Tuesday, May 26, 2026
E-PAPER
Homeమానవిచారిత్రక కళాశాలలో చర్రిత సృష్టించిన సుసాన్‌

చారిత్రక కళాశాలలో చర్రిత సృష్టించిన సుసాన్‌

- Advertisement -

నూట నలభై ఐదేండ్ల ఘనచరిత్ర కలిగిన సెయింట్‌ స్టీఫెన్‌ కాలేజీలో చదువుకోవడమే గొప్పగా భావిస్తారు చాలామంది. అలాంటి ప్రతిష్ఠాత్మకమైన కళాశాలకు ప్రిన్సిపల్‌గా పనిచేసే అవకాశం రావడం మరెంతో గొప్ప విషయం. అలాంటి కాలేజీకి తొలి మహిళా ప్రిన్సిపల్‌గా నియామకమై ప్రొఫెసర్‌ సుసాన్‌ ఇలియాస్‌ చరిత్ర సృష్టించారు. ఈ ఏడాది జూన్‌లో ఆమె ఆ కళాశాల ప్రిన్సిపల్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని విశేషాలు మానవి పాఠకుల కోసం…

ఫిబ్రవరి 1,1881న దిల్లీలో స్థాపించిన సెయింట్‌ స్టీఫెన్‌ కాలేజీ మన దేశంలోని అత్యంత పురాతనమైన, ప్రతిష్ఠాత్మకమైన విశ్వవిద్యాలయాలలో ఒకటి. సెయింట్‌ స్టీఫెన్‌ కాలేజీ అంటే… తత్త్వశాస్త్రం, రాజనీతి, లిబరల్‌ ఆర్ట్స్‌… మొదలైన మానవీయ శాస్త్రాలకు ప్రసిద్ధి గాంచిన కాలేజీ. గతంలో ఈ కాలేజీలో పనిచేసిన వారికన్నా భిన్నమైన విద్యా నేపథ్యం నుంచి వచ్చారు సుసాన్‌. ఇంజినీరింగ్, కంప్యూటింగ్‌ పరిశోధనలలో ఆమెకు మూడు దశాబ్దాల అనుభవం వుంది. ‘ప్రిన్సిపల్‌గా సుసాన్‌ నియామకం సెయింట్‌ స్టీఫెన్స్‌కు అత్యాధునిక సాంకేతికతను తీసుకురాగలదని విశ్వసిస్తున్నాను’ అన్నారు కాలేజీ చైర్మన్‌ పాల్‌ స్వరూప్‌. ప్రిన్సిపల్‌ బాధ్యతల కోసం బహిరంగ ప్రకటన ఇవ్వడం, ఆ తర్వాత ఇంటర్వ్యూలు, షార్ట్‌లిస్టింగ్, అభ్యర్థుల ప్రజెంటేషన్‌ల తర్వాత తుది ఎంపిక జరిగింది. ప్రిన్సిపల్‌గా సుసాన్‌ నియామకాన్ని ఒక మైలురాయిగా అభివర్ణించారు కాలేజీ అకడమిక్స్‌ డీన్, చరిత్ర విభాగాధిపతి మలయ్‌ నీరన్‌. సెయింట్‌ స్టీఫెన్‌ కాలేజీకి తొలి భారతీయ ప్రిన్సిపల్‌గా 1906లో సుశీల్‌ కుమార్‌ రుద్ర చరిత్ర సృష్టించారు. తాజాగా అలాంటి ఘనతను సుసాన్‌ సొంతం చేసుకున్నారు.

