– సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి
– వికారాబాద్ జిల్లాలో ఘటన
నవతెలంగాణ-వికారాబాద్ ప్రతినిధి
పొగమంచు అలుముకుని దారి కనిపించక కారు చెరువులోకి దూసుకెళ్లింది.. దీంతో కారులో ఉన్న వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా వికారాబాద్ మున్సిపల్ పరిధిలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
వికారాబాద్‌లోని అనంతగిరి హిల్స్‌ను హైదరాబాద్ మాదాపూర్ నుంచి సోమవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో చూసేందుకు కారులో ఐదుగురు స్నేహితులు బయలుదేరారు. రఘు, మోహన్, సాగర్, గుణశేఖర్(24)తో పాటు పూజిత కారులో ఉన్నారు. శివారెడ్డిపేట దగ్గరికి రాగానే పొగమంచుతో రోడ్డు కనబడకపోవడంతో కారు చెరువులోకి దూసుకెళ్లింది. అందులో రఘుకి ఈత రావడంతో సాగర్, మోహన్, పూజితను రక్షించాడు. గుణశేఖర్ కారుతోపాటు మునిగిపోయాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి రెస్క్యూ చేపట్టారు. ముందుగా కారును బయటకు తీశారు. అనంతరం గుణశేఖర్ మృతదేహం లభ్యమైంది. కారుకి ఇరువైపులా డ్యామేజ్లు ఉండటంతో వేరే ఏదైనా వాహనాన్ని ఢకొీట్టారా అనే విషయం తెలియాల్సి ఉంది. పూజిత ఇటీవల అమెరికా నుంచి వచ్చింది. వీరంతా సాఫ్వేర్ ఉద్యోగాలతో పాటు బిజినెస్‌లు చేస్తున్నారు. అయితే బస్సు తమ కారును ఢకొీట్టడంతో పొగమంచులో కనిపించక చెరువులోకి దూసుకెళ్లినట్టు పూజిత తెలిపింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.