మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రాజీనామా చేయాలి
పనిచేయని టోల్ ఫ్రీ నెంబర్ : ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు
నవతెలంగాణ– ఉప్పల్
భూములు, ఆస్తులను 22ఏ నిషేధిత జాబితా నుంచి వెంటనే తొలగించాలని బీఆర్‌ఎస్ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ప్రజలను ఇబ్బం దులకు గురిచేస్తున్న రెవెన్యూ
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరి వాజపేయినగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ ఆవరణలో మంగళవారం స్థానిక ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో హరీశ్‌రావు మాట్లాడారు. మల్కాజిగిరిలో 60 ఏండ్ల నివాసిత ఇండ్లను కూడా 22ఏ నిషేధిత జాబితాలో చేర్చి ప్రజలను ఆందోళనకు గురిచేయడం సమంజసం కాదన్నారు. న్యాయబద్ధంగా, కష్టార్జితంతో సంపాదించిన భూములు నిషేధిత జాబితాలో ఉంటే ఫోన్ చేయాలంటూ ప్రభుత్వం టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చిందని, అయితే ఆ టోల్ ఫ్రీ నెంబర్ పనిచేయడం లేదని చెప్పారు. నిషేధిత జాబితాను వెంటనే తొలగించకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని స్తంభింపజేసేలా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లాలో 7,500 జీవోల ద్వారా మినహాయింపు పొందిన భూములు, మేడ్చల్‌లో 6 వేలకుపైగా భూములతో పాటు హెచ్‌ఎండీఏ, హుడా భూములను కూడా నిషేధిత జాబితాలో చేర్చారని ఆరోపించారు.
ఎలాంటి దరఖాస్తులూ తీసుకోకుండా, ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పకుండా నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంబంధిత మంత్రిని వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. మంత్రి చేసిన తప్పులపై ముఖ్యమంత్రి చర్యలు తీసుకోకపోతే ఇద్దరూ కలిసి కుట్రపూరితంగా భూదందాకు పాల్పడ్డారనే అనుమానాలు ప్రజల్లో మరింత బలపడతాయన్నారు. ఈ అంశంపై అసెంబ్లీ వేదికగా బీఆర్‌ఎస్ పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. తెలంగాణ భవన్‌లోని జనతా గ్యారేజీ తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయని, సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజలు అక్కడికి రావాలని సూచించారు.
ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజావ్యతిరేక విధానాలను నిలిపివేయాలని, 22ఏ నిషేధిత జాబితా నుంచి ఆస్తులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. 22ఏ నిషేధిత జాబితా విషయంలో ప్రభుత్వం రాత్రికి రాత్రే జీవోలు జారీ చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బండారి లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేష్, నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్, బద్దం పరుశురాంరెడ్డి, వీరేష్‌యాదవ్, వెంకన్న, నందికంటి శ్రీధర్, ఖలీల్, కార్పొరేటర్ విజయశాంతి, రాము, సునీత యాదవ్, శిరీషారెడ్డి, జగదీష్‌గౌడ్, రామచందర్ యాదవ్, కాలనీ సంక్షేమ సంఘాల నాయకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



