ప్రతీ జిల్లాకు హెలిప్యాడ్‌ ఏర్పాటు లక్ష్యం

– ఆరేండ్లలో విమానయానం రెట్టింపు
– వచ్చే ఐదేండ్లలో 200 విమానాశ్రయాలకు విస్తరణ
– మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వెల్లడి
– వేడుకగా వింగ్స్‌ ఇండియా 2024 ప్రారంభం
నవతెలంగాణ – బిజినెస్‌ బ్యూరో
ప్రతీ జిల్లాలో ఒక హెలిప్యాడ్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సిందియా అన్నారు. వచ్చే ఆరేండ్లలో విమానయాన ప్రయాణికుల రెట్టింపు కానుందని ఆయన అంచనా వేశారు. విమానాల కొనుగోళ్లలో అమెరికా, చైనా తర్వాత భారత్‌ అతిపెద్ద దేశంగా ఉందన్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన వింగ్స్‌ ఇండియా 2024 ఏవియేషన్‌ ప్రదర్శనను గురువారం మంత్రి జ్యోతిరాధిత్య లాంచనంగా ప్రారంభించారు. ఎయిరిండియా ఎయిర్‌బస్‌ ఎ350ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి వికె సింగ్‌, తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి జ్యోతిరాధిత్య మాట్లాడుతూ.. ముంబయి, ఢిల్లీలో గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌ పోర్ట్‌లను అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. దేశంలో మరిన్ని గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టులు నిర్మించాల్సి ఉందన్నారు. దేశంలో 15 శాతం మహిళలు పైలట్లు, కెప్టెన్లుగా ఉన్నారని.. ఇది ప్రపంచంలోనే అధికమన్నారు. ఇటీవల డ్రోన్లకు ఎంతో డిమాండ్‌ పెరిగిందన్నారు. ఈ రంగంలోనూ డ్రోన్‌ మహిళ పైలట్లను తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇటీవల ఇండిగో, ఎయిర్‌ఇండియా, ఆకాశ ఎయిర్‌లైన్స్‌ పెద్ద మొత్తంలో బోయింగ్‌, ఎయిర్‌బస్‌ కంపెనీలకు విమానాలను ఆర్డర్‌ ఇచ్చాయన్నారు.
గతేడాది 2023లో 15.3 కోట్లుగా నమోదయిన దేశీయ విమానయాన ప్రయాణికుల సంఖ్య.. 2030 నాటికి 30 కోట్లకు చేరుకుంటుందని మంత్రి జ్యోతిరాధిత్య అంచనా వేశారు. విమాన ప్రయాణికుల పరంగా ప్రపంచంలోనే భారత్‌ మూడో స్థానంలో ఉందన్నారు. సాధారణ పౌరుడికి కూడా విమాన ప్రయాణ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం సంకల్పిస్తుందన్నారు. ఆ దిశగా సరలీకరిస్తున్నామని చెప్పారు. పౌర విమానయాన రంగంలో ఎన్నో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. ప్రయాణికుల పెరుగుదలకు తగినట్లుగా తగిన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఈ రంగంలో గడిచిన పదేళ్లలో ఎంతో ప్రగతి సాధించామన్నారు. 2047 నాటికి ఈ రంగాన్ని 20 లక్షల డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. గత పదేళ్లలో కొత్తగా 75 విమానాశ్రయాలను అందుబాటులోకి తెచ్చామని.. ప్రస్తుతం 149గా ఉన్న ఈ సంఖ్యను వచ్చే 2030 నాటికి 200కు చేర్చాలని నిర్దేశించుకున్నామన్నారు. 2023లో 1,622 వాణిజ్య పైలట్‌ లైసెన్సులు జారీ చేశామన్నారు. ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్ల సంఖ్య 2,700 నుంచి దాదాపు 4,000కి పెరిగిందన్నారు. ఈ ఏడాది అదనంగా 500 మంది ఉద్యోగులు చేరనున్నట్టు తెలిపారు.

