ఆగస్టు మొదటివారంలో టెట్‌ నోటిఫికేషన్‌!

– సెప్టెంబర్‌ మూడో వారంలో రాతపరీక్ష
– విద్యాశాఖ అధికారుల కసరత్తు వేగవంతం
– ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై మంత్రివర్గంలో చర్చ
– పూర్తి వివరాలు ప్రకటించే అవకాశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) నోటిఫికేషన్‌ వచ్చేనెల మొదటి వారంలో విడుదలయ్యే అవకాశమున్నది. ఇందుకు సంబంధించి విద్యాశాఖ అధికారులు కసరత్తును వేగవంతం చేశారు. సెప్టెంబర్‌ మూడో వారంలో రాతపరీక్షను నిర్వహించే అవకాశమున్నది. విశ్వసనీయ సమాచారం ప్రకారం సెప్టెంబర్‌ 17 లేదా 24వ తేదీన టెట్‌ రాతపరీక్షను దస్త్రాన్ని తయారు చేసి విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి ఆమోదానికి పంపించినట్టు తెలిసింది. ఈనెల 31న మంత్రివర్గ సమావేశం జరుగుతున్నది. అందులో టెట్‌తోపాటు ఉపాధ్యాయ ఖాళీల భర్తీపైనా చర్చించి ఆమోదం తీసుకునే అవకాశమున్నది. ఆ తర్వాత టెట్‌, ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి సంబంధించి పూర్తి వివరాలను మంత్రి ప్రకటిస్తారని తెలుస్తున్నది. రాష్ట్రంలో మరోసారి టెట్‌ను నిర్వహించాలని విద్యాశాఖ మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే టెట్‌తోపాటు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం లక్షలాది మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో మూడుసార్లు టెట్‌ రాతపరీక్షలను విద్యాశాఖ నిర్వహించింది. చివరిసారిగా గతేడాది జూన్‌ 12న టెట్‌ను నిర్వహించారు. టెట్‌ పేపర్‌-1కు 3,51,476 మంది దరఖాస్తు చేయగా 3,18,444 మంది పరీక్ష రాశారు. వారిలో 1,04,078 (32.68 శాతం) మంది అభ్యర్థులు అర్హత సాధించారు. పేపర్‌-2కు 2,77,893 మంది దరఖాస్తు చేస్తే, 2,50,897 మంది పరీక్షకు హాజరయ్యారు. వారిలో 1,24,535 (49.64 శాతం) మంది అభ్యర్థులు ఉత్తీర్ణత పొందారు. 2017, జులై 23న టెట్‌ పేపర్‌-1కు 98,848 మంది హాజరుకాగా, 56,708 (57.37 శాతం) మంది అర్హత సాధించారు. పేపర్‌-2కు 2,30,932 మంది పరీక్ష రాస్తే 45,045 (19.51 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే బీఎడ్‌, డీఎడ్‌ ఉత్తీర్ణతతోపాటు తప్పనిసరిగా టెట్‌ పాస్‌ కావాలన్న నిబంధన ఉన్నది. ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ)లో టెట్‌ మార్కులకు 20 శాతం వెయిటేజీని కల్పిస్తున్నారు. అంటే టీఆర్టీ రాతపరీక్షకు 80 శాతం మార్కులు, టెట్‌లో సాధించిన మార్కులకు 20 శాతం వెయిటేజీ ఇచ్చి రెండింటిలో మెరిట్‌ ఆధారంగా ఉపాధ్యాయ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అందుకే టెట్‌కు ప్రాధాన్యత నెలకొంది. 2011 నుంచి టెట్‌ అర్హత సంపాదిస్తే జీవితకాలం ఉంటుందని జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి (ఎన్‌సీటీఈ) నిర్ణయించింది. అందుకనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను గతంలోనే విడుదల చేసింది. ఇంకోవైపు ఎస్జీటీ పోస్టులకు బీఎడ్‌ అభ్యర్థులూ అర్హులేనని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Spread the love