– ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి టీఎన్జీవో వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను వెనక్కి తీసుకురావాలని టీఎన్జీవో కేంద్ర సంఘం ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావును ఆ సంఘం ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్ నేతృత్వంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. వాటి ప్రతులను ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయాల్లోనూ అందజేశారు. ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను వెనక్కి తీసుకురావాలంటూ రామకృష్ణారావు కోరగా, ఆయన సానుకూలంగా స్పందించారనీ, త్వరలో ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో అసోసియేట్ ప్రెసిడెంట్ కస్తూరి వెంకటేశ్వర్లు, హైదరాబాద్ సిటీ అధ్యక్షులు కె శ్రీకాంత్, కార్యదర్శి పి హరికృష్ణ, ఉపాధ్యక్షులు మహేష్, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు రవి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.