– 2,400 ఫైళ్ల దగ్ధం
– మదనపల్లె ఘటనపై సిసోడియా
మదనపల్లె: మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో రికార్డుల దగ్ధం ఘటనపై కొంతమంది కార్యాలయ సిబ్బందిపై అనుమానం ఉందని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా చెప్పారు. వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే కొంతమందిపై సస్పెన్షన్ వేటు పడిందని, మరికొంతమందిని అరెస్టు చేసే అవకాశం ఉందని తెలిపారు. శుక్రవారం భూ బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. కార్యాలయంలో సుమారు 2,400 ఫైళ్లు దగ్ధమైనట్లు గుర్తించామని, వాటిని రికవరీ చేసే అవకాశం ఉందని వివరించారు. ఏదైనా కెమికల్ ఉపయోగించడం వల్ల పెద్దఎత్తున మంటలు సంభవించాయా? మరే రకమైన ద్రవ పదార్థాలు ఏమైనా వాడారా? అనే విషయాలు ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాత తెలుస్తుందని, ఆ తరువాతనే దోషులను అరెస్టు చేస్తామని తెలిపారు. ఇప్పటికే ఏడుగురిని అదుపులోకి తీసుకుని పలు కోణాల్లో విచారిస్తున్నామన్నారు. భూ కుంభ కోణాల్లో ఎక్కువగా ప్రమేయం ఉన్న రైస్‌మిలు యజమాని మాధవరెడ్డి పరారీలో ఉన్నారిని, ఆయన కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు. అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల పరిధిలో 20 ఏళ్లుగా 2.16 లక్షల ఎకరాలు ఫ్రీహోల్డ్ అయ్యాయని, అందులో 4,400 ఎకరాలు రిజిస్ట్రేషన్ కూడా జరిగిపోయినట్లు తెలిపారు. పూర్తి స్థాయిలో నివేదికలు తెప్పించుకొని వాటి ఆధారంగా చర్యలు చేపడతామన్నారు. తాము స్వీకరించిన అర్జీల్లో ప్రధానంగా దౌర్జన్యంగా భూములు, డికెటి భూముల రిజిస్ట్రేషన్లు వంటివి వచ్చాయని, వాటిని సెక్షన్ 145 ప్రకారం బాధితులకు అప్పగించే ప్రయత్నం చేస్తామన్నారు. కోర్టులో ఉన్న భూ కేసులను కోర్టు పరిధిలోనే న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 400 అర్జీలు వచ్చాయని, ప్రతి ఒక్క అర్జీని పరిశీలించి కచ్చితంగా బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.