వస్త్ర ఎగుమతులు తిరోగమనం

వస్త్ర ఎగుమతులు తిరోగమనం– భారత్‌లో రెండో ఏడాదిలోనూ పతనం
– కోవిడ్‌ నాటి కంటే అధ్వాన్నం
– ఎక్స్‌పోర్టర్స్‌ ఆందోళన
న్యూఢిల్లీ : ప్రపంచ మార్కెట్‌లో భారత వస్త్ర ఉత్పత్తులు వెలవెల పోతున్నాయి. వరుసగా రెండో ఏడాదిలోనూ టెక్స్‌టైల్‌ ఎగుమతులకు డిమాండ్‌ తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం (2023-24)లోనూ వస్త్ర ఎగుమతులు తిరోగమనాన్ని చవి చూశాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో నెలకొన్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తలు వస్త్ర రంగాన్ని దెబ్బతీస్తున్నాయి. మరోవైపు ప్రపంచ దేశాల ఉత్పత్తులతో పోటీ పడేలా భారత్‌ ఈ రంగానికి మద్దతును ఇవ్వడం లేదనేది ఆ రంగం పారిశ్రామిక వర్గాల ప్రధాన విమర్శ. గడిచిన 2023-24లో టెక్స్‌టైల్‌ ఎగుమతులు 34.4 బిలియన్‌ డాలర్ల (రూ.2.86 లక్షల కోట్లు)కు పరిమితమయ్యాయి. ఇంతక్రితం ఏడాదితో పోల్చితే ఒక్క బిలియన్‌ డాలర్లు (రూ.83వేల కోట్లు)లేదా 3 శాతం పతనాన్ని చవి చూశాయి. ముఖ్యంగా 2021-22లోని 41 బిలియన్‌ డాలర్ల (రూ.3.41 లక్షల కోట్లు)ఎగుమతులతో పోల్చితే గతేడాది 16.3 శాతం క్షీణత చోటు చేసుకుందని టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ఓ కథనంలో వెల్లడించింది.
టెక్స్‌టైల్‌ రంగంలోకి పత్తినూలు, బట్టలు, తయారు చేసిన వస్తువులు, చేనేత ఉత్పత్తులు వస్తాయి. 2023-24లో పత్తి నూలు ఎగుమతులు మాత్రం 740 మిలియన్‌ డాలర్లకు పెరిగాయని వాణిజ్య మంత్రిత్వ శాఖకు చెందిన నిర్యట్‌ పోర్టల్‌ డేటా వెల్లడించింది. మొత్తం వస్త్ర ఎగుమతుల్లో ఉత్తర అమెరికాకు 11 బిలియన్‌ డాలర్లు, ఆ తర్వాత యూరప్‌కు 10 బిలియన్ల, పశ్చిమాసియా, నార్త్‌ ఆఫ్రికాకుకు కలిపి 4 బిలియన్ల ఎగుమతులు నమోదయ్యాయి.
”మొత్తం పాశ్చాత్య ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. ముఖ్యంగా ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో నెలకొన్న మాంద్యంతో వినియోగదారుల విశ్వాసం తగ్గింది. ఎర్ర సముద్ర సంక్షోభం కారణంగా సముద్ర సరుకు రవాణా దాదాపు 100 శాతం పెరిగింది. ఎయిర్‌ కార్గో ద్వారా సరుకులను రవాణా చేయాలనే డిమాండ్‌ కారణంగా విమాన సరుకులు 200 శాతం వరకు పెరిగాయి. కాగా.. గడిచిన రెండు ఆర్థిక సంవత్సరాల్లోనూ ఎగుమతుల తగ్గుదల చోటు చేసుకోవడాన్ని సరిదిద్దుకోవాల్సి ఉంది.” అని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఎక్స్‌పోర్ట్‌ ఆర్గనైజేషన్స్‌ (ఎఫ్‌ఐఈఓ) వైస్‌ ప్రెసిడెంట్‌ ఇస్రార్‌ అహ్మాద్‌ అన్నారు.
మొత్తం వస్త్ర ఎగుమతుల్లో 42 శాతం వాటా కలిగిన రెడీమేడ్‌ వస్త్రాల విభాగంలో 10 శాతం పతనం చోటు చేసుకుంది. వస్త్ర ఎగుమతుల్లో కీలక వాటా కలిగిన తిరుపూర్‌ పరిశ్రమలు కరోనా నాటి కంటే గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని తిరుపూర్‌ ఎక్స్‌పోర్టర్స్‌ అసోసియేషన్‌ మాజీ ప్రెసిడెంట్‌ రాజా ఎం షణ్ముగం అన్నారు. యూరప్‌లో విలువ ఆధారిత వస్త్రాలకు డిమాండ్‌ తగ్గడం ఈ క్షీణతకు కారణమన్నారు. ఉత్పత్తి, ఎగుమతి సామర్థ్యాలను పెంచడానికి ప్రభుత్వ మద్దతు అవసరమన్నారు. టెక్స్‌టైల్‌ రంగానికి కేంద్ర ప్రభుత్వం ఎమర్జెన్సీ క్రెడిట్‌ లైన్‌ గ్యారెంటీ పథకాన్ని ప్రకటించాలని ఆయన డిమాండ్‌ చేశారు. తమ బకాయిల చెల్లింపుల కోసం ఆరు నెలల పాటు మారటోరియం విధించాలని కోరారు.

Spread the love