డాలర్లు కురిపించేలా ట్రంప్ ఎత్తుగడ
అంకారాలో ప్రారంభమైన 36వ నాటో సదస్సు
టర్కీ అధ్యక్షునితో అమెరికా అధ్యక్షుడి భేటీ
అంకారా : రక్షణ వ్యయం, ఉక్రెయిన్ మిలటరీ అవసరాలకు మద్దతునివ్వడం ప్రధాన ఎజెండాగా 36వ నాటో సదస్సు టర్కీ రాజధాని అంకారాలో మంగళవారం ప్రారంభమైంది. నాటోమిత్రదేశాలన్నీ రక్షణ వ్యయాన్ని పెంచాలంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన పిలుపునకు స్పందిస్తూ పలు దేశాల నేతలు పలు రక్షణ కంపెనీలతో కోట్లాది డాలర్ల విలువ చేసే ఆయుధ ఒప్పందాలను ప్రకటిస్తారని భావిస్తున్నారు. నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రూటె తొలి పలుకులతో సదస్సు ప్రారంభమైంది. ‘శత్రువులను నిలువరించి, మనల్ని మనం రక్షించుకునేందుకు కీలకమైన ఆయుధాలను అందించగలిగేలా కోట్లాది డాలర్ల విలువ చేసే కొత్త కాంట్రాక్టులు’ ఈ సమావేశంలో ప్రకటించబడతాయని రూటె సదస్సుకు ముందు విలేకర్లతో మాట్లాడుతూ తెలిపారు. అనంతరం మిత్రదేశాల ప్రతినిధులను వేదికపైకి రూటె ఆహ్వానించారు. తదనంతరం నేతలందరూ కలిసి ఒక ఫోటో దిగారు. మంగళవారం అంకారా చేరుకున్న ట్రంప్ అధికారిక నేతల విందు సమావేశంలో పాల్గొనడానికి ముందుగానే ట్రంప్ అధ్యక్షుడు ఎర్డోగన్‌తో చర్చలు జరపనున్నారు.
కతార్ బహుమతిగా అందచేసిన ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో ట్రంప్ తొలి విదేశీ పర్యటనగా అంకారా చేరుకున్నారు. టర్కీ అధ్యక్ష భవనం వద్ద ట్రంప్‌కు ఘన స్వాగతం లభించింది. ఈ సమావేశంలో రష్యా-ఉక్రెయిన్ పరిణామాలను ట్రంప్‌తో చర్చించనున్నట్లు టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ తెలిపారు. అలాగే తమకు ఎఫ్-35 జెట్‌లను విక్రయించేందుకు కూడా అమెరికా అంగీకరిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. తాము కూడా ఆ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ట్రంప్ చెప్పారు. అయితే ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎర్డోగన్‌తో జరిగే సమావేశంలో టర్కీపై సిఎఎటిఎస్‌ఎ (ఆంక్షల ద్వారా అమెరికా శత్రు దేశాలను ఎదుర్కొనడం) ఆంక్షలను తొలగించే విషయమై చర్యలు తీసుకుంటామని ట్రంప్ చెప్పారు. 2020లో రష్యా నుండి ఎస్-400 వైమానిక రక్షణ వ్యవస్థలను సమకూర్చుకున్నందుకు అమెరికా ఈ ఆంక్షలను విధించింది. ఎఫ్-35 జెట్ కార్యక్రమం నుండి కూడా టర్కీని బహిష్కరించింది.



