– బడిబాట ను విజయవంతం చేయండి: ఎంఈఓ ప్రసాదరావు
నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును (ఎన్రోల్మెంట్) పెంచే లక్ష్యంతో అశ్వారావుపేట బాలుర ఉన్నత పాఠశాలలో మంగళవారం ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మండల విద్యాధికారి పొన్నగంటి ప్రసాద్‌రావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రతి పాఠశాలకు విద్యార్థుల నమోదు లక్ష్యాలను నిర్దేశించారని తెలిపారు. ఆ లక్ష్యాలను సాధించడంలో ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని,లేనిపక్షంలో ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉందన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు, మధ్యాహ్న భోజనం తదితర అనేక సౌకర్యాలు అందిస్తున్నామని,ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు అల్పాహారం (బ్రేక్‌ఫాస్ట్) కూడా అందించే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
బడిబాట కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించి,తల్లిదండ్రులను చైతన్యపరచడం ద్వారా విద్యార్థుల నమోదును పెంచే దిశగా కృషి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు హరిత మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో చేరేలా తల్లిదండ్రులను ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు సాహీనా బేగం,కొండలరావు,వీరేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.



