Sunday, May 3, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్రోజుకు పది నిమిషాలు

రోజుకు పది నిమిషాలు

- Advertisement -

సంపూర్ణ ఆరోగ్యం సొంతమవ్వాలంటే ఆహారంతోపాటు వ్యాయామం చాలా ముఖ్యం. అయితే దీని కోసం గంటల కొద్ది శ్రమించాల్సిన అవసరం కూడా లేదు. రోజుకు కనీసం పది నిమిషాలు పరుగెత్తినా శారీరక, మానసిక ఆరోగ్యం పుంజుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. దీన్ని ఎప్పుడైనా, ఎక్కడైనా చేయొచ్చని అంటున్నారు. వేగంగా పరుగెత్తినా, నెమ్మదిగా పరుగెత్తినా బోలెడన్ని లాభాలు ఉంటాయి. మరి ఆ ప్రయోజనాలు ఏంటో ఈరోజు తెలుసుకుందాం…

ఎలాంటి ఎక్సర్‌సైజ్‌ చేసినా ముందుగా కోరుకునేది బలంగా తయారవటం. ఇందుకు పరుగు ఎంతగానో ఉపయోగపడుతుంది. పరుగెత్తటం వల్ల గుండె, ఊపిరితిత్తులు వేగంగా పనిచేస్తాయట. రక్త ప్రసరణ, రక్తనాళాల పనితీరు పుంజుకుంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీంతో శరీర సామర్థ్యం, బలం పెరుగుతుంది. పరుగెత్తినప్పుడు శరీరంలో మొండెం, తుంటి, కాళ్ల వంటి భాగాల్లోని పెద్ద కండరాల్నీ కదలికలకు గురవుతాయి. అందువల్ల అవి బలంగా, దృఢంగా తయారువుతాయి. తద్వారా వయసు మీద పడుతున్న కొద్దీ కండరాలు క్షీణించటమనే సమస్య తగ్గుతుందని నిపుణులు వివరిస్తున్నారు. పరుగు వల్ల మానసిక ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం, ఆరోగ్యకరమైన వృద్ధాప్యం, జీవన నాణ్యతను గణనీయంగా మెరుగుపరుస్తాయని కొన్ని అధ్యయనాలు రుజువు చేయాలి.

జబ్బుల ముప్పు తక్కువ
పరుగెత్తటం వల్ల రక్తంలో గ్లూకోజ్‌, కొలెస్ట్రాల్‌ మోతాదులు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే బరువు కూడా నియంత్రణలో వుంటుంది. ఫలితంగా గుండె, లివర్‌, డయాబెటిస్‌ ముప్పులు తగ్గుముఖం పడతాయి. పరుగెత్తని వారితో పోలిస్తే పరుగెత్తే వారిలో గుండెజబ్బుతో మరణించటం సగానికి సగం తక్కువని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. రోజుకు 5-10 నిమిషాలు, గంటకు 6 మైళ్ల కంటే తక్కువ నెమ్మదైన వేగంతో పరుగెత్తడం కూడా, అన్ని కారణాల వల్ల సంభవించే మరణాలు, హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రతిరోజూ పరుగెత్తటం వల్ల విశ్రాంతి తీసుకునే సమయంలో గుండె కొట్టుకునే వేగమూ తక్కువగా ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇది మొత్తంగా ఆరోగ్యానికి, శరీర సామర్థ్యానికి ముఖ్యమైన సూచిక అంటున్నారు.

కంటి నిండా నిద్ర
సంపూర్ణ ఆరోగ్యానికి ప్రశాంతమైన నిద్ర చాలా ముఖ్యం. రోజంతా అలసిపోయిన శరీరానికి రాత్రి నిద్ర కొత్త శక్తి అందేలా చేస్తుంది. అందుకే ఉదయం నిద్ర లేచాక హుషారుగా ఉంటాం. ఈ క్రమంలో వ్యాయామంతో త్వరగానే కాదు, గాఢంగానూ నిద్ర పడుతుంది. అయితే, మరీ పొద్దుపోయాక పరుగెత్త వద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే, పరుగు వంటి ఏరోబిక్‌ వ్యాయామాలతో ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. ఇవి శక్తిని, అప్రమత్తతను పెంచుతాయని తెలియజేస్తున్నారు. అందుకే రాత్రిపూట త్వరగా నిద్ర పట్టకుండా చేయొచ్చు. కనుక రాత్రి పూట పరుగెత్తకపోవడమే మంచిది.

