మూడు ఆయిల్ ట్యాంకర్లపై క్షిపణి దాడి
మంటల్లో చిక్కుకున్న చమురు ట్యాంకర్ : బ్రిటన్ సైన్యం
టెహ్రాన్ : ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ము జ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒమన్ తీరానికి సమీపంలో ప్రయాణిస్తున్న మూడు చమురు ట్యాంకర్లపై మంగళవారం తెల్లవారుజామున క్షిపణి దాడి జరగడంతో ఓ నౌకలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ విషయాన్ని యునైటెడ్ కింగ్‌డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ (యూకేఎంటీఓ) ధ్రువీకరించింది. ఈ దాడిపై ఇరాన్ ప్రభుత్వ మీడియా స్పందించింది. హెచ్చరికలను పట్టించుకోకపోవడంతో నౌకను లక్ష్యంగా చేసుకున్నట్టు తెలిపింది. యూకేఎంటీఓ వెల్లడించిన వివరాల ప్రకారం, హార్ము జ్ నుంచి ఒమన్ గల్ఫ్ వైపు దక్షిణ దిశగా ప్రయాణిస్తున్న ట్యాంక్పై లిమా ప్రాంతంలో సమీపంలో క్షిపణి తాకింది. నౌక ఎడమ వైపున క్షిపణి పడటంతో మంటలు చెలరేగాయి. అయితే ఈ ఘటన వల్ల పర్యావరణంపై ఎలాంటి ప్రభావం లేదని పేర్కొంది. దీనిపై సంబంధిత అధికారులు దర్యాప్తు ప్రారంభించారని తెలిపింది.
స్పందించిన ఇరాన్ ప్రభుత్వ మీడియా
చమురు ట్యాంకర్‌పై దాడి జరిగినట్టు ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ తెలిపింది. ఖతార్ నుంచి సహజవాయువును తరలిస్తున్న ఎల్‌ఎన్‌జీ ట్యాంకర్‌కు ముందుగానే హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, వాటిని నౌక పట్టించుకోలేదని పేర్కొంది. అనంతరం ట్యాంకర్‌పై దాడి జరిగిందని తెలిపింది. ఇరాన్ ప్రభుత్వ మీడియా ఈ ఘటనపై స్పందించినప్పటీ, దాడికి తామే బాధ్యులమంటూ ఇరాన్ ప్రభుత్వం లేదా సైన్యం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా స్పష్టతకు రావాల్సి ఉంది. ఇటీవల ఇరాన్ తాము ఆమోదించిన మార్గాల్లోనే చమురు ట్యాంకర్లు ప్రయాణించాలని హెచ్చరించింది. నిర్దేశించిన మార్గాలను ఉల్లంఘించిన నౌకలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకుంటామని ఇరాన్ సంయుక్త సైనిక కమాండ్ గత వారం స్పష్టం చేసింది. అమెరికా దళాలు ఈ జలసంధిలో జోక్యం చేసుకుంటే వేగంగా, నిర్ణయాత్మకంగా స్పందిస్తామని కూడా ఇరాన్ హెచ్చరించింది.
ట్రంప్ వార్నింగ్ ఇచ్చిన కొద్ది గంటల్లోనే
అయితే ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరికలు చేసిన కొద్ది గంటల్లోనే హార్ము జ్‌లో ఈ దాడులు జరిగాయి. సోమవారం మీడియాతో మాట్లాడిన ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒప్పందానికి రావాలని లేకపోతే అమెరికా పని పూర్తి చేస్తుందని అన్నారు. ఆ పని చేయడం పెద్ద కష్టం కాదని గంటల వ్యవధిలోనే వారి వంతెలను కూల్చివేయగలమని, అలాగే విద్యుత్తు సరఫరాను నిలిపివేయగలమని పేర్కొన్నారు. ట్రంప్ హెచ్చరికలు, ఖమేనీ అంత్యక్రియలు కొనసాగుతున్న వేళ హార్ము జ్‌లో ఈ దాడి జరగడం అంతర్జాతీయంగా ఆందోళనకు గురిచేస్తోంది. ప్రపంచ చమురు, సహజవాయువు రవాణాలో కీలకమైన ఈ సముద్ర మార్గంలో భద్రతా పరిస్థితులపై మళ్లీ సందేహాలు వ్యక్తమవుతున్నాయి.



