ప్రాథమిక విద్యావ్యవస్థ నిర్వీర్య చర్యలపై ఆగ్రహం
‘స్కూల్ కాంప్లెక్స్ సిస్టమ్’ ఉపసంహరణకు డిమాండ్
సిమ్లా : హిమాచల్ ప్రదేశ్‌లో ప్రాథమిక ఉపాధ్యాయులు పోరుబాట పట్టారు. ప్రధానోపాధ్యులు, ఉపాధ్యాయుల సంఖ్య కుదింపు ద్వారా ప్రాథమిక విద్య వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు తీసుకొచ్చిన ‘స్కూల్ కాంప్లెక్స్ సిస్టమ్’ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 15 రోజుల పాదయాత్రలు చేపట్టి ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వం దిగిరాకపోవడంతో ఆదివారం సిమ్లాలోని చారిత్రాత్మక చౌరా మైదానంలో నిరవధిక రిలే నిరాహార దీక్ష ప్రారంభించారు. ‘స్కూల్ కాంప్లెక్స్ సిస్టమ్’ను రద్దు చేయాలనే డిమాండ్ నెరవేరేంతవరకు నిరాహార దీక్ష కొనసాగుతుందని స్పష్టం చేశారు. హిమాచల్ ప్రదేశ్ ప్రాథమిక ఉపాధ్యాయుల సమాఖ్య (హెచ్‌పిపిటిఎఫ్) ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఆందోళన్లలో ప్రస్తుత, పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయులతో పాటు మధ్యాహ్న భోజన పథకం సిబ్బంది, బహుళ విధుల కార్మికులు, ఇతర విద్యా శాఖ ఉద్యోగులు కూడా పాల్గొన్నారు. పాంగీ, డోడ్రా క్వార్ వంటి మారుమూల గిరిజన ప్రాంతాల ఉపాధ్యాయులు కూడా ఉద్యమంలో పాల్గొన్నారు.రాష్ట్రంలో గతేడాది సెప్టెంబర్ నుంచి ఏకపక్షంగా అమలు చేస్తున్న ‘స్కూల్ కాంప్లెక్స్ సిస్టమ్’ను వెంటనే రద్దు చేయాలని హెచ్‌పిపిటిఎఫ్ డిమాండ్ చేస్తోంది. ఈ విధానంలో పలు ప్రాథమిక, మాధ్యమిక, సీనియర్ సెకండరీ పాఠశాలలను ఒకే పరిపాలనా అధికారి ఆధ్వర్యంలోకి తీసుకువచ్చారని, దీంతో ప్రాథమిక పాఠశాలల స్వయం ప్రతిపత్తి దెబ్బతిందని ఆందోళన వ్యక్తం చేసింది.
అలాగే ఉపాధ్యాయుల నియామకాలు, బోధన వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడిందని హెచ్‌పిపిటిఎఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 11న ప్రారంభమైన ‘ప్రాథమిక విద్యను కాపాడండి’ పాదయాత్ర సిమ్లాలో విజయవంతంగా ముగిసిందని హెచ్‌పిపిటిఎఫ్ అధ్యక్షులు రమేష్ శర్మ పేర్కొన్నారు. కొత్త విధానంలో 15-20 పాఠశాలలను ఒకే ఛత్రం కిందకు తీసుకొచ్చి ఆ మేరకు ఉపాధ్యాయులను, ప్రధానోపాధ్యులను కుదించి ఒకే పరిపాలనాధికారిని నియమిస్తున్నారని, దీనివల్ల విద్యారంగ ప్రమాణాలు తగ్గిపోతాయని, విద్యార్థులకు కూడా తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతాయని తెలిపారు. ఇదివరకు పాఠశాలకు ఒక ప్రధానోపాధ్యుడు ఉంటే ఇప్పుడు 15-20 పాఠశాలలకు కలిపి మొత్తంగా ఒకే ప్రధానోపాధ్యాయుడు ఉంటారని తెలిపారు. ఆ మొత్తం పాఠశాలలు ఆయన నియతంత్రణలోనే నడుస్తాయని తెలిపారు. దీని ప్రభావంతో జేబీటీ, నర్సరీ ఉపాధ్యాయులతో పాటు ఇతర సిబ్బంది కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని సుమారు 200 ప్రాథమిక పాఠశాలలు ఉపాధ్యాయుల కొరతతో నడుస్తున్నాయని ఆయన విమర్శించారు.ప్రభుత్వం తమ న్యాయబద్ధమైన డిమాండ్లను అంగీకరించి స్కూల్ కాంప్లెక్స్ వ్యవస్థను ఉపసంహరించుకునే వరకు ఉద్యమం కొనసాగుతుందని రమేష్ శర్మ స్పష్టం చేశారు.
హిమాచల్‌ప్రదేశ్‌లో కదంతొక్కిన ఉపాధ్యాయులు
- Advertisement -
- Advertisement -



