– సీఎం ఒట్లు నమ్మేటట్టు లేదు..
– అరచేతిలో వైకుంఠంలా ఆరు గ్యారంటీలు
– ఆగర్భ శ్రీమంతుడికి, భూగర్భ కార్మికుడికి మధ్యే పోటీ
– మంచిర్యాల జిల్లాగా ఉండాలంటే కొప్పుల ఈశ్వర్‌ను గెలిపించాలి
– రోడ్‌షోలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్
నవతెలంగాణ-మంచిర్యాల
”సీఎం రేవంత్‌రెడ్డి ఒట్లు నమ్మేటట్టు లేదు.. ఐదు నెలల కాలంలోనే రాష్ట్రం ఆగమైంది.. అసెంబ్లీ ఎన్నికల్లో అరచేతిలో వైకుంఠంలా ఆరు గ్యారంటీలు చూపించి మోసం చేశారు.. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో వందల కోట్ల సామ్రాజ్యం ఉన్న వ్యక్తులు ఒక వైపు, సింగరేణి కార్మికుడు ఒక్కడు ఒక వైపు ఉండి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు” అని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. శనివారం పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌కు మద్దతుగా మంచిర్యాలలో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. కోట్లకు అధిపతి అయిన గడ్డం వంశీ, సింగరేణి కార్మికుడైన కొప్పుల ఈశ్వర్ పోటీ పడుతున్నారని, ఎవరు గెలిస్తే అభివృద్ధి చేస్తారో ఓటర్లు ఆలోచించాలని కోరారు. గిరిజనులు, మారుమూల ప్రాంతాల కోసం పాత ఆదిలాబాద్ జిల్లాలో మూడు కొత్త జిల్లాలను ఏర్పాటు చేశామని తెలిపారు. కానీ పార్లమెంటు ఎన్నికల తెల్లారే వాటిని రద్దు చేస్తానని ముఖ్యమంత్రి అంటున్నాడని.. ఇప్పుడు మళ్లీ మనం ఆదిలాబాద్ దారి పట్టాలా? 100, 150 కిలోమీటర్లు నడవాలా? అని ప్రశ్నించారు. మంచిర్యాల జిల్లా ఉండాలంటే కొప్పుల ఈశ్వర్‌ను పెద్దపల్లి ఎంపీగా గెలిపించాలని.. బీఆర్ఎస్ పార్టీకి ఓటెయ్యాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సాగు, తాగు నీరు, కరెంట్ కనపడతలేవన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలుగాని ఆరు గ్యారంటీలతో తెలంగాణ ప్రజలను మోసం చేసిందన్నారు.
బస్సు ఫ్రీతో ఆడోళ్లు సిగలు పట్టుకుని కొట్టుకుంటున్నారని, ఆటో రిక్షా కార్మికుల బతుకులు ఆగమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఎక్కడికి పోయినా దేవుళ్ల మీద ఒట్టు పెట్టి హామీల వర్షం కురిపిస్తున్నారని, కానీ ఒక్క హామీ కూడా అమలు చేస్తలేరని తెలిపారు. మున్సిపాలిటీలకు, పంచాయతీలకు ఫండ్స్ లేక చెత్తగా తయారయ్యాయన్నారు. రైతులకు మద్దతు ధరతో పాటు బోనస్ ఇస్తామని చెప్పి బోగస్ చేశారన్నారు. స్ట్రీట్ లైట్లు పోతే రిపేర్లు చేసే పరిస్థితి లేదని, కేసీఆర్ కిట్టు, విదేశీ విద్య సాయం ఇలా అన్నీ బంద్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అమలు చేసిన అన్ని అభివృద్ధి పనులనూ ఆపేశారని తెలిపారు.ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దావోస్ పోయి అదానీతో అగ్రిమెంట్ చేసుకున్నారని, బీజేపీ ప్రభుత్వం మళ్లీ వస్తే సింగరేణిని ప్రయివేట్‌పరం చేస్తారని తెలిపారు. గోదావరిని తీసుకుపోయి తమిళనాడుకు ఇస్తామన్నా కూడా సీఎం ఎందుకు నోరు మెదపట్లేదని ప్రశ్నించారు. కేసులకు, జైళ్లకు కేసీఆర్ భయపడడని, ఎన్నో కేసులు ఎన్నో ఉద్యమాలు చేసి తెలంగాణ తీసుకొచ్చాడని తెలిపారు. తాను భయపడితే తెలంగాణ వచ్చేదా? ఒకసారి ప్రజలు గమనించాలని గుర్తు చేశారు. తెలంగాణకు అన్యాయం జరిగితే తన ప్రాణాలను అడ్డుపెట్టి అయినా ప్రజల కోసం కొట్లాడుతానని అన్నారు.నరేంద్రమోడీది ఉత్త గ్యాస్ కంపెనీ అని, బీజేపీకి ఓటేసినా గోదావరిలో వేసినా ఒకటే అని అన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో బీజేపీ అసలు పోటీనే కాదని, కాంగ్రెస్‌కు బీఆర్ఎస్కు మధ్యనే పోటీ ఉందని తెలిపారు. కొప్పుల ఈశ్వర్‌ను భారీ మెజారిటీతో గెలిపిస్తే పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్లమెంట్లో కొట్లాడి నిధులు తీసుకొస్తామని, సింగరేణిని కాపాడుతామని తెలిపారు. రోడ్ షోలో పెద్దపల్లి అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే, మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు బాల్క సుమన్, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య పాల్గొన్నారు.