అమెరికా పర్యటనకు అనుమతి
ఇవ్వకపోవడం తెలంగాణ ప్రజల్ని అవమానించడమే
గుజరాత్ సీఎంకు ఎలా అనుమతి ఇచ్చారు?
ప్రధాని మోడీ తీరు ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం
ఈ చర్యను పార్లమెంటులో ప్రస్తావిస్తాం
కేంద్రంపై సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ర్టంపట్ల తీవ్ర వివక్ష ప్రదర్శిస్తున్నదని సీఎం ఏ రేవంత్‌రెడ్డి అన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి అమెరికా పర్యటనకు అనుమతి ఇచ్చి, తెలంగాణ సీఎంకు ఎందుకు నిరాకరించారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ తీరు ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందన్నారు. యూకే పర్యటనకు అనుమతి ఇచ్చి, అమెరికా పర్యటనను అడ్డుకోవడం వెనుక కేంద్రం ఉద్దేశమేంటని ప్రశ్నించారు. తన పర్యటనను అడ్డుకున్నంత మాత్రాన తెలంగాణ అభివృద్ధి లక్ష్యాన్ని ఆపలేరని స్పష్టం చేశారు. విద్య, క్రీడల్లో పెట్టుబడుల కోసమే తాను అమెరికా పర్యటనకు వెళ్లాలని భావించాననీ, పర్యటనకు ముందు భారత విదేశాంగ శాఖకు పూర్తి సమాచారం అందించామన్నారు. విదేశీ పర్యటనను అర్థంతరంగా ముగించుకొని సోమవారం తెల్లవారుజామున సీఎం ఏ రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌కు చేరుకున్నారు. అనంతరం మధ్యాహ్నం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ర్ట సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, సహచర మంత్రులు ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా ఎండగట్టారు. రాష్ర్టంలోని బీజేపీ నాయకులు తన పర్యటన నిలుపుదలపై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ బీజేపీ నేతలు గుజరాత్‌కు గులాంలుగా మారతారో, తెలంగాణ ప్రజల పక్షాన ఉంటారో తేల్చుకోవాలని ఆగ్రహం వ్యక్తంచేశారు. తన పర్యటనను అర్థంతరంగా నిలిపివేయడం అక్షరాలా తెలంగాణలోని నాలుగు కోట్ల ప్రజానీకాన్ని అవమానించడమేని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ కారణాలతో అనుమతి ఇవ్వలేదని ఏకవాక్యం ద్వారా తన పర్యటనను నిలుపుదల చేయాల్సిన అవసరం ఏమోచ్చిందని నిలదీశారు. డిసెంబర్‌లో రాష్ర్టంలో జరిగే గ్లోబల్ ఇన్వెస్ట్ సమ్మిట్, తెలంగాణ రైజింగ్ విజన్ 2047 ప్రచారం కోసమే తాను విదేశీ పర్యటనలకు వెళ్తున్నట్టు కేంద్రానికి స్పష్టంగా రాతపూర్వకంగా తెలిపామంటూ సదరు లేఖను మీడియా ఎదుట ప్రదర్శించారు. ఆగస్టు 17 నుంచి 28 వరకు అమెరికా, కెనడా పర్యటనకు ‘వైబ్రెంట్ గుజరాత్’ పేరుతో ఆ రాష్ర్ట సీఎంకు ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. ఈ చర్యల్ని చూస్తే బారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు కూడా బీజేపీలో చేరినట్టు కనిపిస్తుందని ఆక్షేపించారు. ఇవే విషయాలను తాను విదేశాల్లో ఉండగా ప్రస్తావిస్తే దేశం పరువు తీస్తున్నారనీ, దేశద్రోహి అని బీజేపీ నాయకులు వ్యాఖ్యానిస్తారనే తాను సంయమనంతో స్వరాష్ర్టానికి వచ్చి మాట్లాడుతున్నానని వివరణ ఇచ్చారు. కేంద్రం తన పర్యటనను మాత్రమే అడ్డుకోగలిగిందనీ, తన లక్ష్యాన్ని ఆపలేరని స్పష్టంచేశారు. రాష్ర్టాభివృద్ధి తెలంగాణ బీజేపీ ఎంపీలకు అవసరం లేదా…వారు గుజరాత్‌ను సపోర్ట్ చేస్తున్నారా అని ప్రశ్నించారు. రాజకీయ కారణాలతో తన అమెరికా పర్యటనను తిరస్కరిస్తున్నామని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొన్నదనీ, ఆ రాజకీయ కారణాలు ఏమిటో ప్రధాని నరేంద్ర మోడీ చెప్పాలని డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీ, అంబేద్కర్ ఇంగ్లాండ్ లో చదువుకుని దేశానికి దార్శనికులుగా మారారనీ, అలాంటి ఉన్నత చదువులు, క్రీడల్ని తెలంగాణలోని ఆర్ధికంగా వెనకబడిన వారికోసం తేవాలని తాము ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ప్రధాని ఇంకా గుజరాతీగానే వ్యవహరిస్తున్నారు తప్ప, భారత ప్రధానిగా వ్యవహరించడం లేదని ఆక్షేపించారు. ఈ అంశాన్ని తమపార్టీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ, ఎంపీలు కచ్చితంగా పార్లమెంటులో ప్రస్తావిస్తారని చెప్పారు. ఇన్వెస్ట్ తెలంగాణ ఆధ్వర్యంలో తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026 ను డిసెంబర్ 8,9 తేదీల్లో నిర్వహిస్తున్నామని తెలిపారు. విదేశాల్లో తాము పాల్గొనే అన్ని అధికారిక కార్యక్రమాలు భారత రాయబార కార్యాలయం పర్యవేక్షణలోనే జరుగుతాయన్నారు. రాజకీయ పార్టీల మధ్య సిద్ధాంత వైరుధ్యాలు ఉండొచ్చనీ, కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు ఉండాలని అన్నారు. కేంద్రం వైఖరి దీనికి పూర్తి భిన్నంగా ఉందని విమర్శించారు.
కొండా సురేఖపై క్రమశిక్షణా సంఘందే తుది నిర్ణయం
మంత్రి కొండా సురేఖ కుమార్తె సీఎం ఏ రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు పార్టీ క్రమశిక్షణా సంఘం పరిధిలో ఉన్నాయనీ, దానిపై వారే తుది నిర్ణయం తీసుకుంటారని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సీఎం సమాధానం చెప్పారు. పార్టీలో క్రమశిక్షణ ముఖ్యమనీ, దాన్ని నాయకులు, ప్రభుత్వంలో ఉన్నవారి నుంచి కార్యకర్తల వరకు అందరూ పాటించాలని చెప్పారు.
కేంద్రానిది ముమ్మాటికీ వివక్షే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