మోకాళ్లు, వెన్ను బలోపేతం
పరుగెత్తితే మోకాళ్లు దెబ్బతింటాయని చాలామంది భావిస్తుంటారు. వాస్తవానికి, తరచూ పరిగెత్తే వారికి మోకాళ్లు, వెన్ను సమస్యలు తక్కువ వస్తాయంటున్నారు నిపుణులు. సాధారణంగా పరుగెత్తే వారితో పోలిస్తే మారథన్‌ క్రీడాకారులకు కీళ్లు అరిగే ముప్పు సుమారు 50 శాతం తక్కువగా ఉంటుందని ఒక అధ్యయనంలో వెల్లడైంది. ఆటల్లో భాగంగా పరుగెత్తే వారిలోనూ మోకాళ్లు, తుంటి సమస్యలు తక్కువని తేలింది.

జ్ఞాపకశక్తి మెరుగు
మనలో కొంతమంది చిన్న చిన్న విషయాలను తరచూ మరిచిపోతుంటారు. అయితే పరుగెత్తటం వల్ల మెదడులో జ్ఞాపకశక్తి, నేర్చుకోవటంతో ముడిపడిన హిప్పోక్యాంపస్‌ పరిమాణం పెరిగేలా చేస్తుందని అధ్యయనాల్లో రుజువయింది. ఎక్సర్‌సైజ్‌ చేసేవారిలో ఈ భాగం పెద్దగా ఉంటున్నట్టు తెలిపింది.

ఉత్సాహం ఉరకలు
పరుగెత్తటం వంటి వ్యాయామాలతో ఆనందం, సంతోషం కలిగించే ఎండార్ఫిన్లు విడుదలవుతాయంటున్నారు నిపుణులు. ఇవి మానసిక ధోరణిని, ఏకాగ్రతను, ఆరోగ్యంగా ఉన్నామనే భావనను పెంపొందిస్తాయి. రోజుకు కేవలం 15 నిమిషాలు పరుగెత్తినా డిప్రెషన్‌ ముప్పు సుమారు 26 శాతం తగ్గుతున్నట్లు పలు అధ్యాయనాల్లో వెల్లడైంది. ఒకవేళ ఇప్పటికే ఉన్న డిప్రెషన్‌, ఆందోళన లక్షణాలూ తగ్గుముఖం పడతాయని తేలింది. ఆరు బయట పరుగెత్తితే ఇంకా మంచిదట. ప్రకృతిలో పచ్చని చెట్ల మధ్య పరుగు మన మానసిక స్థితి మెరుగుపడుతుందని వెల్లడైంది.

ఒత్తిడి తగ్గుముఖం
పరుగెత్తటం వల్ల మానసిక ఒత్తిడికి దారితీసే అడ్రినలిన్‌, కార్టిసాల్‌ వంటి హార్మోన్ల మోతాదులు అదుపులో ఉంటాయంటున్నారు నిపుణులు. దీంతో బాధ, విచారం తగ్గుతాయని చెబుతున్నారు.

వాస్తవిక లక్ష్యాలు
రోజుకు ఎంతసేపు, ఏ టైంలో పరుగెత్తాలో ముందే నిర్ణయించుకుంటే పాటించటానికి వీలుంటుంది. శరీర సామర్థ్యాన్ని పెంచుకోవటం, బరువు తగ్గటం, పందెంలో పాల్గొనటం వంటి అవసరాలను బట్టి ఎంత వేగంతో, ఎంత సమయం పరుగెత్తాలనేది ఆధారపడి ఉంటుందంటున్నారు నిపుణులు. లక్ష్యం ఏదైనా సరే, దాన్ని ఆచరించటానికి వీలుండేలా చూసుకోవాలట. అంటే జీవనశైలి, సామర్థ్యాలు వంటి వాటిని పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. పరుగెత్తటం ప్రారంభించే వారు ముందు నెమ్మదిగా మొదలు పెట్టాలని సలహా ఇస్తున్నారు. దూరం, వేగం కన్నా ఆనందిస్తూ పరుగెత్తటం ముఖ్యమట. పురోగతి సాధిస్తున్న కొద్దీ సమయం పెంచుకోవాలని అంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -