రేపటితో అధిక పింఛన్‌ దరఖాస్తుకు ముగియనున్న గడువు

EPFOనవతెలంగాణ – హైదరాబాద్‌: ఈపీఎఫ్‌వో పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు, కార్మికులకు అధిక పింఛన్ మరో రోజు మాత్రమే మిగిలి ఉన్నది. ఇప్పటికే మూడుసార్లు పొండిగించిన తుది గడువు మంగళవారం (జూలై 11) ముగియనుంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా అధిక పింఛన్‌కు కోసం 18 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇంకా అప్లయ్‌ చేసుకోనివారు ఈ రెండు రోజుల్లో పూర్తిచేయాలని సూచించారు. 2014 సెప్టెంబర్‌ 1వ తేదీకి ముందు సర్వీసులో చేరి.. గరిష్ఠ వేతన పరిమితికి మించి వేతనం పొందుతూ ఆ మేరకు చందా చెల్లిస్తున్న ఉద్యోగుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఈపీఎఫ్‌వో స్వీకరిస్తున్నది. కాగా, అధిక పెన్షన్‌ గడువు జూన్‌ 26తో ముగియాల్సి ఉన్నది. అయితే ఆన్‌లైన్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో జూలై 11 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. అంతకు ముందు మార్చి 3 నుంచి మే 3 వరకు, ఆపై జూన్‌ 26 వరకు తుది గడువును పొడిగించుకుంటూ వచ్చింది. కాగా, వివిధ నిబంధనలపై స్పష్టత లేకపోవడం, ఈపీఎఫ్‌వో వివరణలు జాప్యంకావడం వంటి కారణాలతో ఎంప్లాయీ పెన్షన్‌ స్కీమ్‌ నుంచి వచ్చే అధిక పెన్షన్‌ కోసం మెజారిటీ ఉద్యోగులు ఇంకా దరఖాస్తులు సమర్పించలేదు.

Spread the love