ఓటు హక్కు దారులందరూ ప్రత్యేక శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి జిల్లా కలెక్టర్

నవతెలంగాణ-తాడ్వాయి : ఓటరు నమోదు కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్  కోరారు. ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం లో భాగంగా ఆదివారంమాచారెడ్డి, పల్వంచ, భవాని పేట గ్రామాల్లోని  పోలింగ్ కేంద్రాలను సందర్శించి ప్రత్యేక శిబిరాల నిర్వహణ తీరుతెన్నులను,  ఓటరు జాబితాలను పరిశీలించారు. బిఎల్ఓల వద్ద గల రిజిస్టర్లను తనిఖీ చేసి, ఓటర్ల నమోదు, మార్పులు చేర్పుల వివరాలను పరిశీలించారు. ప్రత్యేక శిబిరంలో ఇప్పటి వరకు ఎంత మంది కొత్త ఓటర్లు నమోదు చేసుకున్నదీ, ఫారమ్ – 6, 8 ఎన్ని వచ్చాయని ఆరా తీసారు. ప్రత్యేక శిబిరాల గురించి విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. చనిపోయిన ఓటర్లు గాని ఉన్నట్లయితే వారి మరణ దృవీకరణ పత్రం లేదా వారు మరణించినట్లుగా ఫామ్-7 లో నమోదు చేసి దృవీకరించి పంపించాలని తెలిపారు.   ఒకే ఇంటి నెంబరుపై ఎక్కువ మంది ఓటర్లు ఉన్నట్లయితే స్వయంగా వెళ్లి పరిశీలించాలని, ఫోటో కరెక్షన్, డబల్ ఎంట్రి మరియు ఇతర పొరపాట్లు లేకుండా సరిచేయాలని తెలిపారు.  జాబితాలో మార్పులు, చేర్పులకు మరో అవకాశం లేనందున ఈ క్యాంపేయిన్ ల ద్వారా పోలింగ్ బూత్  పరిధి లోని అర్హులైన ప్రతి ఓటరు వివరాలు పక్కాగా ఉండేలా చూడాలన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఓటరు నమోదు  ప్రత్యేక శిబిరాలను వచ్చే నెల  2, 3 తేదీల్లో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని, అక్టోబర్ 1, 2023 నాటికి 18 సంవత్సరాలు నిండే ప్రతి ఒక్కరూ  ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు.  ప్రత్యేక  శిబిరాల రోజులలో జిల్లా లోని  791  పోలింగ్ కేంద్రాలలో బూత్ స్థాయి అధికారులు ఓటరు జాబితాతో అందుబాటులో ఉంటారని అన్నారు. . కొత్తగా ఓటరు నమోదుకు ఫారం- 6, సవరణలు, మార్పులు, చేర్పులకు ఫారం 8, తొలగింపుకు ఫారం 7 ను వినియోగించుకోవాలని సూచించారు . ఆయా ఫారాలు అన్ని పోలింగ్ కేంద్రాలలో అందుబాటులో ఉంటాయని అన్నారు.  ప్రత్యేక ఓటరు శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకొని ఓటరు జాబితాలో తమ పేరు ఉన్నదీ లేనిది పరిశీలించుకొని, పెరు లేకపోయినా,   తప్పులున్నా వెంటనే సంబంధిత ఫారాలు  నింపి బి.ఎల్.ఓ లకు అందజేయాలని సూచించారు. ఓటు వజ్రాయుధం లాంటిదని, ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటే కీలకమని గుర్తించి ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.
Spread the love