2,840 కొత్త విమానాలు అవసరం : ఎయిర్‌బస్‌
వచ్చే 20 ఏళ్లలో భారత్‌కు 2,840 కొత్త విమానాలు, 41,000 మంది పైలట్‌లతో పాటు 47,000 మంది సాంకేతిక సిబ్బంది అవసరమవుతుందని ఎయిర్‌బస్‌ ఇండియా అండ్‌ సౌత్‌ ఏషియా ప్రెసిడెంట్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ రెమి మైలార్డ్‌ అన్నారు. వింగ్స్‌ ఇండియా ప్రదర్శన వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రెమి మాట్లాడుతూ.. ఎయిర్‌బస్‌ ప్రస్తుతం భారత్‌ నుంచి 750 మిలియన్‌ డాలర్ల వ్యాపారాన్ని కలిగి ఉండగా.. దశాబ్దం చివరి నాటికి భారతదేశం నుండి 1.5 బిలియన్‌ డాలర్లకు రెట్టింపు అవుతుందని ఆయన అంచనా వేశారు. గతేడాది ఎయిర్‌బస్‌ 750 విమానాల కోసం ఆర్డర్‌లను పొందిందని.. ఇందులో 75 యూనిట్లను డెలివరీ చేసిందన్నారు. గతేడాది ఇండిగో నుంచి 41, ఎయిర్‌ ఇండియా నుంచి 19, విస్తారా నుంచి 14, గో ఫస్ట్‌ నుంచి ఒక్కటి చొప్పున ఆర్డర్లను సంపాదించిందన్నారు. భారత్‌ నుంచి అంతర్జాతీయ విమానయాన సేవల్లో ఎ350 విప్లవాన్ని సృష్టించనుందన్నారు. ఇప్పటికే వాటిలో ఆరు విమానాలను గత సంవత్సరం ఎయిర్‌ ఇండియాకు డెలివరీ చేశామని రెమీ వెల్లడించారు. వచ్చే 20 ఏళ్లలో భారతదేశం ఏటా 6.2 శాతం వృద్థితో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్థి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఉండొచ్చన్నారు.
బోయింగ్‌కు ఆకాశ ఎయిర్‌ భారీ ఆర్డర్‌
విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్‌ గురువారం బోయింగ్‌తో భారీ ఒప్పందం కుదుర్చుకుంది. బోయింగ్‌ ‘737 మ్యాక్స్‌’ మోడల్‌కు చెందిన 150 విమానాల కొనుగోలుకు ఆర్డర్‌ ఇచ్చింది. తన సేవల విస్తరణలో భాగంగా ఈ ఒప్పందం కుదుర్చుకుంది. దేశీయ, అంతర్జాతీయంగా కొత్త మార్గాల్లో సర్వీసులను ప్రారంభించేందుకు వీటిని వినియోగించనున్నట్లు తెలిపింది. తాజా ఆర్డర్‌తో కలిపి మొత్తం విమానాల సంఖ్య 226కు చేరనుంది. ఇప్పటి వరకు దేశీయంగానే సేవలందిస్తున్న ఆకాశ ఎయిర్‌ త్వరలోనే అంతర్జాతీయ సర్వీసులను ప్రారంభించనుంది. ఇందుకు గతేడాదే అనుమతులు పొందింది.
106 దేశాల నుంచి రాక..
పౌర విమానయాన శాఖ ఆధ్వర్యంలో నాలుగు రోజులపాటు జరుగనున్న ఈ ప్రదర్శనకు ప్రపంచ దేశాల నుంచి ఆ రంగం ప్రతినిధులు హాజరవుతున్నారు. 106 దేశాల నుంచి 1500 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారని నిర్వాహకులు వెల్లడించారు. ప్రపంచంలోనే అతిపెద్ద విమానం బోయింగ్‌ 777-9 విమానంతో పాటు భారీ విమానాలు, చార్టెడ్‌ ఫ్లైట్లు, హెలికాప్టర్లు, డ్రోన్లను ప్రదర్శించారు. చివరి రెండు రోజులు 20, 21 తేదీల్లో సందర్శకులను అనుమతిస్తారు. టికెట్‌ ధర రూ.750గా నిర్ణయించారు. బుక్‌మై షో యాప్‌ ద్వారా ఈ టికెట్లను కొనుగోలు చేసుకోవడానికి వీలుంది. భారత వాయుసేనకు చెందిన సారంగ్‌ బృందం నిర్వహించిన ప్రత్యేక విన్యాసాలు చూపరులను ఆకర్షిస్తున్నాయి.

Spread the love