– తృటిలో పతకం చేజార్చుకున్న అర్జున్
– నాల్గో స్థానానికి పరిమితమైన భారత షుటర్
– పారిస్ 2024 ఒలింపిక్స్
ఒలింపిక్ పతకం. ప్రతి క్రీడాకారుడు జీవిత కాలంలో ఒక్కసారైనా సాధించాలని తపిస్తాడు. ఆ మెడల్ కోసం ఏండ్లకు ఏండ్లు కష్టపడతాడు. పతక వేటలో ఉత్తమ ప్రదర్శన చేసినా.. ఒత్తిడి, ఆందోళనలో గురి తప్పిన ఒక్క షాట్ ఒలింపిక్ మెడల్‌ను దూరం చేస్తే ఆ వేదన వర్ణించలేనిది. 2016 రియో ఒలింపిక్స్‌లో జిమ్నాస్ట్ దీప కర్మాకర్.. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో షుటర్ అర్జున్ బబుత ఒలింపిక్ పతకానికి అడుగు దూరంలో ఆగిపోయారు. మెన్స్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అర్జున్ బబుత నాల్గో స్థానంలో నిలిచి.. కాంస్య పతకం చేజార్చుకున్నాడు. పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ ఇప్పటివరకు ఓ కాంస్య పతకం సొంతం చేసుకుంది.
నవతెలంగాణ-పారిస్
2024 ఒలింపిక్స్‌లో భారత యువ షుటర్ అర్జున్ బబుత కల చెదిరింది!. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో సత్తా చాటి ఫైనల్‌కు చేరుకున్న అర్జున్.. పతక పోరులో ఆద్యంతం ఆకట్టుకున్నాడు. టాప్-3లో కొనసాగుతూ పతకంపై ఆశలు రేపాడు. కానీ కీలక తరుణంలో గురి తప్పిన అర్జున్ టాప్-3 నుంచి నిష్క్రమించాడు. నాల్గో స్థానంలో నిలిచి కాంస్య పతకానికి దూరమయ్యాడు. 0.1 పాయింట్ వ్యత్యాసంతో మను బాకర్ సిల్వర్ మెడల్ చేజార్చుకోగా.. 1.4 పాయింట్ వ్యత్యాసంతో నేడు అర్జున్ బబుత కాంస్య పతకానికి దూరమయ్యాడు. పారిస్ ఒలింపిక్స్‌లో ఆదివారం మను బాకర్ కాంస్య పతకంతో భారత్‌కు పతక బోణీ కొట్టగా.. సోమవారం సైతం మరో మెడల్ ఖాతాలో పడినట్టే అనిపించింది. సోమవారం మూడు పతక ఈవెంట్లలో పోటీపడిన టీమ్ ఇండియా.. ఒక్క మెడల్‌ను సైతం దక్కించుకోలేదు.
ఆశలు ఆవిరి
పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగం అర్హత రౌండ్‌లో మెప్పించిన అర్జున్ బబుత.. పతక పోరులోనూ అదే జోరు కొనసాగించాడు. మెడల్ రేసులో టాప్-8 షుటర్లు పోటీపడినా.. ఆఖరు వరకు పోటీపడ్డాడు. తొలి దశ సిరీస్1లో 10.7, 10.2, 10.5, 10.4, 10.6 స్కోరు చేశాడు. సిరీస్2లో 10.7, 10.5, 10.4, 10.4, 10.6, 10.4తో రాణించాడు. తొలి దశలో అద్బుతంగా గురి ఎక్కుపెట్టిన అర్జున్.. రెండో దశ సింగిల్ షాట్స్‌లో కాస్త లెక్క తప్పాడు. 13వ షాట్ 9.9 స్కోరు చేయగా.. 18వ షాట్ 10.1 స్కోరు, 20వ షాట్ 9.5 స్కోరు చేశాడు. ఈ మూడు షాట్లలో స్వల్ప స్కోర్లు అర్జున్ కాంస్య పతక అవకాశాలను దారుణంగా దెబ్బతీశాయి. ఓవరాల్‌గా 208.4తో అర్జున్ నాల్గో స్థానంలో నిలువగా.. క్రోయేషియా షుటర్ మిరాన్ 230.0 పాయింట్లతో కాంస్య పతకం సాధించాడు. స్వీడన్ షుటర్ 251.4 స్కోరుతో సిల్వర్ మెడల్ దక్కించుకున్నాడు. 252.2 స్కోరు ఒలింపిక్ రికార్డుతో చైనా షుటర్ షెంగ్ లియాహౌ బంగారు పతకం కైవసం చేసుకున్నాడు.
ఆర్చరీలో అదే వ్యథ
ఆర్చరీ జట్టు విభాగంలో మహిళల టీమ్ బాటలోనే పురుషుల జట్టు నడిచింది. పతక అవకాశాలు మెండుగా ఉన్నప్పటికీ సిసలైన సమయంలో గురి తప్పింది. మెన్స్ జట్టు విభాగం క్వార్టర్‌ఫైనల్లో టర్కీ చేతిలో 2-6తో పరాజయం పాలైంది. బొమ్మదేవర ధీరజ్, ప్రవీణ్ జాదవ్, తరుణ్‌దీప్ రారు త్రయం నిరాశపరిచారు. 53-57, 52-55, 54-58తో వెనుకంజ వేశారు. . నాల్గో సెట్‌లో మాత్రమే 55-54తో పైచేయి సాధించారు. దక్షిణ కొరియా స్వర్ణం సాధించగా, ఆతిథ్య ఫ్రాన్స్ సిల్వర్ మెడల్ సొంతం చేసుకుంది. కాంస్య పతక పోరులో చైనాపై టర్కీ 6-2తో పైచేయి సాధించి బ్రాంజ్ మెడల్‌ను ఖాతాలో వేసుకుంది.