– పవర్‌లూమ్ వర్కర్స్ యూనియన్, చేనేత కార్మిక సంఘం వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని 350 ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు, టెస్కోకు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం, తెలంగాణ పవర్‌లూమ్ వర్కర్స్ యూనియన్(సీఐటీయూ అనుబంధం) డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆదివారం ఆ సంఘం ఆధ్వర్యంలో చేనేత, జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుకు మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, తెలంగాణ పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూరపాటి రమేష్, తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు వనం శాంతి కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళి తదితరులు కలిసి వినతి పత్రం అందజేశారు. 11 ఏండ్ల నుంచి ఎన్నికలు నిర్వహించని విషయాన్ని మంత్రి దృష్టికి వారు తీసుకెళ్లారు. సహకార సంస్థలకు మాతృ సంస్థ అయిన టెస్కోకు పాలకవర్గాలు లేక సంఘాల్లోని కార్మికులకు ఉపాధి కల్పించలేదనీ, పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచి అందించలేకపోయాయని వాపోయారు. సహకార సంఘాల ద్వారా ఆర్డర్లతో ఉత్పత్తి చేసిన వస్త్రాలకు రాష్ట్ర సర్కారు నిధులు విడుదల చేయలేదన్నారు. దీంతో సహకార సంఘాలు క్యాష్ క్రెడిట్ ద్వారా తెచ్చిన రుణాలకు వడ్డీలు పెరిగిపోయి నష్టాల్లోకి కూరుకుపోయాయని తెలిపారు. సహకార సంఘాల్లో కోట్లాది రూపాయల వస్త్ర నిల్వలు పేరుకుపోయిన విషయాన్ని ప్రస్తావించారు. వస్త్ర నిలువలను కొనుగోలు చేయాలని మంత్రిని కోరారు. కార్పొరేషన్ స్థానంలో అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేసి బడ్జెట్‌లో రూ.1000 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలకు కావలసిన వస్త్రాలను చేనేత కార్మికుల చేత ఉత్పత్తి చేయించాలనీ, వారికి మెరుగైన ఆదాయం లభించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సొసైటీలకు త్వరలో ఎన్నికలు నిర్వహిస్తామనీ, బకాయిలను చెల్లించి, వస్త్రాలను కొనుగోలు చేస్తామని, సంక్షేమ బోర్డు ఏర్పాటుకు, నిధుల కేటాయింపు అంశాన్ని పరిశీలిస్తామని మంత్రి హామీనిచ్చారని వారు తెలిపారు.