తెలంగాణ స్పోర్ట్స్‌ హబ్‌ కలను సాకారం చేస్తా…

తెలంగాణ స్పోర్ట్స్‌ హబ్‌ కలను సాకారం చేస్తా...– ఢిల్లీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్‌ రెడ్డి
– బాధ్యతలు స్వీకరణ
– రాష్ట్ర అభివృద్ధిలో తనవంతు పాత్ర పోషిస్తానని వెల్లడి
– ఐకాన్‌ టవర్‌గా తెలంగాణ భవన్‌ నిర్మిస్తాం : మంత్రి కోమటి రెడ్డి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
తెలంగాణ రాష్ట్రాన్ని స్పోర్ట్స్‌ హబ్‌గా మార్చాలన్న సీఎం రేవంత్‌ రెడ్డి కలను సాకారం చేస్తానని ఢిల్లీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి (ఎస్సార్‌) ఏపీ జితేందర్‌ రెడ్డి అన్నారు. ఈ దిశలో క్రీడా రంగంలో తన అనుభవాన్ని జోడించి రాష్ట్రానికే మేలు చేసేలా తనవంతు పాత్ర పోషిస్తానని వెల్లడించారు. 2036లో ఇండియాలో ఒలంపిక్స్‌ నిర్వహించే ఆస్కారం ఉందన్నారు. ఆ అవకాశం భారత్‌కు దక్కితే… హైదరాబాద్‌లో ఒలంపిక్స్‌ నిర్వహించేలా ప్రణాళికతో ముందుకెళ్తున్నట్టు చెప్పారు. గడిచిన పదేండ్లలో స్పోర్ట్స్‌ రంగంలో తెలంగాణ వెనకబడిందన్నారు. బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఎస్సార్‌గా జితేందర్‌ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జ్‌ దీపా దాస్‌ మున్షి, మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి, ఎంపీ మల్లు రవి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌ వెంకటస్వామి, మాజీ మంత్రి జానా రెడ్డి, వంశీచందర్‌ రెడ్డి, సంపత్‌, ఇతర నేతలు హాజరై జితేందర్‌ రెడ్డికి అభినందనలు తెలిపారు. బాధ్యతల స్వీకరణకు ముందు జితేందర్‌ రెడ్డి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమరవీరుల స్థూపం, అంబేద్కర్‌ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం గురజాడ హాల్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తాజాగా ఖేలో ఇండియా స్కీంకు తెలంగాణ ప్రభుత్వం అప్లై చేసిందన్నారు. ఈ స్కీంలో వచ్చే నిధులతో రాష్ట్రంలో క్రీడా మౌలిక వసతుల కల్పనను పెంపొందిస్తామన్నారు. అలాగే భవిష్యత్‌లో జరగబోయే ఇంటర్నేషల్‌ స్పోర్ట్స్‌ ఈవెంట్స్‌కు హైదరాబాద్‌ వేదికయ్యేలా కషి చేస్తానని చెప్పారు. అలాగే గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులను ప్రోత్సహిస్తూ… జాతీయ స్థాయి వరకు వారు ఎదిగేందుకు బాటలు వేస్తామన్నారు. లోక్‌సభ పక్షనేతగా తనకున్న అనుభవం, కేంద్ర మంత్రులతో పరిచయాలతో అన్ని రంగాల్లో తెలంగాణకు రావాల్సిన పెండింగ్‌ నిధులు, అభివద్ధి ఫండ్స్‌ రాబట్టేలా కషి చేస్తానని చెప్పారు.
ఐకానిన్‌ టవర్‌ గా తెలంగాణ భవన్‌…: మంత్రి కోమటి రెడ్డి
దేశ రాజధాని ఢిల్లీలో ఐకానిక్‌ టవర్‌గా తెలంగాణ భవన్‌ను నిర్మించ బోతున్నట్లు రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి అన్నారు. అన్ని సౌకర్యాలు, హంగులతో ఈ భవన్‌ ఉంటుందని తెలిపారు. చిన్న రాష్ట్రాలైనా సిక్కిం కూడా దేశ రాజధానిలో అద్భుతమైన గెస్ట్‌ హౌజ్‌ నిర్మించుకుందని చెప్పారు. అలాంటప్పుడు రాష్ట్రం ఏర్పడి పదేండ్లయినా తెలంగాణకు భవన్‌ లేకపోవడం బాధగా ఉందన్నారు. ఉన్నా… ఆ భవన్‌ను ఇంకా ఏపీ భవన్‌గానే పిలుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తాను మంత్రిగా చార్జ్‌ తీసుకున్న మూడోరోజునే… తెలంగాణ భవన్‌ నిర్మాణంపై ఫోకస్‌ చేసినట్లు తెలిపారు. ఈ దిశలో ఏపీ ప్రభుత్వంతో చర్చించి తెలంగాణకు.. పటౌడి హౌజ్‌లో ఐదున్నర ఎకరాలు, శబరి బ్లాక్‌లో మూడున్నర ఎకరాలు కేటాయించేలా ఒప్పించామన్నారు. హైదరాబాద్‌ హౌజ్‌ పక్కన స్థలంలో గవర్నర్‌, సీఎం, మంత్రుల సూట్స్‌ నిర్మించనున్నట్లు తెలిపారు. పటౌడి హౌజ్‌ జీ ప్లస్‌ వన్‌లో విశాలమైన తెలంగాణ భవన్‌ గెస్ట్‌ హౌజ్‌ కడతామన్నారు. మంగళవారం దాదాపు రెండు గంటల పాటు తెలంగాణ భవన్‌కు సంబంధించిన పలు డిజైన్లపై నిపుణులు ప్రజేంటేషన్‌ ఇచ్చారన్నారు. అందులో ఆడంబరాలు, రాజగోపురాలు పెట్టారని…వాటి తొలగింపు, పలు మార్పులు చేయాలని నిపుణులకు సూచించినట్లు పేర్కొన్నారు. ఈ డిజైన్‌ ఫైనల్‌ కాగానే… హైదరాబాద్‌లో సీఎంకు ప్రజెంటేషన్‌ ఇచ్చి వారం రోజుల్లో డీపీఆర్‌ పూర్తి చేస్తామని చెప్పారు. కేవలం రెండు నెలల్లో టెండర్లు పిలిచి, పనులు ప్రారంభించేలా ప్లాన్‌ చేస్తున్నామన్నారు. కేవలం మూడు నెలల్లో భవన్‌ నిర్మాణానికి ఢిల్లీ ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు పొందేలా చూడాలని ఆర్‌ అండ్‌ బీ అధికారులను ఆదేశించినట్టు చెప్పారు.

Spread the love