హుజురాబాద్ లో ఎగిరేది కాంగ్రెస్ జెండా నే..

– కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వొడితల ప్రణవ్ బాబు
నవతెలంగాణ- జమ్మికుంట: మాయమాటలతోప్రజలను మోసం చేసేందుకు వస్తున్న పువ్వు పార్టీలను నియోజకవర్గం నుండి తరిమికొట్టాలని, గతంలో కల్లిబొల్లి మాటలతో అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌, బీజేపీ ఎర్రి పుష్పాలను ఏరిపారేయాలని కాంగ్రెస్ అభ్యర్థి వోడితల ప్రణవ్ బాబు అన్నారు. శనివారం  జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని మోతులగూడెం, అంబేద్కర్ కూడలి వద్ద ఏర్పాటుచేసిన కార్నర్ మీటింగ్ లో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీలు దొందు దొందేనని ఆయన ధ్వజమెత్తారు. నియోజకవర్గం లోని ప్రజలందరి  కష్టాలలో తోడుంటా అని, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ, మీ కష్టసుఖాలలో పాలుపంచుకుంటానని అని చెప్పారు.   తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పది సంవత్సరాలపాటు రాష్ట్రాన్ని పాలించిందని, ప్రజలకు చేసింది ఏందని ప్రశ్నించారు. మేనిఫెస్టో రూపొందించిన తర్వాత మేము నిర్ణయించిన 500 గ్యాస్ సిలిండర్ ధరను 400 కి ఇస్తాను అనడం విడ్డూరంగా ఉందన్నారు. గత పదెల్లుగా అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకురాని సిలిండర్ ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది అని ప్రశ్నించారు. నియోజకవర్గంలోని హమాలి కార్మికుల సంక్షేమం కోసం హమాలీ బోర్డ్ ఏర్పాటు కోసం కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. మాటిచ్చి నెరవేర్చే తత్వం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంటుందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టే ప్రతి పథకాన్ని మీ ఇంటికి చేర్చేబాధ్యత తీసుకుంటానని మాట ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన మేనిఫెస్టోలో మహిళలకు పెద్దపీట వేసిందన్నారు.  ఏడుసార్లు హుజురాబాద్ నియోజకవర్గం నుండి గెలుపొందిన వ్యక్తి ఈ ప్రాంతానికి చేసింది ఏమీ లేదన్నారు. మళ్లీ మూడేళ్ల క్రితం వచ్చి నన్ను చంపుకుంటారో.. సాదుకుంటారో… అంటే మళ్ళీ అవకాశం ఇచ్చినప్పటికీ హుజురాబాద్ నియోజకవర్గం అభివృద్ధి కోసం ఒక్క రూపాయి నిధులను సైతం తీసుకురాలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో  పార్టీ సీనియర్ నాయకులు పత్తి కృష్ణారెడ్డి, తుమ్మేటి సమ్మిరెడ్డి, పొన్నగంటి  మల్లయ్య, దాసరి భూమయ్య , అరుకాల వీరేశలింగం, మొలుగూరి సదయ్య , కసుబోసులవెంకన్న, ఎగ్గని శ్రీనివాస్, సలీం తదితరులు పాల్గొన్నారు.
Spread the love