ఇంగ్లాండ్‌ కథ ముగిసే

England's story ends– 8 పరుగుల తేడాతో అఫ్గాన్‌ అద్భుత విజయం
– ఉత్కంఠ ఛేదనలో బట్లర్‌సేన చతికిల
– ఐసీసీ 2025 చాంపియన్స్‌ ట్రోఫీ
లాహౌర్‌ (పాకిస్థాన్‌) : ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీలో అఫ్గనిస్థాన్‌ అద్భుతం చేసింది. బ్యాట్‌తో, బంతితో మెరుగైన ప్రదర్శన చేసిన అఫ్గనిస్థాన్‌ కీలక మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై 8 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం నమోదు చేసింది. గ్రూప్‌-బి సెమీఫైనల్‌ రేసు రసవత్తరంగా మారిన నేపథ్యంలో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ చతికిల పడింది. అఫ్గనిస్థాన్‌ నిర్దేశించిన 326 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్‌ ఛేదించలేకపోయింది. 49.5 ఓవర్లలో 317 పరుగులకు కుప్పకూలింది. అఫ్గాన్‌ పేసర్‌ అజ్మతుల్లా ఓవర్‌జారు (5/58) ఐదు వికెట్ల ప్రదర్శనతో విజృంభించగా.. మహ్మద్‌ నబి (2/57) రాణించాడు. ఛేదనలో 30/2తో కష్టాల్లో చిక్కుకున్నా.. జో రూట్‌ (120, 111 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచరీతో ఇంగ్లాండ్‌ను రేసులో నిలిపాడు. బెన్‌ డకెట్‌ (38), జోశ్‌ బట్లర్‌ (38), జెమీ ఓవర్టన్‌ (32), హ్యారీ బ్రూక్‌ (25) రాణించినా.. ఆఖర్లో వరుసగా వికెట్లు కోల్పోవటం ఇంగ్లాండ్‌ను దెబ్బతీసింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన అఫ్గనిస్థాన్‌ నిర్ణీత 50 ఓవర్లలో 325/7 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్‌ ఇబ్రహీం జద్రాన్‌ (177, 146 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్స్‌లు) అఫ్గనిస్థాన్‌ తరఫున వ్యక్తిగత అత్యధిక స్కోరుతో పాటు చాంపియన్స్‌ ట్రోఫీలో అత్యధిక స్కోరు రికార్డును బద్దలుకొట్టాడు. హష్మతుల్లా షాహిది (40), అజ్మతుల్లా ఓమర్‌జారు (41), మహ్మద్‌ నబి (40) ఆఖర్లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. శతక వీరుడు ఇబ్రహీం జద్రాన్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు. ఒత్తిడిని జయిస్తూ ఇంగ్లాండ్‌ను చిత్తు చేసిన అఫ్గనిస్థాన్‌ సెమీఫైనల్‌ ఆశలను సజీవంగా నిలుపుకుంది. గ్రూప్‌-బి చివరి మ్యాచ్‌లో అస్ట్రేలియాపై నెగ్గితే అఫ్గనిస్థాన్‌ నేరుగా సెమీఫైనల్‌కు అర్హత సాధించనుంది. ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికా మ్యాచ్‌ సఫారీలను సెమీస్‌ అవకాశాలను శాసించనుంది.

Spread the love