వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ
మధుసూదన్ నేతృత్వంలో వైద్యబృందాన్ని సన్మానించిన మంత్రి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
భారత్‌లోనే తొలిసారి ప్రభుత్వ హాస్పిటల్‌లో ఒకే రోగికి, ఒకేసారి ఐదు అవయవాల (మల్టీ-విసెరల్) మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి వైద్య చరిత్రలో అరుదైన ఘనత సాధించిన ఉస్మానియా డాక్టర్ల బృందం కృషి దేశానికే గర్వకారణమని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ కొనియాడారు. ఉస్మానియా జనరల్ హాస్పిటల్ వైద్య బృందాన్ని మంత్రి శుక్రవారం సచివాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ట్రాన్స్‌ప్లాంట్ లో పాలుపంచుకున్న డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందికి శాలువాలు కప్పి అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సల్లో ఒకటిగా భావించే మల్టీ-విసెరల్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ను డాక్టర్ మధుసూదన్ నేతృత్వంలోని బృందం 36 గంటల పాటు శ్రమించి ఈ అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించడం అసాధారణ విజయమని కొనియాడారు. ఈ చారిత్రాత్మక విజయానికి కృషి చేసిన ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్లు, అనస్థీషియా నిపుణులు, గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు, క్రిటికల్ కేర్ వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ట్రాన్స్‌ప్లాంట్ కోఆర్డినేటర్లు, ఇతర సిబ్బంది అందరికీ మంత్రి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
అవయవదానం ద్వారా మరో ప్రాణానికి జీవం పోసిన అవయవదాత కుటుంబ సభ్యుల సేవాభావాన్ని మంత్రి ప్రత్యేకంగా కొనియాడారు. “అవయవదానం..మహాదానం” అనే సందేశాన్ని ప్రతి ఒక్కరూ సమాజంలో విస్తృతంగా చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులల్లో వైద్యసేవలందించేలా తీర్చిదిద్దు తున్నామని తెలిపారు. రోగ నిర్దారణ కోసం అత్యాధునిక ఎక్విప్‌మెంట్, ఆపరేషన్ థియేటర్లు అందుబాటులోకి తీసుకొస్తున్నామనీ, అన్ని ఆస్పత్రులకు సొంత భవనాలు కట్టిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రజలకు అన్నిరకాల మెరుగైన వైద్య సేవలు అందించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా డాక్టర్లు, వైద్య సిబ్బంది అంకితభావంతో పనిచేస్తూ జాతీయ స్థాయిలో తెలంగాణకు గుర్తింపు తీసుకొస్తున్నారని ప్రశంసించారు.
ఉస్మానియా డాక్టర్ల కృషిదేశానికే గర్వకారణం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



