నిరుద్యోగి వేదన

The agony of unemploymentఅమాంతంగా చీకటైన గదిలో
అక్షరాలు నవ్వుతున్నాయి
నిరుద్యోగినైన నన్ను జూసి
సిగ్గుతో తల దించుకున్నాను
అల్మరాలోని డిగ్రీ పట్టాల
వెకిలి చూపులు
గుండెను మెలిపెట్టి కోస్తున్నై
తిరగేసిన పేజీల శబ్దం
వెన్నులో వణుకు పుట్టిస్తున్నది
ఆశయం ఆశ సన్నగిల్లి
చిద్రమైన బ్రతుకు చిత్రం

నిరుద్యోగి కన్నీటి వెల శూన్యమా?
నౌకరీ కావాలంటే నేరమా
మరి లాఠీలెందుకు నా వీపుపై
నెత్తుటిని పూస్తున్నై
నా కాలాన్ని మనోగాయాన్ని
కాజేసిన సర్కారుకు
జరిమానెవరు విధించాలి?
న్యాయమిక్కడ దేవులాటేనా?
భావి జ్ఞాన నిర్మాణం
పురిట్లోనే సమాధి చేద్దామా?
– అమృతరాజ్‌

Spread the love