ఆర్టీసీ బస్సెక్కండి

Take RTC– గ్రూప్‌-1 అభ్యర్థుల కోసం ప్రత్యేక సర్వీసులు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
గ్రూప్‌-1 ప్రిలిమనరీ పరీక్ష రాసే అభ్యర్థుల సౌకర్యార్థం టీజీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నదని ఆ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌ తెలిపారు. పరీక్ష ఆదివారం కావడంతో అభ్యర్థులకు అసౌకర్యం కలగకుండా రాష్ట్రంలోని 897 పరీక్షా కేంద్రాలకు బస్సులు నడుపుతున్నామన్నారు. ఈ మేరకు శనివారంనాడొక పత్రికా ప్రకటన విడుదల చేశారు. రాజధాని హైదరాబాద్‌ నుంచి జిల్లాలకు ఈ రోజు సాయంత్రం నుంచే అభ్యర్థుల రద్దీ ఎక్కువగా ఉన్నందున, ఎంజీబీఎస్‌, జేబీఎస్‌, ఉప్పల్‌, ఎల్బీనగర్‌, ఆరాంఘర్‌ పాయింట్లలో తగిన ఏర్పాట్లు చేశామన్నారు. రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. రాష్ట్రంలోని ప్రధాన బస్‌ స్టేషన్లలో ప్రయాణీకుల సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశామనీ, అక్కడ పరీక్షా కేంద్రాల సమాచారాన్ని అభ్యర్థులకు ఇవ్వడంతో పాటు ఏ బస్సులో వెళ్లాలో అధికారులు చెప్తారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 4.03 లక్షల మంది అభ్యర్థులు గ్రూప్‌-1 ప్రిలిమినరీకి హాజరవుతుండగా, గ్రేటర్‌ హైదరాబాద్‌లోనే దాదాపు 1.70 లక్షల మంది ఈ పరీక్షలు రాస్తున్నారని వివరించారు. రద్దీకి అనుగు ణంగా సిటీ బస్సులను అందుబాటులో ఉంచామన్నారు. ఆర్టీసీ బస్సుల్లో పరీక్షా కేంద్రాలకు క్షేమంగా వెళ్లి, ప్రశాంత వాతావరణంలో గ్రూప్‌-1 ప్రిలిమ నరీ పరీక్షలు రాయాలని కోరుతూ, ఆయన అభ్యర్థులకు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు.
రామోజీకి నివాళి
ఈనాడు గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు మరణం పట్ల టీజీఎస్‌ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌ సంతాపం తెలిపారు. శనివారంనాడాయన రామోజీ నివాసంలో పార్దివ దేహాన్ని దర్శించి, పుష్పగుచ్ఛాలు ఉంచి, శ్రద్ధాంజలి ఘటించారు. వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ఈ సందర్భంగా రామోజీరావు వ్యక్తిత్వం, వృత్తి వికాసాన్ని కొనియాడారు.

Spread the love