సూర్యాపేట టిక్కెట్‌ ఎవరికో..

Suryapet ticket for anyone..– కాంగ్రెస్‌ కార్యకర్తల్లో ఉత్కంఠ
– ఢిల్లీలో దామోదర్‌రెడ్డి.. పేటలో రమేష్‌రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల జాబితా కసరత్తు కొనసాగుతూనే ఉంది. కొన్ని రోజులు హైదరాబాదులో, మరికొన్ని రోజులు ఢిల్లీలో అభ్యర్థుల వడపోత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక వారికి కత్తి మీద సాములా మారింది. సూర్యాపేటలో టికెట్టు కోసం మాజీ మంత్రి, టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షులు రాంరెడ్డి దామోదర్‌ రెడ్డి, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్‌ రమేష్‌ రెడ్డి, బీసీ నేతలు తండు శ్రీనివాస్‌ యాదవ్‌, ఎలగందుల రాము, ముషం రవి కుమార్‌ టిక్కెట్‌ ఆశిస్తూ దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో ఎన్నికల స్టీరింగ్‌ కమిటీ అభ్యర్థుల వడపోత నిర్వహించింది. ఆ తర్వాత జాబితాను ఏఐసీసీకి పంపించారు. బుధవారం, గురువారం ఢిల్లీలో అభ్యర్థుల ఎంపికపై సీడబ్ల్యూసీ కసరత్తు చేపట్టింది. దామోదర్‌రెడ్డి హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు. అక్కడ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక కమిటీ సభ్యులు, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డిని దామన్న మర్యాద పూర్వకంగా కలిశారు. అదేవిధంగా మరికొందరు అగ్ర నేతలను కలిసి టిక్కెట్‌ సాధించేందుకు దామోదర్‌రెడ్డి వ్యూహాత్మకంగా వ్యహరిస్తున్నట్టు తెలుస్తోంది. ఈనెల చివరిలో మొదటి జాబితా విడుదల అయ్యే అవకాశం ఉంది. మొదటి జాబితాలోనే తన పేరు ఉంటుందనే ఆశాభావంతో దామోదర్‌ ఉన్నారు.
ఇదిలా ఉండగా, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్‌ రమేష్‌ రెడ్డి రూ.20 లక్షలతో కొనుగోలు చేసిన ఎన్నికల ప్రచార రథానికి గురువారం సూర్యాపేటలోని శ్రీ వేంకటేశ్వర దేవాలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి కోటాలో వంద శాతం టిక్కెట్‌ తనదే అనే ధీమాతో ఆయన ఎన్నికల ప్రచారానికి సిద్ధపడుతున్నారు. ఒకవైపు దామోదర్‌రెడ్డి ఢిల్లీలో పూర్తి భరోసాతో ఉండగా.. ఇక్కడ రమేష్‌ రెడ్డి ఏకంగా ప్రచార రథాన్ని ప్రాంభించుకొని ఎన్నికల రణరంగానికి సిద్దపడటం గమనార్హం. ఇరువురూ టిక్కెట్‌పై పూర్తి నమ్మకంతో ఉండటంతో జిల్లా కేంద్రంలో ఉత్కంఠ నెలకొంది.
టిక్కెట్‌ విషయంలో తగ్గేదేలే అన్నట్టు పోటీపడుతున్నారు. అభ్యర్థుల ఎంపిక, వడపోత సమయంలో సూర్యాపేట టిక్కెట్‌ ఫైనల్‌ చేయడం కమిటీ సభ్యులకు కత్తి మీద సాములా మారే అవకాశం ఉంది. ఈ కమిటీలో ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డితో పాటు రేవంత్‌ రెడ్డి, తాజాగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా ఉన్నారు. రాష్ట్ర అగ్ర నేతలు ఢిల్లీలో మకాం వేయడంతో టిక్కెట్‌ ఎవరికి దక్కుతుందా అనే ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే సూర్యాపేట టికెట్‌ చర్చనీయాంశంగా మారింది. ఈ టికెట్‌ ప్రకటనతోనే సూర్యాపేటలో విజయావకాశాలు ఎవర్ని వరించనున్నాయో తేలే అవకాశం ఉంది. సీనియర్లు, జూనియర్ల వార్‌ నేపథ్యంలో అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందో చూడాలి. దామోదర్‌రెడ్డి, రమేష్‌రెడ్డి తమ పట్టును ఏ మాత్రం సడలించకుండా టికెట్‌ కోసం పోరాడుతున్నారు.

Spread the love