టార్గెట్ జగదీష్ రెడ్డి నా..!

– మున్సిపల్ పీఠం దక్కించుకునేందుకు ఎత్తుగడలు
– ఏకం అవుతున్న కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ
– కౌన్సిలర్ల టచ్ లో ఆర్డిఆర్ వీరేశం..?
– రసవత్తరంగా మారనున్న అవిశ్వాసం
నవ తెలంగాణ – సూర్యాపేట
బీఆర్ఎస్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి ని టార్గెట్ గా చేస్తూ మున్సిపల్ పీఠాన్ని దక్కించుకునేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష కౌన్సిలర్లతో ఎత్తుగడలు వేస్తున్నట్లు గా ప్రచారం సాగుతోంది. ఇందులో భాగంగానే మున్సిపల్ చైర్ పర్సన్ అన్నపూర్ణ, వైస్ ఛైర్మన్ కిషోర్ లపై అవిశ్వాస తీర్మానం పెట్టి  జగదీష్ రెడ్డి ని చెక్ పెట్టేందుకు ఐక్యతారాగం వినిపిస్తున్నాయి.ఇప్పటికే బీఆర్ఎస్ నాయకుడు దిలీప్ రెడ్డి తన భార్య 31 వ వార్డు కౌన్సిలర్ కొండపల్లి నిఖిలను మున్సిపల్ చైర్ పర్సన్ గా చేయాలనే తలంపుతో కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్ల మద్దతుతో బి.ఆర్.యస్,బీఎస్పి లకు చెందిన కొందరు కౌన్సిలర్లను  హైదరాబాద్ లోని విల్లా కు తీసుకెళ్లిన విషయం తెల్సిందే. ఇక మద్దతు ఇస్తున్న కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన కౌన్సిలర్లు మాత్రం సూర్యాపేట లోనే వున్నారు. ఇదిలావుండగా హైదరాబాద్ లోని విల్లా శిబిరంలో ఉన్న కౌన్సిలర్లను మాజీమంత్రి దామోదర్ రెడ్డి కలిసినట్లు తెల్సింది. అదేవిధంగా నక్రికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం వీరితో ఫోన్ లో టచ్ లో ఉన్నట్లు సమాచారం. ఎలాగైనా సరే మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోని జగదీష్ రెడ్డి పై రాజకీయ రీవేంజ్ తీర్చుకోవాలనే “కసితో”
అధికార పార్టీ అగ్ర నేతలు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే విల్లా లో ఉన్న కౌన్సిలర్లతో పాటు మద్దతు పలుకుతున్న మిగతా కౌన్సిలర్లను తీసుకొని మరో పది రోజుల పాటు లాంగ్ టూర్ వెళ్ళేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. కాగా 32 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పై సంతకాలు పెట్టిన నేపథ్యంలో కలెక్టర్ వెంకట్రావు ఈనెల 27వ తేదీన మున్సిపల్ కార్యాలయంలో  11 గంటలకు చైర్పర్సన్, ఒంటి గంటకు వైస్ ఛైర్మన్లపై అవిశ్వాసం ఓటింగ్ నిర్వహించనున్నారు. 32 మందిలో ఒక్క కౌన్సిలర్ హాజరు కాకపోయినా అవిశ్వాసం వీగిపోయే అవకాశం ఉంది. ఒకవేళ అవిశ్వాసం సక్సెస్ అయితే మాత్రం అప్పుడు కొత్తగా చైర్ పర్సన్,వైస్ ఛైర్మన్ ల ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల సంఘం కు కలెక్టర్ సమాచారం ఇచ్చే అవకాశం ఉంది.ఇందుకు గాను 15 రోజుల గడువు ఉండనున్నది. మరి ఈ 15 రోజుల పాటు ఇంచార్జి చైర్ పర్సన్ గా  “సీనియర్ కౌన్సిలర్” ని నియమించే సర్వ అధికారాలు కలెక్టర్ కు ఉండ నున్నాయి. ఇంచార్జి చైర్ పర్సన్ నియామకం పై మున్సిపల్ చట్టం-2019 నిబంధనల ప్రకారం కలెక్టర్ నిర్ణయమే ఫైనల్ కానున్నది.ఆయన ఎవరిని సూచిస్తారో వారే ఇంచార్జి చైర్ పర్సన్ అయ్యే అవకాశం ఉంది. ఇదిలావుండగా అవిశ్వాసాన్ని ఎదుర్కొని చైర్పర్సన్,వైస్ ఛైర్మన్ స్థానాలను కోల్పోకుండా ఉండేందుకుగాను ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలిసింది. ఇందుకుగాను ఆయన ప్రస్తుతం ఉన్న కౌన్సిలర్లను కాపాడుకుంటూ వ్యూహాత్మకoగా వ్యవహరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే “జగదీష్ రెడ్డి ఉరఫ్ లాయర్” కాబట్టి  అవిశ్వాసా ఎపిసోడ్ పై మున్ముందు ఎలాంటి “ఊహించని ఎత్తుగడలు” చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.
Spread the love