పెట్టుబడుల ఆకర్షణలో తెలంగాణ టాప్‌

– రాష్ట్రానికి అత్యధిక ఎఫ్‌డిఐలు
– పట్టణ, గ్రామీణాభివృద్థికి సమాన ప్రాధాన్యత
– హ్యాట్రిక్‌ గెలుపునకు మద్దతివ్వండి
– ఎఫ్‌టిసిసిఐ అవార్డుల ప్రదానంలో మంత్రి కెటిఆర్‌
నవ తెలంగాణ – బిజినెస్‌ బ్యూరో
దేశంలోనే పెట్టుబడుల ఆకర్షణలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని మంత్రి కెటి రామారావు అన్నారు. రాష్ట్రావతరణ అనంతరం గడిచిన తొమ్మిదేళ్లలో తమ ప్రభుత్వం పట్టణ, గ్రామీణ ప్రాంతాలను సమానంగా అభివృద్థి చేసిందన్నారు. ఇంతక్రితం సిఎంలు ఒక్కరు పట్టణ ప్రాంతం, పరిశ్రమలపై, మరోక్కరు గ్రామీణ ప్రాంతాలపై వేరువేరుగా దృష్టి సారించారన్నారు. కానీ.. తమ ప్రభుత్వం రైతులు, సంక్షేమం, వ్యవసాయం, పరిశ్రమలు, పట్టణాల అభివృద్థిపై సమాన దృష్టి పెట్టిందన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఎఫ్‌టిసిసిఐ ఎక్సలెన్సీ అవార్డుల ప్రదానం జరిగింది. 22 కేటగిరిల్లో అవార్డులను అందించారు. దీనికి ముఖ్య అతిథిగా మంత్రి కెటిఆర్‌ హాజరై విజేతలకు అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. మూడోసారి తమ ప్రభుత్వ గెలుపునతో హ్యాట్రిక్‌ను అందించడానికి మద్దతును ఇవ్వాలని ఆయన పారిశ్రామికవేత్తలను కోరారు. భారత మొత్తం ఔషద ఉత్పత్తుల తయారీలో తెలంగాణ 40 శాతం వాటా కలిగి ఉందన్నారు. వ్యాక్సిన్ల తయారీలో ప్రపంచంలోనే మూడింట ఒక్క వంతు ఇక్కడే తయారు అవుతున్నాయని… రాబోయే ఏడాదిలో ప్రపంచానికి అవసరమయ్యే సగం వ్యాక్సిన్లను ఇక్కడి నుంచే అందించే అవకాశం ఉందన్నారు. ఇక్కడి 214 యూనిట్లకు యుఎస్‌ఎఫ్‌డిఎ అనుమతులు ఉన్నాయన్నారు. సుల్తాన్‌పూరలో అతిపెద్ద మెడికల్‌ డివైస్‌ పార్క్‌ను ఏర్పాటు చేశామని.. ఇక్కడ ప్రస్తుతం 60 పైగా యూనిట్లు ఉన్నాయన్నారు. దిగుమతులపై భారత్‌ పెద్ద మొత్తంలో ఆధారపడుతుందన్నారు. 75 ఏళ్ల స్వాతంత్రానంతరం కూడా మనం ఇప్పటికీ 75 శాతం ఔషద ముడి సరుకులను, 80 శాతం వంట నూనెలను దిగుమతి చేసుకోవడం బాధకరమన్నారు. తెలంగాణ రాష్ట్రం మిగితా భారతదేశానికి కూడా మార్గం చూపించాలని కోరుకుంటుందన్నారు. హైదరాబాద్‌ నుంచి అజాద్‌ ఇంజనీరింగ్‌, స్కైరూట్‌ లాంటి సంస్థలు గ్లోబల్‌ కంపెనీలుగా ఎదుగడం ప్రశంసనీయమన్నారు. విద్యుత్‌ బిల్లుల వన్‌టైం సెటిల్‌మెంట్‌ గురించి ఎఫ్‌టిసిసిఐ ప్రెసిడెంట్‌ అనిల్‌ అగర్వాల్‌ చేసిన అభ్యర్థనపై మంత్రి స్పందించి.. అవసరమైన వాటిని చేస్తానని చెప్పారు. ఎఫ్‌టిసిసిఐ భూమి, ఇతర అభ్యర్థనల గురించి ముఖ్యమంత్రితో సంప్రదించిన తర్వాత సమావేశాన్ని ఏర్పాటు చేస్తానని తెలిపారు. ఈ అవార్డుల ప్రదానంలో ఇండిస్టీస్‌ అండ్‌ కామర్స్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేష్‌ రంజన్‌, ఎఫ్‌టిసిసిఐ ప్రెసిడెంట్‌ అనిల్‌ అగర్వాల్‌, ఎక్స్‌లెన్స్‌ అవార్డ్స్‌ కమిటీ ఛైర్మన్‌ అరుణ్‌ లుహరుక, ఎఫ్‌టిసిసిఐ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మీలా జయదేవ్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ సురేష్‌ కుమార్‌ సింఘాల్‌ పాల్గొన్నారు.

Spread the love