‘భారతీయ న్యాయ సంహిత’ అమలును నిలిపివేయండి

'భారతీయ న్యాయ సంహిత'
అమలును నిలిపివేయండి– కేంద్ర హోం మంత్రికి ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్‌ లేఖ
– చర్చలు జరపాలని విజ్ఞప్తి
న్యూఢిల్లీ : భారతీయ న్యాయ సంహిత -2023 చట్టం అమలును నిలిపివేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు అఖిల భారత రోడ్డు రవాణా కార్మికుల సమాఖ్య (ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్‌) ప్రధాన కార్యదర్శి ఆర్‌ లక్షమయ్య లేఖ రాసారు. ఈ చట్టంపై రవాణ పరిశ్రమలో సమాఖ్యలు, భాగస్వామ్యలు, ఇతరులతో చర్చలు జరపాలని కోరారు. జూలై 1 నుంచి ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకుని వస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఈ లేఖ రాసారు. హోం మంత్రికి రాసిన లేఖను శుక్రవారం మీడియాకు విడుదల చేశారు. ఈ లేఖ ద్వారా న్యాయ సంహిత చట్టంలోని అనేక అంశాలను, సెక్షన్లను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకుని వచ్చారు. డ్రైవర్లపై నేరుగా ప్రభావం చూపే చట్టంలోని సెక్షన్‌ 106 (1), (2)లకు వ్యతిరేకంగా ఈ ఏడాది ప్రారంభంలో నిరసనలు, సమ్మె జరిగిన విషయాన్ని మంత్రికి మరోసారి గుర్తు చేశారు. సమ్మె రెండో రోజున ఎఐఎంటీసీ నాయకులతో కేంద్ర హోం శాఖ వ్యవహారాల కార్యదర్శి చర్చలు జరిపారని, ఈ చట్టం అమల్లోకి తీసుకుని రావడానికి ముందు ఏఐఎంటీసీతో సంప్రదింపులు జరుపుతామని హామీ ఇచ్చారని ఈ లేఖలో ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్‌ గుర్తు చేసింది. అయితే తరువాత ఎలాంటి సంప్రదింపులు లేకుండానే సెక్షన్‌ 106(2)ను మినహాయించి ఈ చట్టంలోని అన్ని సెక్షన్లలను జులై 1 నుంచి అమల్లోకి తీసుకుని వస్తున్నట్లు కేంద్రం నోటిఫికేషన్‌ జారీ చేసిందని విమర్శించింది. కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అనేక మంది మేధావులు, సంస్థలు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ లేఖలు రాసాయిని ఈ సందర్భంగా ఎఐఆర్‌టీడబ్ల్యూఎఫ్‌ ప్రస్తావించింది. ఈ చట్టానికి వ్యతిరేకంగా బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా కూడా 26న తీర్మానాన్ని ఆమోదించిందని తెలిపింది. దేశవ్యాప్తంగా బార్‌ అసోసియేషన్లు, రాష్ట్ర బార్‌ కౌన్సిల్స్‌ నిరసనలు తెలిపాయని పేర్కొంది.
ఇప్పటి వరకూ ఇండియన్‌ పీనల్‌ కోడ్‌లోని ఒక్క సెక్షన్‌ (సెక్షన్‌ 104) ప్రకారమే యాక్సిడెంట్‌ కేసుల్లో జరిమానాలు, శిక్షలు విధించేవారని, ఇప్పుడు భారత న్యాయ సంహితలో దీనిని రెండు సెక్షన్లకు విస్తరించారని విమర్శించింది. కొత్త చట్టంలోని సబ్‌ సెక్షన్లు 106(1), (2) కింద యాక్సిడెంట్‌ కేసుల్లో ఐదేండ్ల నుంచి పదేండ్ల వరకూ శిక్ష విధించే అవకాశం ఉందని తెలిపింది. ఐపీసీ సెక్షన్‌ 304 (ఎ) కింద ఇప్పటి వరకూ 6 నెలల జైలు శిక్ష మాత్రమే విధిస్తున్నారని తెలిపింది. రోడు ప్రమాదాలకు కేవలం డ్రైవర్లు మాత్రమే కాకుండా ఇంకా అనేక అంశాలు కారణమవుతున్నాయని, వాటిపై వివరణాత్మక చర్చలు, దిద్దుబాటు చర్యలు, విధాన నిర్ణయాలు జరగాల్సి ఉందని లేఖలో తెలిపింది. తమ యొక్క మంచి బుద్ధితో ఈ నోటిఫికేషన్‌ను పక్కన పెట్టాలని కేంద్ర మంత్రిని ఈ లేఖ ద్వారా ఎఐఆర్‌టీడబ్ల్యూఎఫ్‌ అభ్యర్థించింది. అలాగే రవాణా రంగంలో భాగస్వామ్యులు, ఇతరులతో చర్చలు జరపాలని కోరింది.

Spread the love