ఇక ఏఐపై దృష్టి
ఆమె ఎక్కువగా ఆరోగ్య సంరక్షణ, ఎలక్ట్రానిక్స్‌ రంగాలలో ఏఐ అప్లికేషన్‌లపై దృష్టి సారించారు. మెషిన్‌ లెర్నింగ్, ఎక్స్‌ప్లెయినబుల్‌ ఏఐ, మెడికల్‌ ఇమేజింగ్, ఫెడరేటెడ్‌ లెర్నింగ్, రోబోటిక్స్, డిజిటల్‌ హెల్త్‌లాంటి రంగాలలో పరిశోధనలు చేశారు. లక్నోలోని చండీగఢ్‌ యూనివర్శిటీలో ప్రో వైస్‌ చాన్సలర్‌(పరిశోధన)గా పనిచేశారు. ‘సెయింట్‌ స్టీఫెన్స్‌ ఎంతోమంది మేధావులు, నాయకులను తీర్చిదిద్దింది. తమ కాలానికంటే ముందే ఆలోచించే పరిశోధకులు, పారిశ్రామికవేత్తలకు ఈ కాలేజీ పుట్టిల్లు. క్వాంటం కంప్యూటింగ్‌ యుగంలోకి ప్రవేశించడానికి అవసరమైన నైపుణ్యాలను విద్యార్థులు నేర్చుకోవాలి. ఎందుకంటే అదే మన సమీప భవిష్యత్‌. ఈ కోర్సులు విద్యార్థులకు మాత్రమే కాదు డిజైనర్‌లు, న్యాయవాదులు, జర్నలిస్ట్‌లతో సహా వివిధ రంగాల వారికి ఉపకరిస్తాయి. యూనివర్శిటీలో ఏఐ సర్టిఫికెట్‌ కోర్సులను ప్రవేశపెట్టనున్నాం. విద్యార్థులను ఏఐకి సిద్ధం చేయడానికి, క్వాంటంపై అవగాహన కలిగించడానికి ప్రిన్సిపల్‌గా పనిచేయడం అనేది గొప్ప అవకాశం. కళాశాల ఘనమైన వారసత్వాన్ని కాపాడుతూనే, పరిశోధనలకు ప్రోత్సాహకరమైన వాతావరణాన్ని కల్పిస్తాం’ అంటున్నారు సుసాన్‌ ఇలియాస్‌.

ఎందరో ప్రతిభావంతులు
భారతదేశ తొలి మహిళా ముఖ్యమంత్రి సుచేత కృపలాని, ప్రముఖ చరిత్రకారిణి ఉపిందర్‌ సింగ్, దిల్లీ మాజీ ముఖ్యమంత్రి అతిశీ, నటి రీచా చద్దా, ప్రముఖ న్యాయ వాది, ఉమెన్స్‌ రైట్స్‌ యాక్టివిస్ట్‌ వృందా గ్రోవర్, నటి కొంకణ సేన్‌ శర్మ, ఇండియన్‌ ఉమెన్‌ క్రికెట్‌ టీమ్‌ మాజీ కెప్టెన్‌ అంజుమ్‌ చోప్రా, సుప్రీం కోర్ట్‌ మాజీ జడ్జీ హిమా కోహ్లీ… సెయింట్‌ స్టీఫెన్‌ కాలేజీలో చదువు కున్న ఎంతోమంది ప్రతిభావంతులలో కొందరు.

ఉన్నతమైన బాధ్యతలు
సుసాన్‌ చెన్నైలో పుట్టి పెరిగారు. ఆమె విద్యా, ఉద్యోగ ప్రస్థానానికి చెన్నై ప్రధాన కేంద్రంగా ఉంది. భారత్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ నుండి కంప్యూటర్‌ సైన్స్‌లో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్, అన్నా యూనివర్శిటీ నుండి మల్టీ మీడియా టెక్నాలజీలో మాస్టర్స్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్, కంప్యూటర్‌ సైన్స్‌లో పీహెచ్‌డీ పూర్తి చేసి ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, మద్రాస్‌లో పోస్ట్‌ డాక్టోరల్‌ ఫెలోషిప్‌ చేశారు. ఎన్నో ప్రైవేట్‌ యూనివర్శిటీలు, ఇంజినీరింగ్‌ కాలేజీలలో ఉన్నతమైన బాధ్యతలు నిర్వహించారు. హిందుస్థాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌లో పరిశోధన డైరెక్టర్‌గా, డిజిటల్‌ హెల్త్‌ అండ్‌ బయో–ఇన్నోవేషన్స్‌ సెంటర్‌కు హెడ్‌గా పనిచేశారు. వెల్లూరు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో స్కూల్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ (సెన్స్‌) డీన్‌గా, అదే సంస్థలో అడ్వాన్స్‌డ్‌ డేటా సైన్సెస్‌కు డిప్యూటి డైరెక్టర్‌గా పనిచేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -