సిరిసిల్లలో ‘టెట్‌’ గందరగోళం

 'Tet' chaos in Sirisilla– మారిన పరీక్ష బుక్‌లెట్‌
– ఆందోళనకు దిగిన అభ్యర్థులు
నవతెలంగాణ – సిరిసిల్ల క్రైం
సిరిసిల్లలో శుక్రవారం టెట్‌ పరీక్ష నిర్వహణ గందరగోళంగా మారింది. ఉదయం పేపర్‌-1 పరీక్షను సజావుగా నిర్వహించిన అధికారులు మధ్యాహ్నం పేపర్‌-2 పరీక్ష నిర్వహణలో నిర్లక్ష్యం వహించారు. అభ్యర్థులకు ఒక బుక్‌లెట్‌ బదులు మరో బుక్‌లెట్‌ అందింది. అభ్యర్థులంతా కేంద్రంలో ఓఎమ్మార్‌ షీట్స్‌ తీసుకుని అందులో హాల్‌ టికెట్‌, పేపర్‌ బుక్‌లెట్‌లోని దాదాపు 40 ప్రశ్నలకు జవాబులను బబ్లింగ్‌ చేశారు. ఇంతలోనే జిల్లా కేంద్రంలోని 14 పరీక్ష కేంద్రాల పర్యవేక్షణ అధికారులకు ఓ సమాచారం అందింది. అధికారికంగా అందాల్సిన ప్రశ్నపత్రం బుక్‌లెట్‌-2 కాగా.. దానికి బదులుగా బుక్లెట్‌-1 ఇచ్చారని తెలుసుకున్నారు. వెంటనే వాటిని మార్చుతామని, సంబంధిత ప్రశ్నపత్రాలు సరఫరా చేస్తున్నట్టు జిల్లా అధికారులు ప్రకటించారు. అప్పటికే కొన్ని పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థులు ఓఎమ్మార్‌ షీట్స్‌లో హాల్‌ టికెట్‌ నంబర్‌, క్వశ్చన్‌ పేపర్‌ బుక్‌లెట్‌ నంబర్‌, కొన్ని ప్రశ్నలకు సమాధానాలను బబ్లింగ్‌ చేశారు. వీటన్నింటినీ సరిచేయడానికి ఉన్నతాధికారుల నుంచి అనుమతి తీసుకుంటామని చెప్పి పరీక్ష కేంద్రాల్లోని అభ్యర్థులను ఇన్విజిలేటర్‌ సముదాయించారు. ప్రశ్నపత్రం మార్పు చేయడానికి, నిర్ణీత సమయానికి జరిగిన ఆలస్యానికి సమానంగా అభ్యర్థులకు సమయం ఎక్కువ ఇస్తామని తెలపడంతో సమస్య తాత్కాలికంగా సర్దుమణిగింది. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5 గంటల వరకు నిర్వహించాల్సిన పరీక్షను సిరిసిల్లలో ఒక్కో కేంద్రానికి ఒక్కో విధంగా ముగించారు.
సిరిసిల్ల పత్తిపాక వీధిలోని సిద్ధార్థ పాఠశాల పరీక్ష కేంద్రంలో అభ్యర్థుల ఓఎమ్మార్‌ షీట్‌ను వైట్‌నర్‌ వేసి సర్దుబాటు చేయడంతో వాటిని పరిగణలోకి తీసుకోరన్న వాదనతో అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులకు, వివిధ పార్టీల నాయకులకు వాగ్వావాదం జరిగింది. సిరిసిల్ల పట్టణ మధ్యలో మంత్రి కేటీఆర్‌ మెడికల్‌ కాలేజీ ప్రారంభ సభ వేదిక పెట్టడం వల్ల.. తారుమారైన ప్రశ్నపత్రాలను కేంద్రాలకు సకాలంలో చేరవేయడానికి అధికారులకు కుదరలేదని పొంతనలేని సమాధానాలు చెప్పారు. ట్రాఫిక్‌ జామ్‌, అధికారుల నిర్లక్ష్యం కారణంగా తమ భవిష్యత్‌ అగమ్యగోచరంగా మారిందని పలువురు అభ్యర్థులు నిరసనకు దిగారు. భేషరతుగా టెట్‌ పరీక్షను రద్దు చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు, అభ్యర్థులు డిమాండ్‌ చేశారు. నిరసనకు దిగిన ప్రతిపక్ష పార్టీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Spread the love