Wednesday, July 8, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంధిక్కార స్వరానికి సంకేతం

ధిక్కార స్వరానికి సంకేతం

- Advertisement -

ఖమేనీ అంత్యక్రియల్లో కన్పించిన ఐక్యత
టెహ్రాన్‌ : దివంగత ఇరాన్‌ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు జాతీయ వీడ్కోలుకు అతీతమైనవి. అంత్యక్రియల కోసం వెల్లువలా తరలివచ్చిన లక్షలాది ప్రజలు అమెరికా, ఇజ్రాయిల్‌ కుతంత్రాలను ఎండగట్టారు. ఆ దేశాల కుట్రలు, కుయుక్తులు సాగబోవని సందేశం ఇచ్చారు. అమెరికా-ఇజ్రాయిల్‌ సేనలు ఫిబ్రవరి 28న ప్రారంభించిన దాడులలో ఇరాన్‌ బలహీనపడిన దాఖలాలు కన్పించలేదు సరికదా ధిక్కార స్వరాన్ని మరింత గట్టిగా వినిపించింది. జాతి యావత్తూ ఐక్యంగా నిలిచింది. తన భవిష్యత్తును తానే నిర్ణయించుకోగలనన్న దృఢ సంకల్పాన్ని ప్రదర్శించింది. ఈ ధిక్కార స్వరమే, ప్రత్యర్థులను ఎదుర్కోగల సామర్ధ్యమే ఇరాన్‌ సంప్రదింపుల వ్యూహానికి ఆధారమయ్యాయని ప్రాంతీయ అధికారులు, దౌత్యవేత్తలు, విశ్లేషకులు తెలిపారు. ఖమేనీ అంత్యక్రియల ద్వారా ఇరాన్‌ తన సహనాన్ని, ఓర్పును బలంగా మార్చుకోవడానికి ప్రయత్నించిందని చెప్పారు.

జలసంధిపై పెరిగిన పట్టు
మధ్యప్రాచ్యంలో జరిగిన పోరు హార్ముజ్‌ జలసంధిపై ఇరాన్‌కు ఉన్న పట్టును చాటిచెప్పింది. హార్ముజ్‌పై తన నియంత్రణను గుర్తిస్తేనే అణు కార్యక్రమంపై ఏ ఒప్పందమైనా జరుగుతుందన్న వాస్తవాన్ని అంతర్జాతీయ సమాజానికి తెలియజేసింది. అణ్వాయుధాలను ఇరాన్‌ అభివృద్ధి చేయకుండా చూసేందుకు అమెరికా 60 రోజుల కాల్పుల విరమణను ప్రతిపాదించింది. కానీ ఆ పని జరగలేదు సరికదా ఓ విభిన్నమైన పోటీకి తెర లేచింది. ఈ పోటీలో ఇరాన్‌ యురేనియం కంటే దాని భౌగోళిక స్థానమే అత్యంత శక్తివంతమైనదిగా ఆవిర్భవించింది. జలసంధి పరిసరాలలో తన ఆధిపత్యాన్ని అంతర్జాతీయ సమాజం అంగీకరించేలా చేయడం ద్వారా యుద్ధ కాలంలో సాధించిన విజయాలను శాశ్వతమైనవిగా మార్చుకునేందుకు ఇరాన్‌ ప్రయత్నిస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందం, దానితో పాటు కుదిరిన ఎంఓయూ తర్వాత తుది ఒప్పందం కోసం నిర్దేశించుకున్న 60 రోజుల గడువు ఇంకా ప్రారంభం కాలేదు. ఈ శూన్యంలోనే ఇరాన్‌ క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వేగంగా కదులుతోంది.

చర్చల ప్రక్రియను జాప్యం చేస్తూ…
జలసంధిలో ప్రయాణించే నౌకల నుంచి రుసుము వసూలు చేయడం ద్వారా ఇరాన్‌ పెద్ద ఎత్తున ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు. అయినప్పటికీ హార్ముజ్‌ను ఇరాన్‌ ఆర్థిక ఆస్తిగా కాకుండా రాజకీయ చట్టబద్ధతకు మూలంగానే చూస్తోంది. జలసంధిపై ఎట్టి పరిస్థితుల లోనూ హక్కులను వదులుకోబోమని ఇరాన్‌ నేతలు ఇప్పటికే స్పష్టం చేశారు. అణు కార్యక్రమంపై చర్చలు ప్రారంభం కావడానికి ముందు యుద్ధం వల్ల ఇప్పటికే కలిగిన ప్రయోజనాలను పరిరక్షించుకోవాలని ఇరాన్‌ అనుకుంటోంది. అందుకే ఉద్దేశపూర్వకంగానే చర్చల ప్రక్రియను ఆలస్యం చేస్తోంది. అమెరికా సైనిక చర్య ఇరాన్‌ బలాన్ని విచ్ఛిన్నం చేయడంలో విఫలమైంది. యుద్ధానంతర పరిస్థితులలోని కీలక వాస్తవాలను ఇరాన్‌ తనకు అనుకూలంగా మలచుకుంటోంది. అమెరికా సైనిక బలగం కానీ, ఓడరేవుల దిగ్బంధనం కానీ హార్ముజ్‌ జలసంధిపై ఇరాన్‌ వైఖరిని మార్చలేకపోయాయి. ఇరాన్‌కు ఇప్పుడు హార్ముజ్‌ అనే నిధి దొరికిందని, దానిని అది వదులుకోబోదని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. ఇరాన్‌ నిర్దేశించే షరతుల ప్రకారమే హార్ముజ్‌ జలసంధిని తెరవడానికి అమెరికా అంగీకరించాల్సి వస్తుందని వారు అభిప్రాయపడ్డారు. యుద్ధంలో ఎవరూ గెలవబోరని, అయితే అమెరికా కంటే ఇరానే తక్కువగా నష్టపోతుందని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -