపోతున్నాయి. పెద్దల సంపద పడగలెత్తుతోంది. మోడీ సర్కార్‌ మాత్రం పేదలు దారిద్య్రరేఖకు ఎగువకు చేరుకుంటున్నారంటూ..గోడీ మీడియా, సర్కారు గణాంకాలు చూపుతూ ఓటు రాజకీయం చేస్తున్నాయి. వాస్తవానికి బడుగుల బతుకుల్లో ఆదాయాలు దిగజారాయి. దీనికి తోడు నిత్యావసరాల ధరలకు తోడు ఇతర ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయి. ఈ విషయాలు సీఎస్‌డీఎస్‌-లోక్‌నీతి ప్రీపోల్‌ సర్వేలో వెల్లడయ్యాయి.
న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా మెజారిటీ ప్రజలు తమ జీవనోపాధిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు మూడింట ఒక వంతు మంది నిరాశాలో ఉన్నారు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఈ ఏడాది మార్చిలో వెల్లడించిన వినియోగదారుల విశ్వాస సర్వేపై సీఎస్‌డీఎస్‌-లోక్‌నీతి ప్రీపోల్‌ సర్వే విశ్లేషణ నిర్వహించింది. ప్రస్తుతం హెచ్చు ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ఆదాయాలు పడిపోవడం ప్రధాన సవాళ్లుగా ఉన్నాయి. ఇవి సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏకు ఎదురుగాలిగా నిలువనున్నాయి. ఈ ప్రీపోల్‌ సర్వేలో 32 శాతం మంది పెరుగుతున్న నిరుద్యోగంపై ఆందోళన వ్యక్తం చేశారు. నిరుద్యోగం కారణంగా అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి మూడింట ఒక్క వంతు మంది ఆసక్తి చూపడం లేదు.
ఆర్‌బీఐ ఇటీవల (మార్చి 2 నుంచి 8వ తేదీల మధ్య )19 నగరాల్లో నిర్వహించిన సర్వేలో 6,083 మంది అభిప్రాయాలను సేకరించింది. ఈ సర్వేలోనూ నిరుద్యోగం, ధరలు, ఆదాయాల తగ్గుదలపై ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. ఆర్‌బీఐ సర్వే ప్రకారం.. ఏడాది క్రితంతో పోల్చితే ఉపాధి అవకాశాలు పెరిగాయని.. అయినప్పటికీ 38 శాతం మంది నిరుద్యోగం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా ముందు నాటి స్థాయికి అవకాశాలు చేరుతున్నాయని పేర్కొన్నారు.
ఏడాది క్రితంతో పోల్చితే ఆదాయాలు చాలా తక్కువగా ఉన్నాయని 22 శాతం మంది పేర్కొన్నారు. ఇంతక్రితం 2014-15 నాటి సర్వేతో పోల్చితే 10 శాతం అదనం ప్రతికూలత పెరిగింది. 27 శాతం మంది ఆదాయాలు పెరగ్గా.. 50 శాతం మంది ఆదాయాలు అలాగే ఉన్నాయి. ప్రతీ ఏడాది పెరుగుతున్న వస్తు ధరలు భారం అవుతున్నాయి.
ఆర్‌బీఐ సర్వే ప్రకారం.. ఏడాది క్రితంతో పోల్చితే ధరలు పెరిగాయని 90 శాతం మంది ఆందోళన వ్యక్తం చేశారు. ధరలు అలాగే ఉన్నాయని 9 శాతం మంది, తగ్గాయని ఒక్క శాతం మంది ఆర్‌బీఐ సర్వేలో పేర్కొన్నారు. ఏడాది క్రితం ఆర్థిక వ్యవస్థ పేలవంగా ఉండగా.. ఇటీవల కొంత మెరుగు పడిందని తెలిపింది. ఆర్థిక వ్యవస్థ పట్ల ప్రజల్లో ఇప్పటికీ 2015-16 నాటి స్థాయికి విశ్వాసం చేరలేదు. ఏడాది క్రితంతో పోల్చితే ఆర్థిక వ్యవస్థ బాగోలేదని 36 శాతం మంది పేర్కొన్నారు.

Spread the love