నవతెలంగాణ-హైదరాబాద్: తమిళనాడులో టీవీకేకు మాత్రమే ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశముందని సీపీఐ(ఎం) జనరల్ సెక్రటరీ ఎంఏ బేబి అన్నారు. శుక్రవారం చెన్నైలోని జాతీయ మీడియాతో మాట్లాడారు. సీపీఐ, సీపీఐ(ఎం), వీసీకే మధ్య సమగ్ర చర్చలు జరుగుతున్నాయని, కొన్ని గంటల్లోనే సరైన నిర్ణయం వెలువడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల అభీష్టం మేరకు ప్రభుత్వ ఏర్పాటు కోసం విజయ్‌కు అన్ని పార్టీలు కలిసి మద్దతు ఇస్తాయని దీమా వ్యక్తం చేశారు. అధిక స్థానాలు సాధించిన టీవీకేనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, విజయ్ బలనిరూపణ అసెంబ్లీలో నిరూపిస్తారని ఆయన వెల్లడించారు. అయితే రాష్ట్ర గవర్నర్ తీరు ప్రస్తుతం ఆందోళనకరంగా ఉందని ఆయన విమర్శించారు. ప్రజాతీర్పుకు, ప్రజాస్వామ్య పద్ధతులకు గవర్నర్ కట్టుబడి ఉండాలని ఎంఏ బేబి నొక్కి చెప్పారు.
శుక్రవారం సీపీఐ, సీపీఐ(ఎం) నేతలు చెన్నైలోని పార్టీ కార్యాలయంలో సుదీర్ఘ భేటీ నిర్వహించాయి. విజయ్ అభ్యర్థన మేరకు ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇచ్చేది లేనిది కాసేపట్లో తెలనుంది. వీసీకే కూడా టీవీకేకు మద్దతు తెలపడానికి సుముఖం ఉందని సమాచారం. కాగా, 234 అసెంబ్లీ స్థానాలకు 107 స్థానాలు టీవీకే సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిగ్ ఫిగర్(118)కు అతి చేరువలో ఆగిపోయింది. కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ఇవ్వగా..టీవీకే బలం 112కు చేరుకుంది. వామపక్షాలతో పాటు వీసీకే మద్దతు ఇస్తే విజయ్‌కు ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ రానుంది.



