భారీ బడ్జెట్‌తో దిగువ కోర్టుల్లోనూ సాంకేతికత : సీజేఐ డి.వై. చంద్రచూడ్‌

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్‌
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్‌

నవతెలంగాణ న్యూఢిల్లీ : ఇ- కోర్టుల ప్రాజెక్ట్‌ మూడో దశలో కేటాయించిన భారీ బడ్జెట్‌ న్యాయవ్యవస్థ పనితీరులో సాంకేతికతను జోడిస్తుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్‌ గురువారం పేర్కొన్నారు. ముఖ్యంగా దిగువ కోర్టుల్లో ఆధునిక సాంకేతికతను అభివృద్ధి చేయవచ్చని అన్నారు. కింది కోర్టులకు సాంకేతికత ప్రోత్సాహం అవసరమన్న సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దేవ్‌ వ్యాఖ్యలపై సీజేఐ పైవిధంగా స్పందించారు. ఆర్టికల్‌ 370 రద్దును సవాలు చేస్తూ దాఖలైన కేసులపై సుప్రీంకోర్టు ప్రధాన న్యామయూర్తి నేతృత్వంలో రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కొవిడ్‌ మహమ్మారి సమయంలో కోర్టుల పనితీరుగురించి వివరించారు. ఆసమయంలో హైకోర్టులలో ఒకటి అత్యవసరమైన వీడియో కాన్ఫరెన్స్‌ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసేందుకు కూడా నిధులు లేక సందిగ్ధంలో పడిందని అన్నారు.ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.7,000 కోట్లతో ఇ-కోర్టుల ప్రాజెక్ట్‌ మూడవ దశను ప్రారంభించినట్టు కేంద్రం ప్రకటించింది.
కొవిడ్‌ సమయంలో దేశవ్యాప్తంగా అన్నీ మూతపడినా.. కోర్టులను నడిపించాల్సి వచ్చిందని సీజేఐ పేర్కొన్నారు. చివరికి సుప్రీంకోర్టులోని కొన్ని లైసెన్సులు హైకోర్టుకు బదిలీ అయ్యాయి. నేడు భారీ బడ్జెట్‌తో దిగువ కోర్టుల్లో కూడా సాంకేతికతను అందించే దిశగా ప్రయత్నిస్తున్నామని అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సీజేఐ మాట్లాడుతూ.. ఇ – కోర్టుల ప్రాజెక్టు మూడోదశలో పేపర్‌ రహిత మౌలిక సదుపాయాల కల్పన, కోర్టు రికార్డులను డిజిటల్‌గా మార్చడంతో పాటు దేశవ్యాప్తంగా కోర్టులన్నింటినీ అనుసంధానం చేయాలని అన్నారు. అలాగే కోర్టు భవనాల్లో ఇ -సేవా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.

Spread the love