– రాష్ట్ర సమగ్ర అభివృద్ధే తెలంగాణ అమరవీరులకు నిజమైన నివాళి
– ఎమ్మెల్యే జారె ఆదినారాయణ
నవతెలంగాణ – అశ్వారావుపేట
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ క్యాంపు కార్యాలయం, ప్రభుత్వ ఆసుపత్రి, మున్సిపల్ కార్యాలయాల్లో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఆయన, తెలంగాణ సాధన కోసం కృషి చేసిన నాయకులు, స్వాతంత్ర్య సమరయోధులు, అమరవీరుల చిత్రపటాలకు పూలాభిషేకం చేసి ఘనంగా స్మరించారు.
అనంతరం మాట్లాడుతూ, వేలాది మంది విద్యార్థులు, యువకులు, రైతులు, ఉద్యోగులు చేసిన ఉద్యమాలు, అమరవీరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని పేర్కొన్నారు. రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులందరికీ ఘన నివాళులు అర్పిస్తూ, వారి ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం కేవలం పరిపాలనా విభజన కాదని, అది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం తెలంగాణ భాష, యాస, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రత్యేక గుర్తింపు లభించిందని, బతుకమ్మ, బోనాలు వంటి పండుగలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడం గర్వకారణమని పేర్కొన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, తాగునీరు, విద్యుత్, విద్యా సదుపాయాల అభివృద్ధితో పాటు రైతులకు సాగునీరు అందించేందుకు అనేక ప్రాజెక్టులు చేపట్టినట్లు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతున్నాయని చెప్పారు.
తెలంగాణ సాధనలో యువత పోషించిన పాత్రను గుర్తుచేస్తూ, రాష్ట్ర భవిష్యత్తును నిర్మించే బాధ్యత కూడా యువతదేనని అన్నారు. చదువు, క్రమశిక్షణ, కష్టపడి పనిచేసే తత్వంతో ముందుకు సాగి అమరవీరుల కలలను సాకారం చేయాలని యువతకు సూచించారు.
రాష్ట్రం ఏర్పడటం అంతిమ లక్ష్యం కాదని, అభివృద్ధి చెందిన తెలంగాణ నిర్మాణమే అసలు లక్ష్యమని పేర్కొన్నారు. కుల, మత, రాజకీయ భేదాలకు అతీతంగా అందరూ కలిసి ప్రతి గ్రామం అభివృద్ధి చెందేలా కృషి చేయాలని, అదే అమరవీరులకు అందించే నిజమైన నివాళి అవుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట మున్సిపల్ ఛైర్జూపర్సన్ పల్లి శశికళ, వైస్ ఛైర్పర్సన్ జూపల్లి రమేష్ బాబు,ఆత్మ కమిటీ చైర్మన్ సులకపల్లి వీరభద్రరావు, కాంగ్రెస్ డీసీసీ సభ్యులు తుమ్మా రాంబాబు, మండల అధ్యక్షులు చిన్నం శెట్టి సత్యనారాయణ, సీపీఐ ( ఎం) నాయకులు పుల్లయ్య, చిరంజీవి,
రేమల్ల కేదార్నాథ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ శాఖల అధికారులు, మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. అనంతరం మున్సిపాలిటీ పరిధిలో విద్యుత్ సరఫరా మెరుగుపర్చే లక్ష్యంతో నూతనంగా ఏర్పాటు చేసిన ఐదు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. అలాగే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కామ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి, రక్తదాతలను అభినందించారు.



